“శ్రీ శార్వరి స్మరణగీతం: భగవత్చరణాల వైపు సాగిన ఆత్మయాత్ర” – డాక్టర్ రమణ వి. వాసిలి
భగవాన్ చరణాలు, ఎవరికి వారు చదివి ఆకళింపు చేసుకోవాల్సిన రచన. ప్రతి అక్షరం, ప్రతీ పదం. ప్రతివాక్యం సాధనతో, శోధనతో, అనుభవంతో చేసిన సంక్లిష్టమైన రచన. మూఢనమ్మకాల మీద ఆచారవు ఆలవాట్లు మీద తిరగబడినట్లుగా అనిపించినా అంతర్లీనంగా భగవంతుడి చరణాలను చేరలనే శ్రీ శార్వరి గారి తపన, ఆరాటం, కాంక్ష ప్రస్పుటంగా కనిపిస్తుంది. డిసెంబర్ 12, 2015న శ్రీ శార్వరి గారు నా జీవన యాత్రకు చరమగీతం పాడాలని ఉంది అంటూ భౌతిక శరీరాన్ని వీడుతారు. డిసెంబర్ 12, 2025న వారి 10వ వర్ధంతి సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం.
కొందరే కొన్ని రచనలు చేయగలరు. అలాంటి రచయిత, కవి శ్రీ శార్వరి. రచనని చూసి ఫలానా రచయిత అయ్యుంటారని కొందరిని చెప్పవచ్చు. ఆ కోవలోకి వస్తారు శ్రీ శార్వరి. కథా రచయితగా, కవిగా, పత్రికాసంపాదకులుగా, మాస్టర్ యోగాశ్రమ వ్యవస్థాపకులుగా, యోగిగా ఆధ్యాత్మిక సుసంపన్నులుగా, బహుముఖ ప్రజ్ణాశీలిగా పేరు ప్రఖ్యాతులు గడించిన శ్రీ శార్వరీ గారు ఆంధ్రమహాసావిత్రి తరువాత తమ 86వ ఏట చివరిగా రాసిన పుస్తకం, “భగవాన్ చరణాలు”. ఇది మార్మిక కవితా సంపుటి, సాధారణ జ్ఞానానికి ప్రజ్ఞకి అందనిది, ఇంద్రియాలకు అతీతమైన తత్వచింతన, పరాచింతన,ఇందులోని కవితా వస్తువు మార్మికత. ఇది ఆధ్యాత్మికంలో ఒక భాగం. ఆత్మశోధనతో మొదలయి పరాన్వేషణతో శోధించి రచయిత తెలుసుకున్న అనుభవాల కవితాత్మలు ఈ భగవాన్ చరణాలు. రచయిత భగవంతుడిని చేరాలనే కోరికని బలీయంగా, ప్రస్ఫుటంగా వ్యక్త పరుస్తూ సాగిన ఈ రచన వాస్తవానికి ఆధ్యాత్మిక జ్ఞాన భాండాగారం. శ్రీ శార్వరీ గారు అంతర్దృష్టతో, ధ్యానంతో, యోగానుభవంతో పొందిన అలౌకిక అనుభవాల్ని, ఆధ్యాత్మిక రహస్యాల్ని ఆవిష్కరించిన అద్భుత రచన ఇది.
వేద కాలం నుంచి కొన్ని వందల, వేల దేవుళ్లనే కాకుండా చెట్లని, పుట్టల్ని, పశుపక్ష్యాదుల్ని పూజించడం మన సంస్కృతిలో, సంప్రదాయంలో భాగం. దేవుళ్ళు ఎందరున్న భగవంతుడు ఒక్కడే అన్నది కొందరి గాఢ నమ్మకం. ఆ కోవలోకి చెందిన వారే శ్రీ శార్వరి. స్వర్గ, నరకాలు నాకు అప్రస్థుతాలు అంటూ మృత్యువు తర్వాతి జీవితం అనే వాదం అప్రమేయం అంటారు. చావంటే నాకు భయం లేదు అంటూ మృత్యుంజయుడయ్యారు.
