Mohan Krishna Mannava: లోకేష్ కృషితో ఎపివైపు దిగ్గజకంపెనీల చూపు…మోహనకృష్ణ మన్నవ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అమెరికా పర్యటన ఆంధ్రప్రదేశ్‌లో రూ.వేల కోట్ల పెట్టుబడులను తీసుకువచ్చేలా సాగుతోందని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ ఛైర్మన్ మన్నవ మోహన కృష్ణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠం చేయాలనే దార్శనిక లక్ష్యంతో నారా లోకేశ్ చేపట్టిన అమెరికా పర్యటనలో ఆయన కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోహన కృష్ణ మాటాడుతూ, అమెరికాలో జెట్ లాగ్‌ను సైతం లెక్కచేయకుండా ఉదయం నుంచి రాత్రి వరకు దిగ్గజ కంపెనీల సీఈవోలతో వరుస మీటింగ్‌లు జరిపి రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించేందుకు లోకేశ్ చేసిన కృషి అభినందనీయమన్నారు. గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్‌తో భేటీ అయ్యి విశాఖలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు గూగుల్ ఉన్నతస్థాయి బృందానికి మంత్రి లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన విశాఖపట్నంలో ఏఐ డేటా సెంటర్ ప్రాజెక్ట్ పనుల ప్రారంభంపై చర్చించారు. ఇంటెల్ సంస్థ ఐటీ విభాగం సీటీవో శేష కృష్ణపురతో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో ఇంటెల్ ఉత్పత్తుల కోసం అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్ యూనిట్ ను ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు. గేమింగ్, చిప్ డిజైనింగ్, జీపీయూ మ్యానుఫ్యాక్చరింగ్‌లో అంతర్జాతీయస్థాయి అగ్రగామి సంస్థ ఎన్విడియా వైస్ ప్రెసిడెంట్ ఎంటర్ప్రైజ్ అండ్ క్లౌడ్ సేల్స్ రాజ్ మిర్ పూరితో శాంటాక్లారాలో భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించారు. అడోబ్ సీఈవో శంతను నారాయణన్‌తో మంత్రి సమావేశమై విశాఖపట్నంలో అడోబ్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ లేదా డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. జూమ్ వీడియో కమ్యూనికేషన్స్ ప్రొడక్ట్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ప్రెసిడెంట్ వెల్చామి శంకరలింగం, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అపర్ణ బావాతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. అమరావతి లేదా విశాఖపట్నంలో జూమ్ సంస్థ ఆర్ అండ్ డి, ఇంజినీరింగ్ డెవలప్మెంట్ సెంటర్, విశాఖపట్నంలో జీసీసీ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. లోకేశ్ ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ఏపీలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు అందించేలా నిరంతరం కష్టపడుతున్నారని, ఆయన అమెరికా పర్యటనలో పాల్గొనటం, పర్యటన దిగ్విజయంగా జరగటం చాలా సంతోషంగా ఉందని మోహన కృష్ణ మన్నవ అన్నారు.






