Dr. Ramana V. Vasili: రమణీయాలు: 4 “కాలం పరచిన రహదారులలో ఆత్మల స్పందన”
జగన్నాటకంలో, నియమిత సమయంలోనే, నియమిత ప్రదేశంలోనే ప్రతి పనీ జరుగుతుంది.ఈ ప్రాపంచిక సుఖాలన్నీ క్షణికాలన్న నమ్మికతో పర్వతగుహలలో కూర్చున్న మౌనివలె సత్యవంతుడు నివసిస్తున్న మహారణ్యం యావత్తూ నిశ్చలంగా, నిర్మలంగా, వినీలగగనం క్రింద నిర్మోహంగా ఉంది. ఆ వనసీమల్లో సత్యవంతుని చూసింది సావిత్రి. మూర్తీభవించిన తేజస్సువలె, తేజస్వివలె భాసించాడు. పూర్ణపురుషుడిగా, దివ్యత్వం మానవరూపం ధరించిందా అనిపించింది సావిత్రికి. అతడు యువకుడే, కాని ఋషివాసానికి విధి అతనిని పంపింది. అతని తేజస్సు అద్భుతం, అద్వితీయం. అతని ఆత్మశక్తి అపూర్వం.
అమరత్వంతో అవతరించిన అమృతమూర్తి సావిత్రి. ఆమె అపురూప సౌందర్యలహరి. ఆమె సౌందర్యాన్ని చూసి సత్యవంతుడు పరవశించాడు. ఇరువురి మధ్య ఏదో ఆత్మానుభూతి, హృదయంలో మధుర స్పందన. ఇరువురి చూపులు కలుసుకున్నాయి, హృదయాలు మూగగా భాషించుకున్నాయి. అతనిలో రాగం ఆమెలో అనురాగామైంది. అతని తాపం ఆమెకు అనుతాపమైంది. ఆత్మల ఆలింగనంతో ఇద్దరూ పరవశించారు. ప్రేమాంకురం స్వర్గంలోనే ఏర్పడుతుంది ఆ తర్వాత అది భూమిపైన అవతరించి పూర్ణానుభవాన్ని పొందుతుంది, అందుకు నిదర్శనం సావిత్రి సత్యవంతులు. తొలి చూపులోనే వారి మధ్య ప్రణయం అంకురించింది. సావిత్రి సత్యవంతులకు జీవితంలో అదే తొలి సమాగమం.
ఈ అనిశ్చితి భూగోళంపైన మనం ఒకరికొకరు తెలియకుండానే కలుసుకున్నట్లు అనిపించినా మనం ఒకరికొకరం కొత్తకాదు, మన జీవితాలు కొత్తకాదు. ఒకానొక కారణశక్తి మనల్ని దగ్గరకు చేర్చుతుంది. కాలాన్ని అధిగమించి, ప్రతి ఆత్మ తనకు అనుకూలమైన మరొక ఆత్మను గుర్తిస్తుంది. ఆత్మకు మరొక ఆత్మకు మధ్యనున్న అనుబంధం పాతదే.
సాల్వప్రభువు ద్యుమత్సేనుడు, రాణి మాళవిల కుమారుడు సత్యవంతుడు. విధివక్రించడంతో ద్యుమత్సేనుడు దృష్టిని కోల్పోయి అంధుడవుతాడు, రాజ్యం కోల్పోయి భార్యాపుతృడితో సహా అరణ్యవాసం చేస్తాడు. ఆ కారణంగానే సత్యవంతుడు అరణ్యంలో తపస్సుచేస్తుంటాడు. సావిత్రి సత్యవంతుల తొలికలయికని శ్రీ శార్వరి ఇలా వర్ణిస్తారు: రెండు ఆత్మలు కలుసుకున్న ఆ మహత్తర క్షణంలో నదీ తరంగాలు మహాసాగరంలోకి ప్రవహించి సంగమించినట్లు, ఆమె సర్వం అతనిలోకి ప్రవహించింది. ఒక ఆత్మ పరమాత్మలో లీనమైనట్లు, పరమాత్మలో చేరి బ్రహ్మానందానుభూతికై ఆమె చైతన్యం అతనిలోనే ఒక తరంగమై, ఆమె వ్యక్తిత్వం అతనిలోనే కలిసిపోయింది. సావిత్రి తన ఆనందాన్ని, ఆరాధనను పుష్పాలుగా మార్చి దోసిళ్ళతో తన జీవితాన్ని సత్యవంతుడికి సమర్పించుకుంది. సావిత్రి దృష్టిలో తాను, సత్యవంతుడు వేరు కాదు.