నేను ఎప్పుడో మరణించాను, మరణిస్తూనే వున్నాను అంటూ సగటు మనిషి బతుకు భారాన్ని, బతుకు సమరాన్ని, జీవనంలోని సంక్లిష్టతని వెరవకుండా చెబుతారు.
“భగవాన్ నీవెవరు? అంటూనే నేనిక్కడ- నీవెక్కడ?
అని ప్రశ్నిస్తారు. నీ కోసం నావి చీకటి పరుగులంటారు. యాతనామయ బ్రతుకు కన్నా నరకమే నయం అంటారు. ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు. సమస్యల వలయంలో చిక్కుకున్న సామాన్యుడు పరిష్కారం కోసం దేవుడి కోసం ఆరాటపడతాడు. ఆ ప్రయత్నంలో స్వాంతన చేకూరనప్పడు, విసిగి వేసారినప్పుడు, బతుకు కన్నా నరకమే నయం అనడం, అనిపించడం సహజంమే, కానీ అనుభవమైనప్పుడు కాని తెలియదు అసలు నరకం అన్నది ఏమిటో? అనుభవంలేనిదాన్ని అనుభవంలోకి రాని దాన్ని అనుభవమైన దానితో పోల్చడం మానవ సహజం. స్వర్గమయినా, నరకమయినా ఊహాజనితమే కాని అనుభవపూర్వకంగా చెప్పింది కాదు.
దేవుడెవరు? భగవాన్ ఎవరు?
సమర్పించిన నైవేద్యాలు దేవుడు ఆరగించినట్లూ కనపడదు మనల్ని ఊరడించినట్లూ అనిపించదు.
అసలు దేవుడు మనిషిని సృష్టించాడా?
మనిషే దేవున్ని తనకోసం సృష్టించుకున్నాడా?
దేవుడు గొప్పా, మనిషి గొప్పా?…
మనిషి కనిపిస్తాడు, ఎంత వెతికినా దేవుడు కనిపించడు.
అసలు దేవుడు అనేవాడు వున్నాడో లేడో తెలియదు. కనిపించని దేవుడే తనకి దిక్కని మనిషి నమ్మకం!
సమాధానం దొరకని సవాలక్ష ప్రశ్నలు.
స్వర్గంలో మీకేం తక్కువైందని భూమ్మీదకు వస్తారు?
స్వర్గం విసుగు పుట్టిందా,
భూమిమీదకు వచ్చి శిలామూర్తులై గుళ్లలో దాక్కుంటున్నారు? నాది దేవుళ్ళతో, స్వర్గాలతో పనిలేని మహాప్రస్థానం.
నేను శూన్యాన్ని, మహాశూన్య చైతన్యాన్ని, మహాచైతన్య శూన్యాన్ని.
రచయిత భగవాన్ని God అనకపోవడం గురించి ఇలా అంటారు.
Bhagavan is Almighty, Supreme.
Bhagavan is an abstract.
All in All. All consciousness.
భగవాన్ నీ చరణాల చెంత రవ్వంత చోటు ఇవ్వు అని అర్ధించాను అంతేగా. అది అత్యాశ అవుతుందా అన్నది శ్రీ శార్వరి ఆత్మనివేదన.
నేను ఈ పుస్తకాన్ని రచయితగా రాయలేదు అంటారు.
It is an inspiration.
An experiment with Death.
I have been facing death in the past year.
I am daily fighting with Death.
I know Death wins man.
I am after all a man, a human.
Even then I Challenge God, fight with Death.
I know I will continue to live after Death.
నాకు స్వర్గం వద్దు.
