Tirumala: తిరుమలలో మరో కుంభకోణం..! టీటీడీలో ఏం జరుగుతోంది?
కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రం.. భక్తిభావానికి, పవిత్రతకు నిలువుటద్దం. కానీ, ఇటీవల వరుసగా వెలుగుచూస్తున్న కుంభకోణాలు శ్రీవారి సన్నిధిలో అపవిత్రతను, అక్రమాలను కళ్లకు కడుతున్నాయి. లడ్డూ ప్రసాద తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన సంగతి మరువక ముందే, ఇప్పుడు మరో భారీ మోసం బయటపడటం భక్తులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దాతలు, విశిష్ట వ్యక్తులకు (VIPs) బహూకరించే పట్టు శాలువాల కొనుగోలులో పదేళ్లుగా సాగుతున్న అక్రమాలు టీటీడీ (TTD) పాలనా వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టాయి. పట్టు పేరుతో పాలిస్టర్ వస్త్రాలను అంటగడుతూ సాగిన ఈ దందా.. తిరుమలలో వేళ్ళూనుకున్న అవినీతికి నిదర్శనంగా నిలుస్తోంది.
శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులకు, ఆలయానికి విరాళాలు అందించే దాతలకు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం చేసి పట్టు శాలువాతో సత్కరించడం తిరుమలలో సంప్రదాయం. ఈ క్రతువులో వాడే శాలువా సాక్షాత్తు శ్రీవారి ఆశీస్సుగా భావిస్తారు. నిబంధనల ప్రకారం, ఈ శాలువాలు స్వచ్ఛమైన మల్బరీ పట్టుతో, నిర్దేశిత బరువు, కొలతలతో ఉండాలి. వాటిపై ‘ఓం నమో వేంకటేశాయ’ అనే అక్షరాలతో పాటు శంకు, చక్ర నామాలు ఉండాలి. అయితే, ఇటీవల టీటీడీ బోర్డు చైర్మన్ బి.ఆర్. నాయుడు ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2015 నుంచి టెండర్ దక్కించుకుని శాలువాలు సరఫరా చేస్తున్న నగరికి చెందిన ‘వీఆర్ఎస్ ఎక్స్పోర్ట్’ అనే సంస్థ, పదేళ్లుగా టీటీడీని, భక్తులను మోసం చేస్తోందని తేలింది. స్వచ్ఛమైన పట్టుకు బదులుగా 100 శాతం పాలిస్టర్ దారంతో తయారైన నాసిరకం శాలువాలను ఆ సంస్థ సరఫరా చేస్తోంది.
ఈ కుంభకోణంలో ఆర్థిక అవకతవకలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బయట మార్కెట్లో కేవలం రూ. 350 నుంచి రూ. 400 విలువ చేసే పాలిస్టర్ శాలువాలను, సదరు సంస్థ టీటీడీకి ఏకంగా రూ. 1,389 లకు విక్రయిస్తోంది. అంటే ఒక్కో శాలువాపై దాదాపు రూ. 1000కి పైగా అదనంగా వసూలు చేస్తూ, ఏటా కోట్ల రూపాయల ధనాన్ని కొల్లగొట్టింది. పదేళ్ల కాలంలో లక్షలాది శాలువాలు కొనుగోలు చేసిన టీటీడీ, ఈ మోసం కారణంగా ఎంత భారీ మొత్తంలో నష్టపోయిందో ఊహించవచ్చు. ఇది కేవలం వ్యాపార మోసం కాదు, దేవుడి సొమ్మును అప్పనంగా దోచుకోవడమే.
ఈ కుంభకోణం కేవలం ఒక కాంట్రాక్టర్ చేసిన మోసం మాత్రమే కాదు, టీటీడీ అధికారుల నిర్లక్ష్యానికి, పర్యవేక్షణా లోపానికి అద్దం పడుతోంది. ఒక పట్టు వస్త్రాన్ని చేతితో తాకితే అది పాలిస్టరా లేదా అసలైన పట్టా అనేది సాధారణ నేత కార్మికుడికి కూడా అర్థమవుతుంది. అలాంటిది, పదేళ్లుగా టీటీడీ అధికారులు, సిబ్బంది ఈ వ్యత్యాసాన్ని ఎందుకు గుర్తించలేకపోయారు? గతంలో కాంచీపురంలోని ల్యాబ్‌లో జరిగిన పరీక్షల్లో ఈ శాలువాలు నాణ్యమైనవేనని రిపోర్టులు వచ్చాయి. కానీ, ఇప్పుడు బెంగళూరు, ధర్మవరం సెంట్రల్ సిల్క్ బోర్డ్ ల్యాబ్‌లలో పరీక్షిస్తే అవి పాలిస్టర్ అని తేలింది. దీన్ని బట్టి, గతంలో ల్యాబ్ టెస్టుల సమయంలో నమూనాలను మార్చేశారా? లేక ల్యాబ్ అధికారులతోనే కుమ్మక్కయ్యారా? అనే అనుమానాలు బలపడుతున్నాయి.
తిరుమలలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు సాధారణ భక్తుల్లో అభద్రతా భావాన్ని కలిగిస్తున్నాయి. పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిన నెయ్యిని వాడారన్న ఆరోపణలు హిందూ సమాజాన్ని కుదిపేసాయి. శ్రీవారి హుండీని లెక్కించే పరకామణిలో సిబ్బందే డబ్బులు చోరీ చేస్తూ పట్టుబడటం భద్రతా వైఫల్యాన్ని ఎత్తిచూపింది. ఇప్పుడు దాతలను గౌరవించే శాలువాల విషయంలోనూ మోసం జరగడం వ్యవస్థలో లోతుగా పాతుకుపోయిన అవినీతిని సూచిస్తోంది.
ఈ వరుస ఘటనలు చూస్తుంటే.. తిరుమల పాలనా యంత్రాంగం పవిత్రత కంటే వ్యాపారానికి, అవినీతికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రస్తుత టీటీడీ పాలకమండలి, ఏసీబీ (ACB) విచారణకు కోరడం ఆహ్వానించదగ్గ పరిణామం. అయితే, ఇది కేవలం విచారణకే పరిమితం కాకూడదు. పదేళ్లుగా సాగిన ఈ దందా వెనుక ఉన్న కాంట్రాక్టర్లతో పాటు, వారికి సహకరించిన అధికారులను, సిబ్బందిని గుర్తించి కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. శ్రీవారి ఆలయం కేవలం ఒక ఆదాయ వనరు కాదు, కోట్లాది మంది భావోద్వేగాలకు, విశ్వాసానికి సంబంధించిన కేంద్రం. పరిపాలనలో పారదర్శకత, కొనుగోళ్లలో జవాబుదారీతనం ఉంటేనే తిరుమల పవిత్రత పరిరక్షించబడుతుంది. లేదంటే, ఇలాంటి కుంభకోణాలు పునరావృతమై, కలియుగ దైవం సన్నిధిపై భక్తులకు ఉన్న అచంచల విశ్వాసం సడలే ప్రమాదం ఉంది. తక్షణమే టీటీడీలో ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