“సత్యమూర్తీ,
మీరు నాకు తెలుసు
నాకు తెలుసు మీరు నేనేనని
నేనే మీరని”.
అరవిందుడి మాతృక అంతే హృద్యంగా సాగిన శార్వరి వినిర్మితి పాఠకులకోసం, ఈక్రింద చదవండి.
Aurobindo:
Out of the voiceless mystery of the past
In a present ignorant of forgotten bonds
These spirits met upon the roads of Time.
శార్వరి:
గతకాలపు నిశ్శబ్ద, నిగూఢతను చీల్చుకుని
వాస్తవిక, అజ్ఞాన విస్మృతి బంధాలలో
కాలం పరచిన రహదారులలో ఆత్మలు కలుసుకున్నాయి.
Aurobindo:
Yet in the heart their secret conscious selves
At once aware grew of each other warned
By the first call of delightful voice
And a first vision of the destined face.
శార్వరి:
కాని వారి హృదయ రాహస్య చైతన్య పొరలలో
ఒకరి నొకరు ఎరిగున్న గుర్తింపు, హెచ్చరిక
తొలి పిలుపు మాధుర్యంలోనే తొంగిచూచింది.
తొలి దర్శనంలోనే విధినిర్ణయం అవగతమైంది.
Aurobindo:
As when being cries to being from its depths
Behind the screen of the eternal sense
And strives to find the heart-disclosing word,
The passionate speech revealing the soul’s need,
But the mind’s ignorance veils the inner sight,
Only a little breaks through our earth-made bounds,
So now they met in that momentous hour,
So utter the recognition in the deeps,
The remembrance lost, the oneness felt and missed.
శార్వరి:
లోతులనుండి ఒకజీవి మరొక జీవికై ఆక్రందించినప్పుడు
బాహ్యవివేకపు యవనికాభ్యంతరంలో
హృదయానికి సన్నిహితమైన వాక్కుకోసం పలవరిస్తుంది
ఆత్మీయమైన భాషణ ఆత్మ అవసరాన్ని గుర్తిస్తుంది
కాని అజ్ణానంతో నిండిన మేధ అంతర్దృష్టిని దాచివేస్తుంది.
మన భౌతికబంధనాలను ఛేదించుకున్న ప్రజ్ఞ అది
ఆ మహత్తర ముహూర్తంలోనే వారు కలుసుకున్నారు
ఆంతర్యాలలో పరస్పరం గుర్తించుకున్నారు
విస్మృతి తొలగిపోగా, త్వమేవాహం అనుభూతిగా మిగిలింది.
నక్షత్రాలు నిండిన ఆకాశం భూమిని ఆలింగనం చేసుకున్నట్లు
అతను బ్రహ్మానందంతో ఆమెను తనలో చేర్చుకున్నాడు.
ఒక విశ్వాన్ని విశ్వాత్మ నింపివేసినట్లు
ఒక మానవుడు అమరత్వంలో మేల్కొన్నట్లు
పరిమితం అపరిమితంలో కలిసిపోయినట్లు
ఆమెను తన ఆత్మలో చొచ్చుకుపోనిచ్చాడు సత్యవంతుడు.
సావిత్రి సత్యవంతుల కథ, విధి కన్నా, మృత్యువు కన్నా ఆత్మశక్తి గొప్పదని చెప్పడం. యోగిని అయిన సావిత్రి మృత్యువును సైతం ఓడించింది. సావిత్రి జగన్మాత అవతారం లేదా ఆ అంశతో జన్మించిన కారణజన్మురాలు. సత్యవంతుని సహాయంతో మానవజాతిని ఉద్ధరించడానికి అవతరించిన ఆదిశక్తి. మృత్యువును జయించే మార్గం మానవులకు చూపదలచింది. మనం “ఆత్మ”ను గుర్తించి, ఆ “ఆత్మశక్తి”ని అభివృద్ధి చేసుకున్నప్పుడు, అది “విధి” గతిని మార్చగలదు అని సావిత్రి నిరూపిస్తుంది. ఆత్మశక్తితో విధి రాతను చెరిపేయవచ్చని, విధి బలీయంకాదని, అనుల్లంఘనీయం అంతకన్నా కాదని అవగతమౌతుంది. మన ఇచ్ఛాశక్తితో విధిని నడిపించవచ్చు. ఆత్మశక్తి ముందు విధి ఓటమిని అంగీకరిస్తుంది సావిత్రి సత్యవంతుల విషయంలో. సావిత్రి కారణజన్మురాలు లేదా జగన్మాత అంశతో జన్మించింది కాబట్టి విధిని ఎదిరించి విజయపథంలోకి నడిపించిందని చెప్పవచ్చు.
