Pawan Kalyan: భగవద్గీతే జీవన దీపం..ఉడిపి సభలో పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక ప్రసంగం ..
జనసేన (Janasena) అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన తాజా వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ వర్గాలో హాట్ టాపిక్ అయ్యారు. తనని తాను అర్జునుడితో పోల్చుకుంటూ, 2024 ఎన్నికల ముందు ఎదుర్కొన్న అంతరంగ సందిగ్ధత కురుక్షేత్ర యుద్ధానికి ముందు అర్జునుడు పొందిన సందేహాలను గుర్తు చేసిందని చెప్పడం ప్రత్యేకంగా నిలిచింది. అర్జునుడికి శ్రీకృష్ణుడు (Sri Krishna) గీతా బోధనతో చూపిన మార్గం, తనకు కూడా ప్రజల మేలు కోసం ఏం చేయాలనే దిశగా ఒక స్పష్టమైన అవగాహన ఇచ్చిందని పవన్ తెలిపారు. అందుకే తన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలకు మాత్రమే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన గుర్తుచేశారు.
కర్ణాటకలోని ఉడిపి (Udupi)లో పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం నిర్వహించిన బృహత్ గీతోత్సవంలో మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ (Sugunendra Teertha Swamiji) ఆహ్వానం మేరకు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంలో భగవద్గీతపై ఆయన చేసిన ప్రసంగం అక్కడి శ్రోతలను ఆకట్టుకుంది. భగవద్గీతను తాను కేవలం పూజించే గ్రంథంగా కాకుండా, ఒక ధర్మ మార్గదర్శకంగా భావిస్తానని పవన్ అన్నారు. గీతాసారం ఎన్నో తరాలకు, ఎన్నో వ్యక్తులకూ మార్గనిర్దేశం చేసిన శాశ్వత జ్ఞానం అని చెప్పారు.
తాను ఈ కార్యక్రమానికి రాజకీయ నాయకుడిగా కాకుండా ఆధ్యాత్మిక అన్వేషకుడిగా వచ్చానని ఆయన చెప్పడం అక్కడి వాతావరణాన్ని మరింత ప్రభావితం చేసింది. నిజమైన నాయకత్వం పదవుల్లో కాదు, ప్రజల మంచి కోసం తీసుకునే నిర్ణయాల్లోనే ఉంటుందని పవన్ వివరించారు. భగవద్గీతలోని తత్వం జీవితానికి ఎలా ఉపయోగపడుతుందో పవన్ ప్రత్యేకంగా వివరించారు. మనిషి జీవితంలో ఎదురయ్యే భయాలు, సందేహాలు, అశాంతి..ఇలా అన్నిటికీ దిశ చూపే ఆధ్యాత్మిక శక్తి గీత అని ఆయన చెప్పారు. ప్రస్తుతం యువత చదువు, ఉద్యోగం, వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో భగవద్గీత వారికి అవసరమైన మానసిక బలం ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత దేశం ఎన్నో దండయాత్రలను ఎదుర్కొని కూడా నిలబడగలగడం వెనుక సైనిక శక్తి కాదు, ధార్మిక బలం, సంప్రదాయాలు, మహనీయులు, పవిత్ర గ్రంథాలే కారణమని పవన్ గుర్తు చేశారు. గీత ప్రపంచవ్యాప్తంగా ఐన్స్టీన్ (Einstein), ఓపెన్హైమర్ (Oppenheimer) వంటి మహా మేధావులను కూడా ప్రభావితం చేసిందని ఆయన అన్నారు. ఉడిపిలో చేసిన పవన్ కళ్యాణ్ ప్రసంగం వినినవారికి ఆయనలోని ఆధ్యాత్మికత కొత్తగా పరిచయమైందని అంటున్నారు. గీతాసారాన్ని సాధారణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగిన ఆయన తీరు ప్రత్యేకంగా ప్రశంసించబడుతోంది. ఈ సభ పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వంలోని మరో ప్రత్యేక కోణాన్ని మరోసారి బయటకు తీసుకువచ్చింది అని చెప్పవచ్చు.
– Bhuvana