స్వర్ణ భోగాలు వద్దనే వద్దయ్యా
మనిషిగా నేను పర్ఫెక్ట్ అయితే చాలు
కోరికలు లేనివాడు పూర్ణపురుషుడు
మనిషిగా పర్ఫెక్ట్ అయితే చాలు అన్నది చాలా చిన్న కోరికగాను,విషయంగాను అనిపించవచ్చు. కానీ సాధారణ మనిషి మొదలు మహామహుల వరకు సాధించలేనిది ఆ పర్ఫెక్షన్. కోరికలు లేని ప్రాణి బహుశా వుండకపోవచ్చు. కానీ ఆమోద యోగ్యమైన కోరికలు, ఎదుటివారి వినాశనానికి దారితీసే కోరికలు, కానంత వరకు సమస్యలేదు. పూర్ణ పురుషులుగా ప్రసిద్ధి చెందిన వారు కూడా ఒక వర్గం చేత ఆమోదింపబడిన వారే అయ్యుంటారు కాని సర్వసమ్మతం అయ్యే అవకాశం తక్కువ.
నేను రుషిని కాను, మహర్షిని కాను.
కోరికల్ని కాల్చి మసి చేసుకున్న చిరుయోగిని,
అసలైన మనిషిని.
చిరు యోగినంటూ శ్రీ శార్వరి గారు తమలోని సరళతను చాటుకున్నారు. కొన్ని వందల వేలమందికి యోగసాధనలో గురుస్థానంలో దిశా నిర్దేశం చేసినప్పటికీ నేను అసలైన మనిషిని అంటూ మనిషికి వుండాల్సిన నైతిక బాధ్యతను గుర్తుచేస్తారు. ఇప్పటి సమాజం, మనుషుల ధోరణి, దృక్పథం,కళ్ళకు కట్టినట్లుగా ఇలా చెబుతారు.
మనుషుల కోరిక తాము గాడ్సె కావాలని
దేవుని కుర్చీపైనే ఎప్పుడూ మనిషి చూపు.
స్వర్గ సుఖాలపైనే ఆశ.
ఎందుకంటే ఒకప్పుడు ప్రతి మనిషీ దేవుడే!
ఆ విషయం మనిషిగా జన్మించిన క్షణాన మరచిపోయాడు.
మనసు మనిషికి ఒక వరం, శాపం కూడా అదే!
తన పూర్ణ స్థితిని మరచిన మనిషి
తన పూర్వ స్థితిని మరచిపోయి డొల్లగా, మానుగా మిగిలిపోయాడు
జారుడు మెట్లపై జారి జారి అలసిపోయాడు.
ఎంత ప్రయత్నించినా
చేతికి స్వర్గం
అందినట్లే అన్పిస్తుంది.
దగ్గరకు రానవ్వదు.
యుగయుగాలుగా ఋషులు, బ్రహ్మర్షులు, మునులు, మహామునులు అవిరామంగా సాధించాలనుకున్నది, సాధించలేనిది ఎవరికీ తెలియనిది – స్వర్గం.
నాపాటికి నేను వెలుగులో రాత్రిలో బ్రతుకుతున్న వాడిని నువ్వు ఉత్తినే ఇస్తానన్నా ఆయుర్దాయం తీసుకోను.
నేనొక విరాగిని
బొందిలో ప్రాణం లేక పోయినా,
బ్రతకడం నేర్చుకున్నాలే నీ దయ వల్ల
పరతత్వశోధనా ఆత్మోన్నతి చెందిన పూర్ణ పురుషులు మాత్రమే నిర్భయంగా, నిస్సందేహంగా మరో పది కాలాల పాటు జీవించగలిగే వరమిస్తానన్నా తిరస్కరించగలరు.. దాదాపు అర్థ శతాబ్దంపైగా యోగసాధనలో శ్రీ శార్వరి గారు అందుకున్న ఆత్మపరిణితి ఇది. మనిషైన వాడు మనిషిగా వర్తించాలి, సమాజశ్రేయస్సుని కోరుకోవాలి. కేవలం “నేను” అనేది జీవిత పరమార్థం కాకూడదు.
“ఈ లోకాన్ని ఎవడు బాగు చేస్తాడు చెప్పు స్వామీ?”
పది అవతారాలెత్తిన విష్ణు మూర్తి వల్ల కాలేదు.
కైలాస శిఖరాన చిరతపస్సులో ఉన్న శివయ్య వల్ల కాలేదు,
మహాత్ముల వల్ల పూర్తి కాలేదు.
ఎప్పుడూ లోకం గోడలు బీటలు వారుతూనే వుంటాయి.