మనం ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించగానే, మనం భయపడే విధి, కర్మ క్షీణించడం ఆరంభమవుతుంది. సత్యవర్థనంతో జీవించేవారు కర్మను గురించి చింతించరు, విధికి అంతకన్నా భయపడరు. దివ్యత్వం మనలో ప్రవేశిస్తుంది. ఉన్నత లోకాల నుండి దివ్యశక్తి మనకు అందుతుంది. దానిని కర్మబంధం ఏమీ చేయలేదు. సాధకుడు తానై సాధించలేని దానిని “దివ్యకృప”తో సాధించగలడు. ప్రకృతి కల్పించే అవరోధాలను, నియమాలను దాటి ముందుకు పోగలడు. నిజానికి మనం ఎటుగా పయనించాలో, ఎలా పయనించాలో ఆ అదృశ్యశక్తే నిర్ణయిస్తుంది, చేయూతనిస్తుంది, నడిపిస్తుంది, ఇది శ్రీ శార్వరి యోగదర్శనం. యోగానుష్టానంతో శార్వరి అరవిందులు సావిత్రి సత్యవంతుల బతుకు సమరాన్ని, మృత్యుపోరాటాన్ని చూసిన తీరు వేరు. యౌగికంగా వీక్షించిన, అనుభవించిన, అనుభూతి చెందిన అద్భుతాలు, అద్వితీయాలు, అనంతతత్వాలు మానవాళి మనుగడకు, దిశానిర్దేశం చేస్తూ ఈ పుస్తకంలో ఆద్యంతం విపులంగా వివరించారు.
ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. బంధాలు, బాంధవ్యాలు, ప్రేమలు, అనురాగాలు, అసూయలు అన్నీ మనిషి మరణంతో ముగిసిపోతాయి. హృద్యమైనవి, సుందరమైనవి, మనకు అత్యంత ప్రియమైనవి కూడా ఈ లోకంలో శాశ్వతంకాదు. గతంలో చెప్పినట్లుగా ఏదీ సుస్థిరం కాదు. లోతుగా ఆలోచించి చూస్తే ఈ ప్రాపంచిక విషాదాలే మనిషికి అమరత్వాన్ని అందిస్తాయనిపిస్తుంది. విధి అందించే సుఖాలు ఊహకు అందవు. అలాగే విధి చాచి కొట్టే దెబ్బ కంటికి కనిపించదు.
అడుగు తడబడినప్పుడు, బతుకుబండి గాడి తప్పినప్పుడు, విషాదం నీడలా వెంటాడుతున్నప్పుడు దైవచింతనకి బీజం పడుతుంది. మన అవసరాలు పెరిగే కొద్దీ పరాచింతన పరుగులు తీస్తుంది.
సావిత్రి తన సహచరుడిగా ఎన్నుకున్న సత్యవంతుడు, మానవులలో ఉత్తముడు. విధి కారణంగా రాజభోగాలు, సంపదలు, సింహాసనం వదలి తల్లిదండ్రులతో కలిసి ఆశ్రమజీవనం గడుపుతున్నాడు. భవిష్యద్దర్శనం వల్ల కలిగే మేలు కన్నా, కొన్నిసార్లు కీడే ఎక్కువ. సత్యవంతుడికి అకాలమరణం పొంచి ఉందని తెలిసి తల్లిదండ్రులు తల్లడిల్లారు. భవిష్యత్ జ్ఞానం వల్ల బాధ మరీ ఎక్కువైంది. సావిత్రి తండ్రి అశ్వపతి, రాజర్షి. ఆయనకు తెలుసు, ఈ చరాచర సృష్టిని ఏదో అగోచరశక్తి నడిపిస్తుందని, ఆ మహాశక్తి శాసనాన్ని ఎవరూ ధిక్కరించలేరని. కానీ సావిత్రి తల్లి మాతృహృదయం మాత్రం కుమార్తెకు కలిగే వైధవ్యాన్ని తలచుకుని తల్లడిల్లింది. పరమాత్మ నిర్ణయం అక్రమమని, అన్యాయమని, పక్షపాతమని, వివాహమైన సంవత్సరానికి తన కుమార్తెకు వైధవ్యం కలగడం విధి ఆడుతున్న నాటకమని ఆమె ఆక్రోశించింది. క్రూర విధి దారికాచి, తన కుమార్తెను అపహసిస్తోందని బలంగా నమ్మింది.
