హైదరాబాద్ లో పెరిగిన విల్లాల నిర్మాణాలు

హైదరాబాద్‍లో విల్లాలకు మంచి డిమాండ్ ఉంది. ఇటీవల ఓ కంపెనీ సిటీ శివారులోని మంచిరేవుల వద్ద ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసింది. ఒక్కో విల్లా ఖరీదు రూ. 15 కోట్లు. 30 విల్లాలు ప్లాన్ చేస్తే.. లాంచింగ్ రోజే పది బుక్కయ్యాయి. మరో పది రోజుల్లో మరికొన్ని బుక్కయ్యాయి. ప్రస్తుతం మిగిలినవి నాలుగైదే. అంటే విల్లాలకు హైదరాబాద్‍లో ఎంత డిమాండ్ ఉందో ఇది తెలుపుతోంది. గేటెడ్ కమ్యూనిటీ కల్చర్‍లో భాగమైన విల్లా కల్చర్‍కు ఇప్పుడు ఆదరణ కనిపిస్తోంది. ఒకే ప్రాంగణంలో పదులు, వందల సంఖ్యలో ఇళ్లు లేదా ఫ్లాట్స్ ఉండటం, నివాసితులకు అవసరమైన విధంగా జిమ్స్, క్లబ్ హౌస్‍లు వంటివాటివి అందులో ఉండటం అందరికీ తెలిసిందే.
హైదరాబాద్ శివార్లలోని లగ్జరీ విల్లాలకు మాత్రం మినహాయింపే! ఎందుకంటే.. సాధారణ రోజుల్లో కన్నా ప్రస్తుతం వీటికి డిమాండ్ పెరిగింది. లగ్జరీ విల్లా అంటే రూ.4-5 కోట్ల నుంచి రూ.10-12 కోట్ల దాకా ఉంటుంది. వైద్యులు, ఎన్నారైలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు అభిరుచికి తగ్గట్లు ఇలాంటి విల్లాలను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.
హైదరాబాద్ పడమర దిక్కున ఐటీ కారిడార్‍ను ఆనుకుని ఉన్న గోపన్‍పల్లి, నార్సింగ్, కోకాపేట, మంచిరేవుల, గండిపేట, నానక్‍రాంగూడ వంటి ప్రాంతాల్లో డూప్లెక్స్, ట్రిపులెక్స్ విల్లాలకు డిమాండ్ కనిపిస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ వంటి ప్రాంతాలకు దగ్గరగా, ఐటీ కారిడార్‍లైన మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‍రాంగూడలను అనుకొని ఉండటంతో డిమాండ్ ఉంది. ఔటర్‍రింగు రోడ్డుకు ఇరువైపులా ఉండటంతో మౌలిక వసతులు బాగున్నాయి. దీంతో సెంట్రల్ ఎయిర్ కండిషన్, స్విమ్మింగ్ పూల్, పూర్తిస్థాయి కిచెన్ సదుపాయాలు ఉన్న విల్లాల కొనుగోలుకు పలు రంగాల ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారు. విదేశాల నుంచి తిరిగి వస్తున్నవారు ఈ ప్రాంతాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు.
