Bejing: ఆర్థిక సుడిగుండంలో చైనా.. కోలుకునే సత్తా ఉందంటున్న నిపుణులు…

ఓవైపు అగ్రరాజ్యం కావాలన్న కల ఊరిస్తుంటే.. ఆర్థిక సుడిగుండం చైనా (China) ను కిందకు లాగేస్తోంది. ప్రస్తుతం డ్రాగన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒత్తిడితో సతమతమవుతోందంటున్నారు నిపుణులు. నిశితంగా పరిశీలిస్తే.. పారిశ్రామికోత్పత్తి, ప్రజల కొనుగోళ్లు మందగించాయి. రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. నిరుద్యోగం పెరుగుతోంది. ఈ గణాంకాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, చైనా ఆర్థిక వ్యవస్థ వెంటనే కుప్పకూలిపోయే ప్రమాదం లేదని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ, వాటిని తట్టుకుని నిలబడే సత్తా చైనాకు ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం, చైనా ఆర్థిక వ్యవస్థ బలహీనపడినట్లు స్పష్టమవుతోంది. ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి వృద్ధి 5.2 శాతానికి పరిమితమైంది. జులైలో ఇది 5.7 శాతంగా నమోదైంది. రిటైల్ అమ్మకాల వృద్ధి కూడా 3.7 శాతం నుంచి 3.4 శాతానికి పడిపోయింది. నిరుద్యోగ రేటు 5.3 శాతానికి పెరిగింది. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు ఏకంగా 12.9 శాతం కుంగిపోయాయి. గత ఏడాది ఆగస్టు తర్వాత ఈ కీలక రంగాల్లో ఇంత తక్కువ వృద్ధి నమోదు కావడం ఇదే మొదటిసారి.
చైనా ఆర్థిక వ్యవస్థపై పరిశోధన చేసే ‘గేవ్కల్ డ్రాగనోమిక్స్’ వ్యవస్థాపకుడు ఆర్థర్ క్రోబెర్ మాట్లాడుతూ, “చైనాలో ప్రతి ద్రవ్యోల్బణం, పరిశ్రమల్లో అదనపు సామర్థ్యం, బలహీనమైన ఉద్యోగ మార్కెట్, కుదేలైన ప్రాపర్టీ మార్కెట్ వంటి ఎన్నో తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. ప్రజల కొనుగోలు శక్తి కూడా మందగించింది” అని పేర్కొన్నారు. అయితే, ఉత్పత్తి పరంగా కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. పీటర్సన్ ఇన్‌స్టిట్యూట్ నిపుణుడు టియాన్లీ హువాంగ్ స్పందిస్తూ, “చైనా హౌసింగ్ బబుల్ పతనం, బలహీనమైన వినియోగదారుల డిమాండ్ వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తతల వల్ల ఎగుమతులు కూడా తగ్గుతున్నాయి. అయినప్పటికీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే స్థితిలో లేదు” అని స్పష్టం చేశారు.
అమెరికా విధించిన వాణిజ్య సుంకాలు, బహుళజాతి కంపెనీలు ‘చైనా ప్లస్ వన్’ వ్యూహంలో భాగంగా వియత్నాం, భారత్, మెక్సికో వంటి దేశాలకు తమ ఉత్పత్తిని తరలించడం వంటివి చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. అయితే, ఇవి కేవలం దేశీయ బలహీనతలను మరింత తీవ్రం చేస్తున్నాయే తప్ప సంక్షోభానికి అవే ప్రధాన కారణాలు కావని నిపుణులు చెబుతున్నారు. చైనాకు అసలైన సవాలు దేశీయంగానే ఉందని, ముఖ్యంగా స్థానిక ప్రభుత్వాల అప్పులు, రియల్ ఎస్టేట్ సమస్యలు, ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచడం వంటి అంశాలను బీజింగ్ పరిష్కరించుకోవాల్సి ఉందని వారు సూచిస్తున్నారు. ఈ అంతర్గత సమస్యలను అధిగమించగలిగితే, బాహ్య ఒత్తిళ్లను తట్టుకుని చైనా నిలదొక్కుకోగలదని విశ్లేషకులు భావిస్తున్నారు.