విధిని తప్పించలేం అంటే మన తల రాతల్ని మార్చలేమని. మన తలరాతలు రాసే దేవుళ్లలా, దేవతల్లా మనం కఠినంగా వుండలేం. మన బాధలు, విషాదాలు మనకు చాలవన్నట్లు ఇతరుల బాధల్ని, కష్టాల్ని, విషాదాల్ని మనవిగా చేసుకుంటాం. గతించిపోయిన ఔన్నత్యానికి మనం విచారిస్తాం. అశాశ్వతమైన వాటి కోసం కన్నీరు కారుస్తాం. పరాయివాడి బాధ, మన గుండెను కోస్తుంది. అల్పసుఖం వల్ల, అనల్పదుఃఖం వాటిల్లుతుంది. మానవ సుఖదుఃఖాలను దేవతలు క్షణికం చేస్తారు కాని అందుకు యోగా సాధన, ఆత్మజ్ఞానం, పరాచింతన అవసరం. సావిత్రి అందుకు యోగ్యమైన భగవదాంశతో పుట్టిన కారణజన్మురాలు.
“నా హృదయం సత్యవంతునికే అంకితమైంది
నా నిర్ణయాన్ని ఏ విధిరాత కాదనలేదు
విధి, మృత్యువు, కాలం ఏవీ మా బంధాన్ని తుంచలేవు
ఆంతర్యంలో ఒక్కటైన వారు ఎన్నటికీ విడిపోరు
సావిత్రి ఆంతర్యంలో: మృత్యువు మా శరీరాలను వేరు చేస్తుంది కానీ ఆత్మల్ని కాదు. సత్యవంతుడిని మృత్యువు కబళిస్తే, ఎట్లా ఎదుర్కోవాలో నాకు తెలుసు. విధి తన ఇష్టం వచ్చినట్లు, చేయగలిగినంత చేయనీయండి. నేను మృత్యువుకన్నా, విధికన్నా బలవంతురాలిని. నా ప్రేమ ఈ లోకంలో శాశ్వతమవుతుంది. నా అమరత్వానికి అడ్డుగా నిలిచిన విధి ఓడిపోతుంది.
“విధిశాశనం మారవచ్చు కానీ, నా నిర్ణయం మారదు”.
నా సహజవాస్తవకతను (నన్ను) నా శరీరంలో కాకుండా సత్యవంతుడిలో దర్శించాను. అతనే నా ఆత్మ. అతని చెలిమితో నా జీవితం చరితార్థమైంది. సత్యవంతుడిలో పరమాత్మను నేను దర్శించాను. మానవరూపంలో ఉన్న పరమాత్మ అతనే.
పుట్టిన వాడు గిట్టక తప్పదు. జీవితం ఆరంభంలోనే మృత్యువుకి బీజం పడుతుంది. ప్రాపంచిక ప్రమాదాలు, విచిత్రమైన సంఘటనలు, మానసిక వేదనలు తప్పించుకొన వీలులేని వారసత్వంగా వస్తాయి. కాలానికి, కర్మలకు శరీరం బందీ. శరీరం క్రమంగా బాధకులోనై మృత్యువును చేరుతుంది. మానవ నైజం మంచివాటిని మన శత్రువులుగా పరిగణించడం. నిజానికి గతంలో మనం చేసిన దుష్కర్మలే నేటి మన కష్టాలు. నేటి మన మంచి చెడులు రేపటికి కర్మశేషాలు. మనిషి ఆరాట పోరాటాలలో యుద్ధాలు, దోపిడీలు, దొంగతనాలు, అరాచకాలు ప్రధానపాత్ర వహిస్తాయి. అవే చివరికి వినాశనానికి దారితీస్తున్నాయి. ద్వేషం, అసూయ మంచిని సమాధి చేస్తాయి. ప్రజ్ఞాప్రాభవాలతో నిర్మించుకున్న ఔన్నత్యం, సౌందర్యం, జీవితంలో శ్రమించి కూడబెట్టిన సంపద అన్నీ అరిషడ్వర్గాలతో నాశనమవుతాయి.
