Amaravathi: కాగ్ కార్యాలయం ఏర్పాటుతో అమరావతి అభివృధికి మరో బలమైన అడుగు..
ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశం ఎప్పుడు మాట్లాడినా మొదట గుర్తుకు వచ్చేది అమరావతి (Amaravati) గురించే. ఎప్పటి నుంచో ఇది రాజకీయాలు, అభివృద్ధి, రైతుల ఉద్యమాలు వంటి కారణాలతో పెద్ద చర్చకు దారి తీస్తూనే ఉంది. ముఖ్యంగా గత వైసీపీ (YCP) ప్రభుత్వ కాలంలో అమరావతి చుట్టూ జరిగిన పరిణామాలు, మూడు రాజధానుల ప్రతిపాదన, రైతుల నిరసనలు, పోలీసు చర్యలు ఇలా అన్నీ కలిసి రాష్ట్ర రాజకీయాల్లో ఈ ప్రాంతాన్ని కేంద్ర బిందువుగా మార్చాయి.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతిలో పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రభుత్వంగా రాజధాని నిర్మాణానికి మళ్లీ వేగం పెంచడంతో పాటు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఇక్కడ ఏర్పాటుకు ముందడుగు వేస్తుండటం మరింత ప్రాధాన్యాన్ని తీసుకొచ్చింది. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వంటి కీలక ఆర్థిక సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు భూమి పూజలు నిర్వహించాయి. వీటి నిర్మాణాలు కూడా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నాయి.
ఇక తాజా పరిణామంగా, కేంద్రం మరొక ముఖ్యమైన చర్య తీసుకుంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) కార్యాలయాన్ని అమరావతిలో స్థాపించేందుకు అనుమతులు మంజూరు చేసింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు ఎకరాల భూమిని కేటాయించగా, భవనం నిర్మాణాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే చేపట్టనుంది. ఈ కార్యాలయం రాకతో అమరావతికి కేంద్ర మద్దతు మరింత స్పష్టమైంది. ముఖ్యంగా రాజధాని అభివృద్ధికి ఇది ఒక బలమైన అడుగుగా భావిస్తున్నారు.
గతంలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రణాళికను ప్రకటించినప్పుడు కేంద్రం కూడా కొంత అసహజంగా స్పందించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అమరావతికి స్పష్టమైన నోటిఫికేషన్ లేకపోవడం, రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి వంటి అంశాల వల్ల కేంద్రం అప్పట్లో ముందుకురాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండటం, అలాగే కేంద్రంలో కూడా అనుకూల వాతావరణం ఉండటంతో అమరావతిపై దృష్టి మరింతగా పడింది.
కేంద్ర సంస్థల వరుసగా రావడం, నిధుల కేటాయింపు, ప్రాజెక్టుల ప్రారంభం.. ఇలా అన్ని అంశాలు అమరావతి విషయం లో కూటమి కట్టుబాటుకు నిదర్శనం గా నిలుస్తున్నాయి.ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం, రహదారులు, మౌలిక సదుపాయాలు, జాతీయ స్థాయి సంస్థల ఏర్పాటుతో రాజధాని రూపురేఖలు మళ్లీ స్పష్టమవుతున్నాయి. ఈ పరిణామాలు వెలువడుతున్న కొద్దీ, అమరావతి మరోసారి రాజకీయ చర్చలకు దారి తీస్తున్నా, ఈసారి దాని దిశ అభివృద్ధివైపే కనిపిస్తోంది. రాష్ట్ర ప్రజలు కూడా చాలా కాలంగా ఎదురు చూస్తున్న రాజధాని కల నిజం కావడానికి ఇప్పుడు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి.