ప్రముఖ కన్‍స్ట్రక్షన్స్ కంపెనీలన్నీ తమ ప్రాజెక్టుల్లో విల్లాలను కూడా నిర్మిస్తున్నాయి. హైదరాబాద్లో పలు నిర్మాణ సంస్థలు లగ్జరీ విల్లాల్ని నిర్మిస్తున్నాయి. ప్రణీత్ గ్రూప్ బాచుపల్లిలో ప్రణీత్ ప్రణవ్ లీఫ్ ను ఆరంభించింది. ఆక్రుతి ఏఆర్వీ వీవా గచ్చిబౌలిలో విల్లాలను స్టార్ట్ చేసింది. ప్రవీణ్స్ నేచర్ విల్లా ప్రాజెక్టు పటాన్ చెరులో ఆరంభమైంది. బాచుపల్లిలో శ్రీనిధి హిల్ పార్కు లగ్జరీ విల్లా ప్రాజెక్టు చేస్తోంది. శామీర్ పేట్ షాంగ్రిల్లా విల్లాస్, ట్రీ టాప్స్ విల్లా ప్రాజెక్టు స్టార్ట్ అయ్యింది. ఒక్కో విల్లా విస్తీర్ణం సుమారు మూడు వేల చదరపు అడుగులు. ధర కోటీ అరవై లక్షలు. ద హడిల్ అనే లగ్జరీ గేటెడ్ విల్లా ప్రాజెక్టు మహేశ్వరంలో ప్రారంభమైంది. బీరంగూడలో పలు కంపెనీల విల్లాలు నిర్మితమవుతున్నాయి. ఎపిఆర్ ప్రవీణ్ నేచర్స్, నిహార్ విఆర్‍సి హోమ్స్, నందన్ ఫ్రైడ్ విల్లాలను నిర్మిస్తున్నాయి. పటాన్ చెరులో డేవ్ ప్రైమ్ విల్లాస్, జీటి అండ్ డేవ్ వాటర్‍ఫ్రంట్, ఎపిఆర్ ప్రవీణ్ లగ్జరీయా ఆధ్వర్యంలో విల్లాలను నిర్మిస్తున్నారు. బాలాపూర్‍లో వీఫోర్‍బేవర్లీసోప్స్ విల్లాలను నిర్మించింది. సూరారంలో మోర్టన్‍విల్లాస్ ఆధ్వర్యంలో ఓ ప్రాజెక్టు రెడీ అయింది. భౌరాంపేట్‍లో త్రిపురాల్యాండ్‍మార్క్ కంపెనీ, బాచుపల్లిలో లక్ష్మీభావన జిఎల్‍సి క్రిబ్స్ కంపెనీ, బొల్లారంలో శక్తిఎన్‍క్లేవ్, గచ్చిబౌలిలో శ్రీతనూజ ఎస్టేట్స్ వంటివి విల్లాల ప్రాజెక్టులను చేపట్టాయి. ఇంకా చాలా కంపెనీలు కూడా విల్లాల నిర్మాణాలను చేపట్టాయి.
ఆకట్టుకునేలా విల్లాల నిర్మాణాలు
ఒకప్పుడు ఎకరా, అర ఎకరా స్థలంలో ప్లాట్లు వేసి విక్రయించేవారు. ఈ విల్లా కల్చర్ పుణ్యమాని ఇప్పుడు అదే విస్తీర్ణంలో లంకంత ఇల్లు కడుతున్నారు. నిజానికి వాటిని ఇళ్లు అనడం కన్నా చిన్న పాటి ఊర్లు అనొచ్చేమో… వేలాది చదరపు అడుగుల విస్తీర్ణంలో సువిశాలమైన మాన్షన్‍లు, వాటికి నలువైపులా రోడ్లు, స్విమ్మింగ్‍పూల్, సెంట్ర లైజ్డ్ బయోగ్యాస్ సరఫరా, 2 కి.మీ. వాకింగ్ ట్రాక్, స్పా, బ్యూటీ సెలూన్, జిమ్నాసియమ్, టెన్నిస్, స్క్వాష్, బ్యాడ్మింటన్, స్నూకర్, బాస్కెట్ బాల్, పార్టీ లాన్, టీ కార్నర్, బాంక్వెట్స్, హోమ్ థియే టర్, గెస్ట్ రూమ్స్, లాంజ్, ఎలివేటర్ సౌకర్యం, కనీసం 4 నుంచి 5 కార్లు పట్టేలా పార్కింగ్‍ప్లేస్ ఇలాంటి ఒక చిన్న అల్ట్రామోడ్రన్ సిటీకి అవసర సౌకర్యాలన్నీ ఒక విల్లాలోనే ఏర్పాటు చేస్తుండడంతో ఇవి ధనికులను ఆకర్షిస్తున్నాయి.