తెలంగాణ లో జోరు మీదున్న రియల్ రంగం

పూణే, ముంబై, చెన్నై, బెంగళూర్, కలకత్తా వంటి ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటే, హైదరాబాద్ లో మాత్రం అందుకు భిన్నంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంటోంది. హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అమ్మకాలు తగ్గుతాయని నిపుణులు భావిస్తే, అందుకు భిన్నంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మంచి డిమాండ్‌తో దూసుకుపోతోంది. కరోనా ప్రభావం కూడా తగ్గడంతో నిధానంగా వ్యాపారం ఊపు అందుకుంటున్నదని రియల్టర్లు చెబుతున్నారు. దేశంలోని ఇతర నగరాల కంటే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ కోలుకోవటం తెలంగాణా రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగానికి మళ్ళీ పుంజుకునే అవకాశాన్ని ఇచ్చింది. హైదరాబాద్ తరహాలో రాష్ట్రంలో వరంగల్, ఖమ్మం తదితర ప్రధాన నగరాల్లో కూడా మార్కెట్ పెరుగుతోంది.
భాగ్యనగరంలో అంతర్జాతీయ కంపెనీలు నగరానికి క్యూ కడుతున్నాయి. హైదరాబాద్ ఐటీ ఎగుమతులు లక్ష కోట్లను దాటాయి. కంపెనీల రాక, స్టార్టప్‌లకు ప్రభుత్వ ప్రోత్సాహం, సింగిల్ విండో విధానంలో అనుమతుల కారణంగా హైదరాబాద్ పెట్టుబడుల కేంద్రంగా మారుతోంది. ఈ కంపెనీల రాకతో, మరోవైపు భాగ్యనగరానికి ఉన్న బ్రాండ్ పెరిగిపోవడంతో రియల్ ఎస్టేట్‌కు ఇక్కడ ఢోకా లేని విధంగా కనిపిస్తోంది. దీంతో ఇక్కడి భూములకు గిరాకీ తగ్గడం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో హైదరాబాద్‌లోనే కాకుండా.. తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లోనూ భూముల ధరలు పెరిగాయి. ఆంధ్ర ప్రదేశ్ రియల్టర్లు కూడా హైదరాబాద్‌ను పెట్టుబడుల కేంద్రంగా చూస్తుండటంతో భూములకు గిరాకీ తగ్గడం లేదు. రాజకీయ సుస్థిరత, ప్రభుత్వం నుంచి సహకారం, నగరాభివద్ధి పట్ల ముందు చూపుతో వ్యవహరిస్తుండటంతో హైదరాబాద్‌లో మళ్లీ రియల్ బూమ్ కనిపిస్తోంది. ఏడాది క్రితంతో పోలిస్తే.. భూములు, ఫ్లాట్ల ధరలు భారీగా పెరిగాయి. ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
హైరైజ్ బిల్డింగ్స్…
అమెరికాలోనూ, ఇతర విదేశాల్లోనూ కనిపించే పెద్ద పెద్ద భవంతులు ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా కనిపించనున్నాయి. గతంలో కేవలం 5, 10 అంతస్తుల బిల్డింగులే అద్భుతమైంది. తరువాత అది 30కి వెళ్ళింది. ఇప్పుడు ఏకంగా 50కి దగ్గరలో నిర్మితమవుతోంది. హైదరాబాద్‌లో ఇప్పుడు ఆకాశాన్ని తాకే బిల్డింగులు నిర్మితవుతున్నాయి. ఇప్పటివరకు ఇటువంటి నిర్మాణాలపై ఉన్న నిబంధనలను సడలించారు. ఆకాశహర్మ్యాల నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నారు. 40, 50 అంతస్తుల భవనాలకు అనుమతులు ఇవ్వకపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని ప్రభుత్వం ఈ మధ్యే గుర్తించింది. ఇప్పటికే పలు సంస్థలకు అనుమతులు కూడా లభించాయి. కొన్నైతే ఇప్పటికే పనులు కూడా ప్రారంభించాయి. భారీ బిల్డింగులు నిర్మించడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ముఖ్యంగా మొత్తం స్థలంలో 20 శాతం మాత్రమే నిర్మాణానికి ఉపయోగించుకోవచ్చు. మిగిలిన దాన్ని పచ్చదనంతో నింపేయొచ్చు. లేదంటే ఇతర సౌకర్యాలు కల్పించొచ్చు. పైగా అంతర్గత రోడ్లు, డ్రైనేజ్, ఇతరత్రా మౌలిక వసతులకు చేయాల్సిన ఖర్చులు తగ్గిపోతాయి. అందుకే, బిల్డర్లు ఆకాశహర్మ్యాలవైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే గచ్చిబౌలి, రాయదుర్గం, కొత్తగూడ, ఖాజాగూడ, పుప్పాల్‌గూడ, నార్సింగ్, అప్పాజంక్షన్, రాజేంద్రనగర్, నానక్‌రాంగూడ, కూకట్‌పల్లి, మూసాపేట, ఫతేనగర్, సోమాజిగూడ ఏరియాల్లో నిర్మాణాలు వూపందుకు న్నాయి. విదేశాల్లో ఉన్నట్టే హైదరాబాద్‌లోనూ హైరైజ్ బిల్డింగ్‌లను త్వరలోనే మరింతగా చూడవచ్చు.