ఇక్కడ దేవతల మీద నింద కన్నా మనుషులు, ఆనాటి నుండి ఈనాటి వరకు మారలేదు అన్న రచయిత మానసిక వేదన కన్పిస్తుంది. యుగాలు మారినా, తరాలు మారినా మారని మానవపోకడలని ఎటువంటి సంశయం లేకుండా చూపడం రచయిత మనోదైర్యానికి నిదర్శనం.
ధర్మం నాలుగు కాళ్ళపైన కాదు ఇప్పుడు
ఒంటి కాలిపైన కొంగజపం చేస్తున్నదేం, భగవాన్!
ధర్మం అడుగంటినప్పుడు జన్మిస్తానని
శ్రీ కృష్ణుడు గీసిన గీతని ఎవరు చెరిపేసారు?
విష్ణు మూర్తికి తిరికలేదా? త్రిమూర్తులు బిజీనా? దేవతలంతా ఏ లోకాలకు వలసపోయారు?
ఆలోచింపజేసే ప్రశ్నల పరంపర. హృదయాంతరాల్లో ‘గునపంతో పొడించినట్లు, మనలోని ఆత్మ ఉలిక్కిపడి లేచి మనల్నే ప్రశ్నిస్తున్నట్లు?
మనల్ని మనమే ఉదరించుకోలేమా? సరిచేసుకోలేమా? అసలు భగవంతుడు ఎందుకు అవతరించాలి. మనం సాధించామనుకున్న జ్ఞానం, మేదస్సు, మనకే పనికి రావడం లేదా? సత్యవర్థనం ఒకరు నేర్పించాలి?
పవిత్ర భారత దేశంలో హాయిగా చచ్చిపోతే ఎంత బావుంటుంది అనే గొప్ప ఆలోచన ప్రతి మనిషికి జీవితంలో ఒకసారైనా వస్తుంది. నాకు చచ్చిపోవాలనుంది అయినా ఒక్క సారిగా చచ్చిపోలేను. చాలాసార్లు బిట్స్ బిట్స్ గా చచ్చిపోయాను. చావు బ్రతుకులు ఒకటేనేమో! చావు వెనక జీవితం, జీవితం కొసన చావు సహజం!
ఎంతటి యోగులైన తపోధునులైన పుట్టకతో సమాన్య మానవులే. వృద్ధాప్యం పైనబడినపుడు మందీ మార్బలం తగ్గుతారు, భాజాభజంత్రీలు అంతగా రుచించవు, పల్లకీ మోతలూ తగ్గుతాయి… మృత్యువు గడప వద్ద మాటు వేసినప్పుడు నైరాశ్యం చుట్టు ముడుతుంది, ఒంటరితనం వెక్కిరిస్తుంది… ఈ నిజాన్ని తెలుసుకున్నవాడు దేనికీ వెరవడు. మృత్యువునైనా అభేదంగా ఆహ్వానించగలడు. అటువంటి యోగసాధనా సంపన్నులైన శ్రీ శార్వరి మాటల్లో –
నేను యోగిని
యోగి అంటేనే మృత్యుంజయుడు.
జనన మరణాలకు అతీతుడు.
ఆవలి తీరం చేరిన వాడే యోగి
మరణమా ! నీవున్నది నాలోనే అని తెలుసు
నన్ను చూసి నేనెందుకు భయపడాలి?
తనకు తాను పనికిరానివాడు చచ్చినట్లే అంటూనే రచయిత సమాజానికి ఉపయోగం లేనివాడు చచ్చినట్లే అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పడమే కాదు సాటిమనిషికి సాయపడిని వాడు చచ్చినట్లేనని వక్కానిస్తారు. ఇక్కడ వ్యక్తి శ్రేయస్సుతో పాటు సమాజశ్రేయస్సు అంతే ముఖ్యమని చెప్పకనే చెబుతారు రచయిత.
