Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను కృష్ణదేవరాయలతో పోల్చడం సమచితమేనా?
కర్ణాటకలోని ఉడుపి (Udupi, Karnataka) క్షేత్రంలో నిర్వహించిన ‘బృహత్ గీతోత్సవ’ కార్యక్రమం భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మికత కలిసి మరింత వెలిగిన వేదికగా నిలిచింది. ఈ మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హాజరై శ్రీకృష్ణ దేవాలయాన్ని దర్శించుకున్నారు. పర్యాయ పుట్టిగే శ్రీకృష్ణ మఠం అధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ (Sugunendra Theertha Swamiji, Pejawara Math) పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక ఆశీర్వచనం ఇచ్చి, “అభినవ శ్రీకృష్ణదేవరాయ” బిరుదుతో సత్కరించారు. ఈ బిరుదు కేవలం ఘనత కాదు – తన భాష, తన సంప్రదాయం కోసం పోరాడే నాయకుడిని గుర్తించడమే.
సనాతన ధర్మం మూఢనమ్మకం కాదని, అది శాస్త్రీయమైన, లోతైన ఆధ్యాత్మిక జ్ఞానం అని పవన్ కళ్యాణ్ అన్నారు. మన ధర్మాన్ని మనమే కాపాడుకోకపోతే, ఇతరులపై నిందలు మోపడం ప్రయోజనం ఉండదని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులో (Tamil Nadu) జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ, ధర్మ పరిరక్షణ కోసం న్యాయపోరాటాలు కూడా చేయాల్సి వచ్చిందని గుర్తుచేశారు. భారత రాజ్యాంగం (Indian Constitution) మొదటి పేజీలో గీతోపదేశ దృశ్యం ఉండటం కూడా భారత ఆత్మ ఏ దిశలో నడవాలో చూపుతుందన్నారు.
సమాజంలో కొన్నిసార్లు సనాతన ధర్మాన్ని వక్రీకరించడానికి ప్రయత్నాలు జరుగుతాయని, అలాంటి సందర్భాల్లో మౌనం పాపం అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. “వసుధైవ కుటుంబకం” అనే భావనను ఉడుపి క్షేత్రంలో అనుభవించవచ్చని, అక్కడ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఒకే దైవభక్తిలో కలిసిపోతున్నారని చెప్పారు. ఒక కోటి మందితో భగవద్గీతను స్వహస్తాలతో రాయించడం వంటి చారిత్రాత్మక కార్యక్రమం, సుగుణేంద్ర స్వామీజీ దూరదృష్టికి నిలువెత్తు నిదర్శనంగా ఆయన అభివర్ణించారు.
భగవద్గీత వయస్సు, వర్గం, మతం చూసేదేమీ కాదని, అది కష్టాల్లో దారి చూపే గురువని పవన్ కళ్యాణ్ వివరించారు. నేటి యువత గీతను పాతపుస్తకంగా కాకుండా, మానసిక బలాన్ని ఇచ్చే మైత్రిగా చూడాలని సూచించారు. రాజకీయ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా గీత తనకు మార్గనిర్దేశం చేసిందని, ముఖ్యంగా 2024 ఎన్నికల ముందు ఉన్న అనిశ్చితి సమయంలో అర్జునుడు ఎదుర్కొన్న పరిస్థితులు తనకూ ఎదురయ్యాయని, అందుకే 21 స్థానాలకు మాత్రమే పోటీ చేశానని తెలిపారు.
అయితే పవన్ కళ్యాణ్ కు “అభినవ శ్రీకృష్ణదేవరాయ” బిరుదు ఇవ్వడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయలు (Sri Krishnadevaraya) తెలుగు సంస్కృతి, సాహిత్యం, కళలకు స్వర్ణయుగాన్ని తెచ్చిన మహారాజు. ఆయన పరిపాలనా ప్రతిభ, యుద్ధ నైపుణ్యం , తెలుగు భాషకు అందించిన అప్రతిహత సేవలు శతాబ్దాలుగా చరిత్రలో నిలిచాయి. ఈనాటికి కూడా కృష్ణదేవరాయలు కట్టించిన ఆలయాలు తెలుగు సంస్కృతికి ఆనవాలుగా పూజలు అందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఏ సమకాలీన రాజకీయ నాయకుడినైనా ఆ స్థాయి ప్రతీకతో పోల్చడం సరికాదు . బిరుదులు ప్రయోజనాల కోసం , చారిత్రక వ్యక్తుల మహోన్నతిని తగ్గించేలా ఉండకూడదని విమర్శకులు అంటున్నారు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతున్నది కేవలం కొన్ని సంవత్సరాల నుంచి మాత్రమే.. మరి అటువంటి వ్యక్తిని కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన చక్రవర్తితో పోల్చడం సముచితం కాదు.
– Bhuvana