హైదరాబాద్‌లో హైరైజ్ బిల్డింగ్స్ సంఖ్య బాగా పెరుగుతోంది. దానికితోడు భవన అంతస్థుల నిర్మాణంలో రికార్డ్‌లు బద్దలవుతున్నాయి. ఇప్పటివరకు నగరంలో అత్యంత ఎత్తయిన నిర్మాణంగా కూకట్‌పల్లిలో 42 ఫ్లోర్ల లోధా బెల్లెజ్జాను చెప్పేవారు. ఇప్పుడు దానికి మించిన అంతస్థులతో ఓ భవనం నిర్మాణమవుతోంది. ఎస్‌ఏఎస్ ఇన్‌ఫ్రా నానక్‌రాంగూడ ఓఆర్‌ఆర్ దగ్గర 4 ఎకరాల్లో 57 ఫ్లోర్లతో డైమండ్ టవర్స్ పేరుతో నిర్మాణం చేస్తోంది. కోకాపేటలో కూడా ఇదే సంస్థ 4.5 ఎకరాల్లోని 45 అంతస్తుల్లో క్రౌన్ పేరుతో హైరైజ్ బిల్డింగ్స్‌ను నిర్మిస్తోంది. సుమధుర గ్రూప్ కూడా వేవ్‌రాక్ దగ్గర్లో ఐదున్నర ఎకరాల్లో 44 అంతస్తులతో ఒలింపస్ పేరుతో నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇదే సంస్థ నానక్‌రాంగూడలో 56 అంతస్తుల టవర్స్‌ను ఏర్పాటు చేస్తోంది. నానక్‌రాంగూడ ఓఆర్‌ఆర్ ప్రాంతంలో అపర్ణా కన్‌స్ట్రక్షన్స్ 50 ఎకరాల్లో 50 అంతస్తుల టవర్స్‌ను నిర్మిస్తోంది. అపర్ణా వన్ పేరుతో 35 అంతస్థులను నిర్మిస్తోంది. మై హోమ్ కన్‌స్ట్రక్షన్స్ అవతార్ పేరుతో 30 అంతస్థులు, త్రాక్ష్య ప్రాజెక్టులో 32 అంతస్థులు, భూజ పేరుతో 35 అంతస్థులను నిర్మిస్తోంది. డిఎస్‌ఆర్ బిల్డర్స్ సంస్థ డిఎస్‌ఆర్ ఫస్ట్ పేరుతో 30 అంతస్థులతో నిర్మాణం చేస్తోంది. ల్యాంకో హిల్స్ సంస్థ ల్యాంకో 7 పేరుతో 36 అంతస్థులను, క్యాండియర్ కన్‌స్ట్రక్షన్స్ క్యాండియర్ 40 పేరుతో 40 అంతస్థుల భవనాన్ని నిర్మిస్తోంది. ఇలా ఒకదాన్ని మించి మరొకటి ఆకాశానికి నిచ్చెనలా హైరైజ్ బిల్డింగ్స్ హైదరాబాద్ దూసుకుపోతున్నాయి.