టీఎస్-బీపాస్‌ను స్వాగతించిన క్రెడాయ్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్- బీపాస్ బిల్లు భవన నిర్మాణాలకు మరింత ఊతం ఇచ్చేదిగా ఉందని, దానిని తాము స్వాగతిస్తున్నట్లు కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) హైదరాబాద్ అభిప్రాయపడింది. క్రెడాయ్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు రామకృష్ణారావు, ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‍రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం టీఎస్-ఐపాస్ మాదిరిగా టీఎస్-బీపాస్ బిల్లు తీసుకురావడం శుభపరిణామమని అభిప్రాయపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. టీఎస్- బీపాస్ బిల్లు తీసుకురావడం వల్ల నిర్దేశించిన సమయంలో భవన నిర్మాణ అనుమతులు మంజూరు అవుతాయని, గతంలో మాదిరిగా బిల్డర్లు.. వివిధ ప్రభుత్వ శాఖల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేయాల్సిన అవసరం లేదన్నారు. అక్టోబర్ నాటికి పూర్తిస్థాయిలో నిర్మాణ రంగం ఊపందుకుంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న క్రెడాయ్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు వేణు వినోద్, రాజేశ్వర్ మాట్లాడుతూ, పారదర్శక సమయ విధానంలో అనుమతుల పక్రియను వేగవంతం చేయడం విప్లవాత్మక చర్యగా ప్రశంసించారు. రాష్ట్రంలో స్థిరాస్థి రంగం వేగంగా వృద్ధి చెందేందుకు ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు.