TANA: తెలుగు పద్మ అవార్డు గ్రహీతలకు ‘తానా’అభినందనలు
రిపబ్లిక్ డే వేడుకలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన విశిష్ట వ్యక్తులకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించింది. అందులో చోటు దక్కించుకున్న తెలుగువాళ్ళను ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అభినందనలను అందజేస్తోంది. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖులకు పద్మ అవార్డులు లభించాయి. ఇందులో ప్రముఖ క్యాన్సర్ వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారికి పద్మభూషణ్ అవార్డును, సినీ నటులు రాజేంద్ర ప్రసాద్ గారికి, మురళీ మోహన్ గారికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. వీరికి తానాతో ఎంతో అనుబంధం ఉంది. తానా మహాసభల్లో వారిని ఇదివరలోనే అవార్డులతో సత్కరించిన సంగతి చాలామందికి తెలిసి ఉంటుంది.
డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారిని కమ్యూనిటీ సర్వీస్ అవార్డుతోపాటు, 2025లో జరిగిన తానా కాన్ఫరెన్స్ లో ఎక్సలెన్సీ ఇన్ మెడిసిన్ అవార్డుతో తానా సత్కరించింది. 2023లో నటుడు రాజేంద్ర ప్రసాద్ గారికి తానా ప్రెసిడెన్షియల్ అవార్డును, 2025లో నవరస పోషక చక్రవర్తి అవార్డును, మరోనటుడు మురళీమోహన్ గారికి 2023లో ఎన్టీఆర్ కల్చరల్ అవార్డు (NTR Cultural Award), 2025లో జీవితసాఫల్య అవార్డును అందజేసి సత్కరించింది.
వీరితోపాటు పద్మశ్రీ అవార్డులను అందుకున్న విశిష్ట వ్యక్తులను కూడా తానా అభినందిస్తోంది. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (కళలు), వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్యం, విద్య), కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్ (సైన్స్ అండ్ ఇంజినీరింగ్) పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (వైద్యం), డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ (సైన్స్), రామారెడ్డి మామిడి (మరణానంతరం) (పశుసంవర్థక, పాడి పరిశ్రమ), గూడూరు వెంకట్రావు (వైద్యం), దీపికారెడ్డి(నృత్యం), గడ్డమనుగు చంద్రమౌళి (సైన్స్) గార్లకు పద్మశ్రీ అవార్డులు ఇచ్చారు. వీరందరికీ తానా అభినందనలు తెలియజేస్తోంది.