“నేను” అంటే”ఆత్మ” అని తెలియడానికి ఒక జన్మకాలం పట్టినా మరణించేది శరీరమే, ఆత్మకాదని ఎప్పుడో ఎరుకైంది అంటారు శ్రీ శార్వరి… నన్ను నేను తెలుసుకోవడానికి ఒక జన్మ ‘కాలం’ పట్టిందని చెప్పగలిగే నిగర్వి రచయిత. పుట్టుకతో వచ్చిన జ్ఞానం కాదు ఒక జీవిత కాలం అనుభవాలతో, శోధనతో, ధ్యానంతో కలిగిన ఆత్మజ్ఞానం ఇది అంటారు.
ప్రయోజనం లేని బ్రతుకు శ్మశానంతో సమానం
ఎవరికీ ఉపయోగపడని మనిషి కాలిన కాష్టంతో సమానం ఆత్మశాశ్వతం అయితే నాకేం, కాకపోతే నాకేం!
నేనే ఆత్మనని గాని, నాకు ఆత్మ ఉందని గాని తెలియదు తెలిసినా “ఆత్మ” కోసం నేను చేసేదేముంది?
ఉత్తినే ‘నాది’ ‘నాది’ అని ఎందుకు అంగలార్పు.
ఆ వెంపర్లాట పేరే ఆత్మాయనమా?
చివరకు మిగిలేది
‘నేను’ అనబడే ఆత్మా?
ఆత్మ అయిన నేనా?
భగవాన్ చరణాలు, నిస్సందేహంగా ఆణిముత్యాలాంటి కవితలు. కొన్ని మనస్సుకి స్వాంతన చేకూర్చే చలివేంద్రాలయితే మరికొన్ని హృదయాన్ని మెల్కోలిపి ఆత్మని సాక్షాత్కరింపచేసే మంత్రపుష్పాలు.
భగవాన్! నీవు అమృతుడిని నేను మృతుణ్ణి
నీవు జనన మరణాలకు అతీతం
నేను జనన మరణ వలయంలో చిక్కుకున్న వాణ్ణి
ఈ వలయంలోంచి బయటపడే సూత్రం చెప్పు?
నీకెలా మరణం లేకుండా పోయిందో చెప్పు?
అసలు నీవు సృష్టికి అతీతం కావచ్చు
అయినప్పుడు సృష్టి ఏమయితే నీకేం?
భగవన్: నువ్వు బ్రహ్మకంటే పరబ్రహ్మ కంటే పైవాడివి
ఆపై లోకాలుకు చెందిన వాడివి
బ్రహ్మ గారి రాతల్ని నీవు తిరగరాసి
మా బతుకుల్ని మార్చవచ్చు గదా !
మేం నీవారం, నీకు అయిన వారం
సదా నీ స్పురణలో జీవిస్తున్నవారం
నీ స్మరణే మాకు ఊపిరి ప్రాణం
ఇది కర్మ క్షేత్రం, ఇది కర్మభూమీ…
భగవాన్: మనిషి ఏంచేసినా, ఎంత చేసినా ఏం సాధిస్తాడు?
అంతా విధి చట్రం పరిధిలో ఇమడవలసిందే,
జపతపాల వల్ల ఒరిగేదేమిట, మారేదేమిటి?
కాలచక్రం యధావిధిగా తిరుగుతునే వుంది
జపతపాల వల్ల సృష్టి మారుతుందా?
భగవాన్: నీవు సర్వ స్వతంత్రుడివి
గ్రహాలకు అతీతుడవు
సాక్షాత్ పరబ్రహ్మ అంశవు గదా !
నీవైన సృష్టి లోపాలు చక్కదిద్దు స్వామి!
మనిషిని కనీసం మనీషిని చెయ్యి
మమ్మల్నేమి మహాత్ముల్ని చేయనవసరం లేదు
మంచి మనుషులుగా మార్చు చాలు!
లోక కల్యాణం కోసం, ప్రపంచశాంతి కోసం చిరకాలంగా జ్ఞానులంతా చెప్పింది నిజాలే అందరూ సత్యాల్నే ప్రవచించారు.. ఎవరి దర్శనాన్ని బట్టి అనుభవాన్ని బట్టి వారు శక్తి మేర ప్రవచించారు. లోకం నిండా చీకటి అవరిస్తే గదా వెలుతురు అవసరం! మార్పైనా అంతేలే!
ఎనబై ఏళ్ళ జీవనయానంలో నేను తెలుసుకున్న పరమసత్యం జీవితాన్ని ఇష్టంగా ప్రేమించాలని శరీరాన్ని కాదని
జీవించడం అంటే బతకడం కాదు
అందరినీ ప్రేమించడం, ప్రేమించబడటం!
జీవితాన్ని ఇష్టంగా ప్రేమిస్తే అది ప్రేమ,
అందరితో ఇష్టంగా ఉండటం ప్రేమ
ఎవరికీ మనపట్ల అయిష్టత కలగకపోవడం ప్రేమ
ప్రేమలో కోపతాపాలు, రాగద్వేషాలు ఉండవు.
చల్లని వెన్నెల వంటిది ప్రేమ
దార్మిక జీవనం, నైతికత ప్రేమకు ఆలంబనాలు.
ప్రేమకు జీవితం ఒకవైపు జీవితానికి రెండో వైపు ప్రేమ.
మనిషిగా పుట్టి మహాత్మగా పరిణమించాలి అంటారు రచయిత. జీవితం అంటేనే త్రిటయర్ కూపే. లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్. మనం లోయర్ బెర్త్ లోనే సీట్లు మారుతున్నాం తప్ప పై బెర్తులకి ఎదుగుతున్నదేది అంటారు శ్రీ శార్వరి. ఎన్ని జన్మలెత్తినా లోయర్ బెర్త్ కే పరిమితం కాకుండా మిడిల్ బెర్త్ కి ఎదగాలి. అంటే విశేకానందం. బుద్దికి పదును పెట్టాలి, జ్ఞానం పొందాలి బుద్దుడి లెవెల్స్ కి ఎదిగితే మరీ మంచిది. మూడవ బెర్త్ నే శాశ్వతానందం అంటారు రచయిత. అందుకు ఆత్మజ్ఞానం కావాలి.
స్వర్గం ఎక్కడ ఉంటుందో, ఎలా ఉంటుందో ఎవరికీ తెలయదు. అన్నీ ఊహలు, భ్రమలు. అసలు స్వర్గం వెళ్ళినవారు ఎవరూ తిరిగి వచ్చింది లేదు, వచ్చి చెప్పింది లేదు. అందుకే శ్రీ శార్వరి అంటారు:
నాకు భూలోకం వద్దు, స్వర్గం వద్దు, నరకం వద్దు. భగవాన్ నీలాగ ఏమీ కానివాడిని గాలిలో గాలిగా కలిసిపోనివ్వు. మళ్ళీ పుట్టాలని లేదు. అదీ మనిషిగా పుట్టినా ఈ పవిత్ర భారతదేశంలో పుట్టాలని లేదు.
ఇది పుణ్యభూమి కదా!
ఏ నాటి మాట అది?
ఇది కర్మభూమి ఎప్పటి మాట అది
కైలాసం నుండి కన్యా కుమారి వరకూ
అన్నీ ఎన్నో పుణ్యక్షేత్రాలు!
మనుషుల్లోనే పుణ్యం కనిపించదు.
వేల సంవత్సరాల క్రితం చెట్టుకోకరు పుట్టకొకరు
ఇప్పుడీ పుణ్యభూమిలో ఋషులు కనిపించరు.
మహర్షులు కనిపించరు, మునులు మచ్చుకైనా లేరు.
స్వర్గం భరించలేక దేవతలంతా ఇక్కడకు వస్తే
మనుషులంతా స్వర్గానికి పోతే
భూమి స్వర్గం అవుతుంది.
స్వర్గం నరకం అవుతుంది, గ్యారంటీ…!
మన స్వామీజీలంతా స్వర్గాన్ని యదేచ్చగా ద్వంసం చేస్తారు.
ఆధ్యాత్మికం పోయి ఆడంబరం మిగులుతుంది.
(శ్రీ శార్వరీయ ఆత్మయాత్రకు ఇది దశాబ్ది నివాళి)






