Chandrababu: పనితీరు పరంగా కీలక స్థానాలు సాధించిన మంత్రులు వీరే..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పాలనలో ప్రతి నిర్ణయం గణాంకాలకు ఆధారపడిందనే విషయం అధికార యంత్రాంగం మాత్రమే కాదు, ప్రజలకూ తెలిసిందే. మాటలు కాకుండా వాస్తవాలు, డేటా ఆధారిత వివరాలు ప్రజల ముందు ఉంచడం ఆయన ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక పద్ధతి. ఇదే విధానంతో ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో కూడా సీఎం చంద్రబాబు వివిధ శాఖల ఫైల్ క్లియరెన్స్ వివరాలను బహిర్గతం చేశారు. ఎవరు ఎంత వేగంగా ప్రజాసంబంధ ఫైళ్లను పూర్తి చేశారో అంకెలతో వివరించడంతో అధికారులు, మంత్రులు అందరూ మరింత అప్రమత్తమయ్యారు.
మంత్రుల పనితీరును పరిశీలిస్తూ విడుదల చేసిన ఈ సమాచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరో స్థానంలో ఉండడం ప్రత్యేకంగా కనిపించింది. ఆయన తరువాత స్థానాల్లో నారా లోకేష్ (Nara Lokesh) తొమ్మిదవ స్థానంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పదకొండవ స్థానంలో ఉన్నారు. అయితే ఈ ముగ్గురికంటే ముందుగా ఐదుగురు మంత్రులు ఫైళ్ల పరిశీలనలో వేగం ప్రదర్శించడం గమనించదగిన విషయం. మొదటి స్థానాన్ని డోలా బాల వీరాంజనేయ స్వామి (Dola Bala Veeranjaneya Swamy) దక్కించుకున్నారు. ప్రజల నుండి వచ్చిన ఫైళ్లను ఆయన సగటుగా రెండు రోజులు 41 నిమిషాల్లో పరిష్కరించడం ఈ ర్యాంక్‌కు ప్రధాన కారణం. మొత్తం 651 ఫైళ్లను క్లియర్ చేసి ముందంజలో నిలిచారు.
ఆ తరువాత స్థానాల్లో నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu), ఎన్.ఎస్.డి ఫరూక్ (N.S.D. Farooq), బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy), పొంగూరు నారాయణ (Ponguru Narayana) ఉన్నారు. అదే సమయంలో ఫైల్ క్లియరెన్స్ లో ఆలస్యంగా ఉన్న చివరి ఐదు స్థానాలను కొలుసు పార్థసారథి (Kolusu Parthasarathy), నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar), పయ్యావుల కేశవ్ (Payyavula Keshav), కొల్లు రవీంద్ర (Kollu Ravindra), మడింపల్లి రాంప్రసాద్ రెడ్డి (Madimpalli Ram Prasad Reddy) ఆక్రమించారు.
సమీక్షలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సేవలను పూర్తిగా ఆన్లైన్ ద్వారా అందించేలా వ్యవస్థ సిద్ధం అవుతుందని చెప్పారు. కొంతమంది శాఖలు ఇప్పటికీ భౌతిక విధానంలో సేవలు అందిస్తున్నాయని, వెంటనే డిజిటల్ పద్ధతులకు మారాలని సూచించారు. ప్రజలకు అవసరమైన ఏ సేవకైనా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా “మనమిత్రా వాట్సాప్ గవర్నెన్స్ ( Manamitra WhatsApp Governance) ద్వారా అందుబాటులోకి తెస్తున్నామని సీఎం పేర్కొన్నారు. ఈ సేవల గురించి ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలనీ కూడా ఆదేశించారు.
డేటాను ఆధారంగా చేసుకుని పాలన సాగిస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, వేగవంతమైన ఫైల్ క్లియరెన్స్‌తో పారదర్శకతకు మరొక మెట్టు వేసినట్లు అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.






