Trump: ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. అమెరికాలో భారతీయ వస్తువుల ధరల భారీ పెరుగుదల

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) భారతీయ వస్తువులపై విధించిన సుంకాల దెబ్బకు అమెరికాలోని వినియోగదారులు ఇబ్బందుల్లో పడ్డారు. అమెరికాలో భారతీయ వస్తువులపై సుంకాలు 25 శాతం నుంచి 50 శాతానికి రెట్టింపు కావడంతో, బియ్యం, పప్పులు, సుగంధ ద్రవ్యాలు, వంట నూనె, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగాయి. నిత్యావసరాల నుంచి వ్యక్తిగత సంరక్షణ వస్తువుల ధరల మోతతో జేబులకు చిల్లులు పడుతున్నాయి. షాపింగ్ కార్ట్ చిక్కిపోతోందని పలువురు పేర్కొన్నారు. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో దుస్తులు, బ్యాగులు సహా మరెన్నో వస్తువుల ధరలు పెరిగాయి. టాయ్‌లెట్ పేపర్ రేట్లు కూడా ఎగబాకాయి. డైపర్ల నుంచి షాంపూ, స్కిన్‌కేర్ ఉత్పత్తులు సహా దిగుమతి చేసుకునే ప్రీమియం మద్యం, కార్లు, వాటి విడిభాగాల ధరలూ కూడా పెరుగుతాయని అంటున్నారు. మొత్తంగా చూస్తే ఒక్కో కుటుంబంపై ఏడాదికి సగటున 2,400 డాలర్ల (భారత రూపాయి ప్రకారం రూ.2.11 లక్షలు) భారం పడుతుందని అంచనా.
గతంలో 15 డాలర్ల లోపు ఉండే 20 పౌండ్ల (దాదాపు 9 కిలోల) సోనా మసూరి బియ్యం ఇప్పుడు అమెరికాలోని దాదాపు అన్ని భారతీయ దుకాణాల్లో 28 డాలర్లకు లేదా అంతకంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతోందని అంటున్నారు. అలాగే, పిండి, గోధుమల ధరలు కూడా భారీగా పెరిగాయి. గతంలో బ్రాండ్‌ను బట్టి 18-నుంచి 20 డాలర్లు ఉన్న 20 పౌండ్ల గోధుమపిండి బస్తా ఇప్పుడు 35 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. సుగంధ ద్రవ్యాల ధరలు కూడా పెరిగాయి. బ్రాండ్‌ను బట్టి గతంలో 7 నుంచి 10 డాలర్లు ఉన్న 800 గ్రాముల కారం పొడి ఇప్పుడు 15 డాలర్లకు అమ్ముడవుతోంది. 400 గ్రాముల పసుపు ప్యాకెట్ ధర కూడా పెరిగింది. నూనెలు, పప్పుల ధరలు కూడా పెరిగాయి. 96 ఔన్సుల (దాదాపు 3 లీటర్లు) సన్‌ఫ్లవర్ నూనె ఇప్పుడు రెట్టింపు ధరకు అమ్ముతున్నారు. మినప పప్పు, కంది పప్పుల ధరలు కూడా బాగా పెరిగాయి.
ఇండియా నుంచి అమెరికా వచ్చిన తల్లితండ్రులు ఉన్న ఇంట్లో ఈ ధరల పెరుగుదలతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. వారికి అమెరికా ఆహారం అలవాటు లేనందువల్ల ఇండియా స్టోర్స్ నుంచి ఎంత రేటు అయినా కొని తీరాల్సిన పరిస్థితి వచ్చిందని వారు వాపోతున్నారు. ఈ అధిక ధరలు తమ ఆర్థిక ప్లానింగ్ ను దెబ్బతీస్తోందంటున్నారు. ఇదే విషయమై ఓ ఇండియన్ సూపర్ మార్కెట్ నడుపుతున్న యజమాని ఒకరు తమ కస్టమర్లు భారతీయ వస్తువులు కొనడానికి ప్రస్తుతఇష్టపడడం లేదని చెప్పారు. ‘‘కస్టమర్లు ధరల గురించి నిరంతరం ఫిర్యాదు చేస్తున్నారు, వస్తువులు కొనడం లేదు. మా అమ్మకాలు పడిపోయాయి, కానీ ధరలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి’’ అని అన్నారు. భారతీయ దుకాణాలు తమ ఉత్పత్తుల ధరలు భారత్‌పై విధించిన సుంకాల కారణంగా 40-50 శాతం పెరుగుతున్నాయని బోర్డులు, సైన్‌బోర్డులు పెడుతున్నాయి. ఈ సుంకాలు అలాగే కొనసాగితే, అధిక ధరలు వలస వచ్చిన కుటుంబాలపై భారమవుతుందని, దాంతోపాటు భారతీయ ఉత్పత్తుల లభ్యత కూడా తగ్గే ప్రమాదం ఉందని అంటున్నారు. అమెజాన్, వాల్‌మార్ట్ తదితర దుకాణాలు కూడా దుస్తులు, బ్యాగులపై ఒక డాలర్ నుంచి ఎనిమిది డాలర్ల వరకు పెంచేశారని అంటున్నారు.
రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరుగుతాయనే భయంతో అవసరమైన వస్తువుల్ని వినియోగదారులు ముందే కొనేస్తున్నారు. ఏఐ టూల్స్ ఉపయోగించి ఏ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయో తెలుసుకుని వాటిని కొనుగోలు చేస్తున్నారు. పెద్దమొత్తంలో షాపింగ్‌కు కొందరు బై నౌ, పే లేటర్ విధానాలు ఎంచుకుంటున్నారు. స్కూల్ యూనిఫాం, బూట్లు, సాక్స్, కాఫీ, బీర్, ప్యాక్ చేసిన సముద్ర ఉత్పత్తులు, బేకరీ వస్తువులు, చైనా నుంచి దిగుమతి అయ్యే చిన్న పిల్లల ఆట వస్తువులు, గడియారాలు, వంటింటి సామగ్రి ధరలు కూడా గణనీయంగా పెరుగుతాయనే అంచనాలున్నాయి. టూత్‌పేస్టు, డిటర్జెంట్ ధరలపైనా ప్రభావం ఉండనుంది. సగటు బాదుడు 35% ఉంటుందని అంచనా. సుంకాల పెరుగుదల తర్వాత అమెజాన్, వాల్‌మార్ట్ తదితర సంస్థలు దిగుమతుల్ని నిలిపేశాయి. ప్రస్తుతానికి సరకు పంపవద్దని ఎగుమతి సంస్థలకు సూచిస్తున్నాయి.
ఫ్రోజెన్ పరాఠాలు లాంటి వాటి ధరలు రాత్రికి రాత్రే 11.99 డాలర్ల నుంచి 13.99 డాలర్లకు పెరిగాయి. మామూలుగా ఏదైనా వస్తువు ధర పెరిగితే, రూపాయిలో 10, 20 పైసలు పెరుగుతుంది. మహా అయితే ఒక రూపాయి పెరుగుతుంది. కానీ అమెరికాలో ఇప్పుడు జరుగుతున్న ధరల పెంపు మాత్రం మామూలుగా లేదు 11.99 డాలర్ల నుంచి 13.99 డాలర్లు అంటే, దాదాపు 2 డాలర్లు పెరిగినట్టే. కొందరు దుకాణదారులు మాత్రం తమ చర్యలను సమర్ధించుకుంటున్నారు. ఇంధనం, బంగారం లాంటి వాటి ధరలు ఎలాగైతే భవిష్యత్తులో పెరిగే ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ముందుగానే పెంచుతారో, తాము కూడా అదే విధంగా చేస్తున్నామని వాదిస్తున్నారు. కొత్తగా స్టాక్ తెచ్చుకోవాలంటే టారిఫ్‌ల వల్ల ఖర్చు పెరుగుతుంది కాబట్టి ముందుగానే ఆ భారాన్ని సర్దుబాటు చేసుకోవాలని చెబుతుండటం గమనార్హం. అంతేకాదు, పాత స్టాక్‌ను తక్కువ ధరలో అమ్మితే మళ్లీ సరుకు తెచ్చుకునేప్పుడు నష్టపోతామని కూడా అంటున్నారు. మరోవైపు వినియోగదారులు మాత్రం ట్రంప్ టారిఫ్ వల్ల తాము చాలా నష్టపోతున్నామని వాపోతున్నారు.
(అమెరికాలో పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపై తెలుగుటైమ్స్‌కు అందిన సమాచారంతో ఈ ఆర్టికల్ ను ప్రచురిస్తున్నాము- ఎడిటర్)