Hyderabad: హాంకాంగ్ వార్నింగ్.. హైదరాబాద్ ‘హైరైజ్’ జోన్ పరిస్థితి ఏంటి?
హాంకాంగ్… ఆకాశాన్ని తాకే భవనాలకు కేరాఫ్ అడ్రస్. కానీ నిన్నటి అగ్నిప్రమాదం ఆ అద్భుత సౌధాలను మృత్యుకూపాలుగా మార్చింది. 90 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతుంటే, మన హైదరాబాద్‌లో (Hyderabad) మాత్రం సరికొత్త ఆందోళనకు తెరలేపింది. ఒకప్పుడు రాళ్ల సీమగా ఉన్న హైదరాబాద్, ఇప్పుడు వెస్ట్ జోన్ కేంద్రంగా కాంక్రీట్ అడవిలా మారుతోంది. కోకాపేట నియోపోలిస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు 50, 60 అంతస్తుల భవనాలు లేస్తున్నాయి. మరి హాంకాంగ్ (HongKong) లాంటి అత్యున్నత సాంకేతికత ఉన్న దేశమే చేతులెత్తేస్తే… మన హైదరాబాద్ ఆకాశహర్మ్యాల్లో నివసించే వారి పరిస్థితి ఏంటి?
హాంకాంగ్‌తో పోలిస్తే హైదరాబాద్‌లో జరుగుతున్న నిర్మాణాలు చాలా భిన్నం. హాంకాంగ్‌లో స్థలాల కొరత వల్ల ఇవన్నీ చాలా దగ్గరగా, ఇరుగ్గా ఉంటాయి. కానీ హైదరాబాద్‌లో విశాలమైన గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నా, ప్రమాదం తీవ్రత మాత్రం తక్కువగా ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ అగ్నిమాపక శాఖ వద్ద ప్రస్తుతం సుమారు 90 నుంచి 100 మీటర్ల ఎత్తు వరకు వెళ్లగలిగే ‘స్కై లిఫ్ట్’ (Bronto Skylift)లు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. ఇవి దాదాపు 25-30 అంతస్తుల వరకు మాత్రమే చేరుకోగలవు. మరి కోకాపేట, పుప్పాలగూడలో 45, 50, 55 అంతస్తుల భవనాలు కడుతున్నారు. 30వ అంతస్తు పైన మంటలు చెలరేగితే పరిస్థితి ఏంటి? అన్న ప్రశ్నకు సమాధానం శూన్యం. కేవలం ఆ భవనంలోని ‘ఇన్-బిల్ట్’ (In-built) వ్యవస్థలే దిక్కు. అవి పని చేయకపోతే ప్రాణనష్టం ఊహాతీతం.
హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని చాలా అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు ‘గ్లాస్ ఫసాడ్’ (Glass Facade)తో నిర్మిస్తున్నారు. అగ్నిప్రమాదం జరిగినప్పుడు మంటల కంటే పొగ (Smoke) వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తాయి. ఈ అద్దాల భవనాల్లో వెంటిలేషన్ లేకపోవడం వల్ల, పొగ లోపలే ఉండిపోయి క్షణాల్లో ఊపిరాడకుండా చేస్తుంది. మంటలు చెలరేగినప్పుడు ఈ అద్దాలు వేడిని బయటకు పోనివ్వకుండా లోపలే బంధిస్తాయి, దీనివల్ల ఉష్ణోగ్రత వేగంగా పెరిగి సిలిండర్లు పేలిపోవడం వంటివి జరుగుతాయి.
నిబంధనల ప్రకారం ప్రతి హైరైజ్ భవనంలోనూ కొన్ని అంతస్తులకోసారి ‘రెఫ్యూజ్ ఏరియా’ ఉండాలి. ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు అక్కడికి వెళ్లి తలదాచుకోవాలి. అది ఓపెన్ ఎయిర్‌కు కనెక్ట్ అయి ఉండాలి. హైదరాబాద్‌లోని అనేక అపార్ట్మెంట్లలో ఈ రెఫ్యూజ్ ఏరియాలను స్టోర్ రూమ్లుగానో, లేదా సొసైటీ ఆఫీసులుగానో మార్చేశారు. కొన్ని చోట్ల అసలు వాటి గురించిన అవగాహనే లేదు. హాంకాంగ్ ఘటనలో చాలా మంది ఇళ్లలోనే చిక్కుకుపోయారు. మన దగ్గర కూడా అదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది.
నిబంధనల ప్రకారం, ఎత్తైన భవనాల చుట్టూ ఫైర్ ఇంజన్ సులభంగా తిరిగేంత ఖాళీ స్థలం (Set-back) ఉండాలి. కానీ, బిల్డర్లు అంగుళం స్థలం కూడా వదలడం లేదు. చాలా అపార్ట్మెంట్లలో ఈ ఖాళీ స్థలాలను పార్కింగ్ కోసమో, గార్డెనింగ్ కోసమో, లేదా ట్రాన్స్ఫార్మర్ల కోసమో వాడుతున్నారు. ఒకవేళ 50 అంతస్తుల భవనంలో మంటలు వస్తే, భారీ స్కై-లిఫ్ట్ వాహనం ఆ కాంప్లెక్స్ లోపలికి వెళ్లి, పొజిషన్ తీసుకునేంత స్థలం ఉందా? అంటే ‘లేదు’ అనే సమాధానమే ఎక్కువ వినిపిస్తుంది.
భవనం కట్టిన కొత్తలో ఫైర్ సేఫ్టీ సిస్టమ్స్ అంటే స్ప్రింక్లర్లు, అలారాలు బాగానే ఉంటాయి. కానీ ఐదేళ్లు గడిచేసరికి మెయింటెనెన్స్ లేక తుప్పు పట్టిపోతున్నాయి. హైదరాబాద్‌లోని వందలాది హైరైజ్ అపార్ట్మెంట్లలో ఏడాదికి ఒక్కసారైనా ‘ఫైర్ డ్రిల్’ (Fire Drill) నిర్వహించడం లేదు. అలారం మోగితే ఏ మెట్ల నుంచి కిందకు దిగాలి? లిఫ్ట్ ఎందుకు వాడకూడదు? అనే కనీస స్పృహ లక్షల ఖరీదు పెట్టి ఇళ్లు కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కూడా ఉండటం లేదు.
హైదరాబాద్ అభివృద్ధిని ఆకాశహర్మ్యాల ఎత్తులో కొలుస్తున్నాం. కానీ, ఆ ఎత్తుకు తగిన భద్రత మన దగ్గర లేదు. హాంకాంగ్ ఘటన కేవలం వార్త కాదు, ఒక హెచ్చరిక. ప్రభుత్వం వెంటనే ప్రతి హైరైజ్ భవనంలో ‘థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్’ (Third Party Safety Audit) నిర్వహించాలి. స్కై లిఫ్ట్‌ల సంఖ్యను పెంచాలి. అన్నింటికంటే ముఖ్యంగా, నిబంధనలు పాటించని భవనాల ఓ.సి.లను రద్దు చేసే ధైర్యం చేయాలి. లేదంటే, మన నగరం కూడా మరో విషాదానికి వేదికయ్యే ప్రమాదం ఉంది.






