Gold : భారతీయుల ఇళ్లలో ‘బంగారు కొండ’..!
బంగారం.. ఇది భారతీయులకు కేవలం ఒక లోహం కాదు. ఇది ఒక సంస్కృతి, ఒక సంప్రదాయం, అన్నింటికీ మించి ఆర్థిక భద్రతనిచ్చే భరోస’. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నా, భారతీయులకు పసిడిపై ఉన్న మోజు ఏమాత్రం తగ్గడం లేదు సరికదా.. అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ ‘మోర్గాన్ స్టాన్లీ’ విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని గణాంకాలతో సహా వెల్లడించింది. భారతీయ కుటుంబాల వద్ద పోగుపడిన బంగారం విలువ, పరిమాణం చూస్తే ప్రపంచ దేశాలు సైతం ఆశ్చర్యపోవాల్సిందే.
మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం, ఈ ఏడాది జూన్ నాటికి భారతీయ కుటుంబాల వద్ద ఏకంగా 34,600 టన్నుల బంగారం ఉంది. నగలు, బిస్కెట్లు, నాణేల రూపంలో ఇళ్లలో భద్రంగా ఉన్న ఈ పసిడి ప్రస్తుత మార్కెట్ విలువ సుమారు రూ. 342 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఈ సంఖ్య ఎంత పెద్దదంటే.. ఇది మన దేశ మొత్తం స్థూల దేశీయ ఉత్పత్తి (GDP)లో దాదాపు 88.8 శాతానికి సమానం. అంటే, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సమానమైన సంపద భారతీయుల ఇళ్లలోని లాకర్లలో నిక్షిప్తమై ఉందన్నమాట. మరే ఇతర దేశంలోని ప్రజల వద్ద కూడా ఇంత భారీ స్థాయిలో బంగారం నిల్వలు లేవు.
గతంలో భారతీయులు బంగారాన్ని కేవలం అలంకరణ వస్తువుగా లేదా శుభకార్యాల్లో ధరించే ఆభరణంగా మాత్రమే చూసేవారు. లక్ష్మీదేవి స్వరూపంగా భావించి పూజించేవారు. కానీ, ఇప్పుడు ఆ దృక్పథంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గడిచిన ఏడాది కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరగడం, పెట్టుబడిదారులకు ఏకంగా 60 శాతానికి పైగా లాభాలను అందించి ఉండటంతో.. సామాన్యులు కూడా దీనిని ఒక బలమైన పెట్టుబడి సాధనంగా (Investment Tool) చూడటం మొదలుపెట్టారు. రియల్ ఎస్టేట్ లేదా స్టాక్ మార్కెట్లో ఉండే ఒడిదుడుకులతో పోలిస్తే, బంగారం సురక్షితమైనదని, ఎప్పుడైనా నగదుగా మార్చుకునే వెసులుబాటు ఉంటుందని భారతీయులు బలంగా నమ్ముతున్నారు. అందుకే ధర పెరుగుతున్నా కొనుగోళ్లు ఆపడం లేదు.
బంగారం కొనుగోలు విషయంలో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం భవిష్యత్తు అవసరాలకు లేదా లాభం కోసం బంగారం కొనాలనుకునే వారు ఆభరణాల జోలికి వెళ్లకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఆభరణాల తయారీలో వృథా (Wastage) పోవడంతో పాటు, మజూరీ (Making Charges) రూపంలో అధిక మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. నగల తయారీలో వాడే రత్నాలు, రాళ్లు ఆభరణం బరువులో 30 నుంచి 35 శాతం ఆక్రమిస్తాయి. తిరిగి అమ్మేటప్పుడు ఈ రాళ్లకు సరైన విలువ రాదు. ఈ ఖర్చులన్నీ పోను లాభం రావాలంటే, బంగారం ధర ఏటా కనీసం 30 శాతం పెరగాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడూ సాధ్యం కాకపోవచ్చు. అందుకే, లాభార్జనే ధ్యేయంగా పెట్టుబడి పెట్టేవారు ‘ఫిజికల్ గోల్డ్’ (బంగారు కడ్డీలు, నాణేలు) లేదా ‘గోల్డ్ ఈటీఎఫ్‌లు’ (Gold ETFs), సావరీన్ గోల్డ్ బాండ్ల వైపు మొగ్గు చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మార్పును గమనించిన మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా కొత్త పథకాలతో ప్రజలను ఆకర్షిస్తున్నాయి.
ఏది ఏమైనా, భారతీయుల డీఎన్ఏలోనే బంగారం కలిసిపోయింది. అది అలంకరణ కోసమైనా, ఆపదలో ఆదుకునే ఆస్తిగానైనా సరే.. బంగారం కొనుగోలు మాత్రం ఆగదు. అయితే, ఇప్పుడు సెంటిమెంటుకు తెలివి కూడా తోడైంది. సంప్రదాయ ఆభరణాల మోజు ఒకవైపు కొనసాగుతుండగానే, మరోవైపు డిజిటల్, పేపర్ గోల్డ్ రూపంలో ఆధునిక పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచం ఆర్థిక మాంద్యం భయాలతో ఉన్నా, భారతీయుల ఇళ్లలోని ఈ ‘బంగారు కొండ’ మన ఆర్థిక వ్యవస్థకు ఒక అదృశ్య రక్షణ కవచంలా నిలుస్తోందనడంలో సందేహం లేదు.






