Andole: వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం… ప్రత్యేక ఆకర్షణగా అందోల్ రంగనాథస్వామి ఆలయం
Andole: తెలుగు రాష్ట్రాల్లోని ప్రాచీన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సంగారెడ్డి జిల్లా అందోల్లోని శ్రీ భూనీళా సమేత శ్రీ రంగనాథస్వామి ఆలయం వైకుంఠ ఏకాదశి వేడుకలకు ముస్తాబైంది. వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో నాగేంద్రుడిపై శయన భంగిమలో కొలువుదీరిన స్వామివారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలిరానున్నారు.
వేడుకల విశేషాలు
మంగళవారం (డిసెంబర్ 30, 2025) తెల్లవారుజాము నుండే ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.
ఉత్తర ద్వార దర్శనం: ఉదయం 6:30 గంటల నుండి భక్తులకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు.
ప్రత్యేక పూజలు: ఆలయ ప్రధాన అర్చకులు చిదిరె శ్యామ్ నాథ్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహిస్తారు.
శిల్పకళా వైభవం: ఎత్తైన గోపురాలు, చక్కని శిల్పకళతో అలరారుతున్న ఈ క్షేత్రం “ఓం నమో నారాయణాయ” అనే నామస్మరణతో మారుమోగనుంది.

భక్తులకు సూచనలు
వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ఆలయ కమిటీ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవడం వల్ల మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. కావున భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి రంగనాథస్వామి కృపకు పాత్రులు కావాలని ఆలయ వర్గాలు కోరుతున్నాయి.