దుర్బలత్వం మనిషిని శారీరకంగా, మానసికంగా కుంగదీస్తుంది. అజ్ఞానం ఉన్న తావుల్లోనే బాధలు ఏర్పడతాయి. మనం ఉన్నదనుకున్న ‘ఆత్మ’సైతం లేనేలేదేమో అనిపిస్తుంది. మాయ ఆవరించినప్పుడు, సమాధిస్థితిలో సాక్షాత్కరించే పరమాత్మ సైతం కల్పనగా తోస్తుంది. జీవనప్రస్థానంలో ముందు కలిగేది బాధ, ఆ తర్వాతిదే ఆనందం. మనిషి వాంఛలు, కోరికలు, కన్నీళ్లు అధిగమించినప్పుడే ఆత్మ తృప్తిగా, నిశ్చలంగా, నిర్మలంగా ఉండగలుగుతుంది.
తనను తాను రక్షించుకోగలవాడు సంతోషంగా జీవిస్తాడు కానీ లోకాన్ని ఉద్ధరించాలనుకున్నవాడు, రక్షించాలనుకున్నవాడు బాధలు భరించక తప్పదు. ఇతరులకి స్వర్గసుఖాలు అందించాలనుకున్నప్పుడు, తాము కష్టాల్లో పడతారు. కష్టాలు అనుభవిస్తేనే కర్మవిముక్తి లభిస్తుంది. ప్రాజ్ఞులైన వారు ప్రాపంచిక సిరిసంపదల కోసం కాకుండా జ్ఞానసంపదకు జీవితాలను వెచ్చిస్తారు.
అందరూ తమలో, సర్వజీవులలో పరమాత్మను చూడాలి. అగ్నులు, ఆవేదనలు, ఆరాటపోరాటాలు, అన్నీ అంతర్గతాలే కాని ఆత్మకు సంబంధించినవి కావు. లోకంలో మళ్ళీ పుట్టి జీవించడం కోసం జీవుడు మళ్లీ మరణిస్తాడు. బాధ అన్నది నీ అజ్ఞానానికి ఒక సంకేతం. నీ కష్టాలకు, బాధలకు నీవే కర్తవు. ప్రేమ ఒక్కటే మృత్యుకల్లోలాన్ని దాటిపోగలదు. కర్మను దాటి పోవాలంటే ఆత్మను జయించాలి.
సావిత్రి స్వర్గలోకంలోని అమృతరూపిణి కావచ్చు కాని స్వర్గభూములుదాటి భూలోకానికి దిగివచ్చింది. కనుక మానవ సహజమైన విషాదాలను అనుభవించాలి. జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, కష్టాలు దేహాన్ని సుఖదుఃఖాలతో బాధించినా అవే కర్మఫలాలు కావు. అవి వచ్చి వెళ్లిపోతాయి. ఆత్మ పురోగమనాన్ని మృత్యువు సైతం నిరోధించలేదు. నీవు ఎన్నుకున్న మార్గమే నీ విధి, అదే నీ పరమావధి.
జీవి పదార్థస్థితి నుండి కాలాతీత ఆత్మస్థితికి బాటలు వేయాలి. కష్టాలు, సుఖాలు, సంపదలు, ఆకలిదప్పులు, విజయాలు, అపజయాలు, కామనలు, కన్నీళ్లు, జీవితంలో ఎదురయ్యే ఎడారులు, పచ్చని నేలలు, ఊసరక్షేత్రాలు, సుక్షేత్రాలు, కారడవులు, చీకట్లు అన్నింటినీ దాటుకుంటూ ముందుకు పోవాలి. ఆ తరువాతనే బ్రహ్మానందం అనుభవానికి వస్తుంది.
సత్యవంతుడి మరణం దైవ లిఖితం. ఆ సమయం నిర్ణయమైంది, మృత్యుఘాతం తప్పదు.
ఒకవేళ జగన్మాత సావిత్రిని, ఆమె శక్తికే వదిలేస్తే మృత్యువు ఆసన్నమైనప్పుడు ఆమె ప్రయత్నాలన్నీ విఫలమై, పరాజయం అనివార్యమయ్యేది. ఆమెకు ఏ మానవశక్తీ సహాయపడదు, అంతకన్నా ఆమె సత్యవంతుడిని కాపాడలేదు. ఇక్కడ జగన్మాత అంశతో జన్మించిన సావిత్రికి అందుకు భిన్నంగా ఆమెలో నిగూఢమైన ఈశ్వరేచ్ఛ బాసటగా నిలుస్తుంది. జగన్మాత కృపతో అపజయాలన్నీ ఘనవిజయాలవుతాయి.
“సత్యవంతుని మరణం ఉత్తమ జీవితానికి ఒక ఆరంభం”.






