Amazon: భారత్ పై అమెజాన్ ఫోకస్.. రూ.3.15 లక్షల కోట్ల పెట్టుబడులు
ట్రంప్ వీసా విధానం, వలసవాదులపై కఠిన చర్యలు దరిమిలా.. దిగ్గజ కంపెనీలు ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారిస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, గూగుల్ భారత్ లో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించగా.. లేటెస్టుగా అమెరికా ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్… ఇండియాలో తన వ్యాపార ప్రణాళికలను వివరించింది., 2030 కల్లా మనదేశంలో 35 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.15 లక్షల కోట్ల) పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించింది. ‘అమెజాన్ సంభవ్ సమిట్’లో ఈ విషయాన్ని తెలిపింది. అమెరికా ఐటీ దిగ్గజాలైన మైక్రోసాఫ్ట్, గూగుల్ ప్రకటించిన మొత్తానికి సమానంగా అమెజాన్ ఒక్కటే ఇంత భారీ పెట్టుబడులు ప్రకటించడం విశేషం. క్విక్ కామర్స్‌తో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, కృత్రిమ మేధ(ఏఐ)లో వ్యాపారాన్ని విస్తరించడం కోసం వీటిని వినియోగించనుంది.
కృత్రిమ మేధ, లాజిస్టిక్స్ మౌలిక వసతులపై 2030లోగా ఈ పెట్టుబడులను అమెజాన్ పెట్టనుంది. తద్వారా భారత్‌లో 10 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పేర్కొంది. వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌తో పాటు దేశీయ సంస్థలైన జియోమార్ట్, బ్లింకిట్, ఇన్‌స్టామార్ట్ జెప్టోలకు పోటీనివ్వడం కోసం అమెజాన్ ఇక్కడ పెట్టుబడులు పెంచుతోంది. 2010 నుంచి ఇప్పటిదాకా 40 బి. డాలర్ల (సుమారు రూ.3.60 లక్షల కోట్ల)ను అమెజాన్ వెచ్చించింది.
2023లోనూ 26 బిలియన్ డాలర్ల (సుమారు రూ.2.34 లక్షల కోట్ల) పెట్టుబడులను ప్రకటించింది. తాజా పెట్టుబడులతో భారత్‌లోని విక్రేతల ఎగుమతులు 2030 కల్లా 80 బిలియన్. డాలర్ల (సుమారు రూ.7.20 లక్షల కోట్ల)కు చేరడానికి ఉపయోగపడతాయి. ‘భారత వృద్ధికి మేం ఒక ఉత్ప్రేరకంగా ఉండడాన్ని కొనసాగిస్తాం. కోట్ల మంది భారతీయులకు ఏఐని దగ్గర చేస్తామ’ని అమెజాన్ హెడ్ ఆఫ్ ఎమర్జింగ్ మార్కెట్స్ అమిత్ అగర్వాల్ తెలిపారు.






