Katepalli: బూతులపై కేసీఆర్, రేవంత్‌కు ‘కాటేపల్లి’ క్లాస్!
రాజకీయాల్లో విమర్శ ఉండాలి, కానీ విద్వేషం ఉండకూడదు. వాదన ఉండాలి, కానీ వేదన కలిగించే భాష ఉండకూడదు. దురదృష్టవశాత్తూ, గత కొన్నేళ్లుగా తెలంగాణ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. “ఎవరు ఎంత గట్టిగా తిడితే, అంత గొప్ప నాయకుడు” అనే కొత్త, ప్రమాదకరమైన నిర్వచనం తెరపైకి వచ్చింది. సరిగ్గా ఇటువంటి సమయంలో, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆత్మవిమర్శకు తెరలేపాయి.
ఈ కథనంలో అత్యంత ఆసక్తికరమైన కోణం వెంకటరమణారెడ్డి నేపథ్యం. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకవైపు అప్పటి సీఎం కేసీఆర్, మరోవైపు అప్పటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఇద్దరు హేమాహేమీలు బరిలో నిలిచారు. ఆ ఇద్దరినీ మట్టికరిపించి, ‘జెయింట్ కిల్లర్’గా అసెంబ్లీలో అడుగుపెట్టారు వెంకటరమణారెడ్డి. ఆశ్చర్యకరంగా, ఇప్పుడు ఆ ఇద్దరు నేతలు పాటిస్తున్న లేదా ప్రోత్సహిస్తున్న దూషణల పర్వంపైనే ఆయన మొట్టమొదటి సారిగా గళం విప్పారు. సామాన్య ఎమ్మెల్యేగా కాకుండా, ప్రజల నాడిని పర్ఫెక్ట్గా పట్టుకున్న నాయకుడిగా ఆయన అసెంబ్లీ సాక్షిగా పీకిన క్లాస్ ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.
అసెంబ్లీలో వెంకటరమణారెడ్డి వాడిన పదాలు చాలా పదునుగా ఉన్నాయి. “హైదరాబాద్ నగరాన్ని మనం వన్ క్లాస్ సిటీ అని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ మనం మాట్లాడే మాటలు మాత్రం థర్డ్ క్లాస్‌కు పడిపోతున్నాయి” అని ఆయన చేసిన వ్యాఖ్య సిగ్గుపడేలా చేసింది. అభివృద్ధిలో పోటీ పడాల్సిన నాయకులు, బూతుల్లో పోటీ పడుతుండటం వల్ల సమాజంలో రాజకీయ నాయకులపై గౌరవం తగ్గిపోతోందన్న ఆయన ఆవేదనలో వంద శాతం నిజముంది. ముఖ్యంగా, “ఒకరు మనల్ని తిట్టినప్పుడు, మనం అంతకంటే రెండు మాటలు ఎక్కువ తిడితే జనం మెచ్చుకుంటారని అనుకోవడం మూర్ఖత్వం” అని ఆయన తేల్చి చెప్పారు. ఇది కేవలం అధికార పక్షానికో, ప్రతిపక్షానికో పరిమితం కాదు.. అందరికీ వర్తించే సార్వజనీన సత్యం.
రాజకీయ నాయకులు తమను తాము గౌరవించుకోనప్పుడు, ఇతరులు తమను ఎందుకు గౌరవిస్తారు? అనే ప్రాథమిక ప్రశ్నను ఆయన లేవనెత్తారు. ప్రధానమంత్రి మోదీ, సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ వంటి వారిని మీడియా ప్రతినిధులు ఏకవచనంతో సంబోధించడాన్ని ఆయన తప్పుబట్టారు. అయితే, దానికి కారణం మీడియా కాదని, రాజకీయ నాయకులు ఒకరినొకరు పిలుచుకుంటున్న విధానమేనని ఆయన విశ్లేషించడం గమనార్హం. “మనమే బూతులు తిట్టుకుంటూ, మీడియా వాళ్లు మనల్ని క్లాస్మేట్స్ లాగా ట్రీట్ చేస్తున్నారు” అనడం ద్వారా.. వ్యవస్థలో లోపం ఎక్కడుందో ఆయన వేలు పెట్టి చూపించారు.
ఈసారి తెలంగాణ అసెంబ్లీకి దాదాపు 57 మంది కొత్త ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వీరంతా సీనియర్లను చూసి నేర్చుకోవాలి. కానీ, సభలో సీనియర్లు ప్రదర్శిస్తున్న ప్రవర్తన, వాడుతున్న భాష కొత్తవారిని తప్పుదోవ పట్టించేలా ఉందని వెంకటరమణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సభలో హుందాతనం, సంప్రదాయాలు, పరస్పర గౌరవం ఉండాలని.. ఒకరు మూర్ఖంగా మాట్లాడితే, మరొకరు సద్విమర్శతో సరిచేయాలే తప్ప, అంతకంటే దిగజారిపోకూడదని ఆయన హితవు పలికారు.
సభలో వెంకటరమణారెడ్డి లేవనెత్తిన ఆవేదనతో మంత్రి శ్రీధర్ బాబు ఏకీభవించడం స్వాగతించదగ్గ పరిణామం. అయితే, ఇది కేవలం మాటలకే పరిమితం కాకూడదు. తిట్టడమే రాజకీయం అనే భావన నుంచి ప్రశ్నించడమే రాజకీయం అనే స్థాయికి మన ప్రజాస్వామ్యం ఎదగాలి. కామారెడ్డి ప్రజలు ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడించి వెంకటరమణారెడ్డిని గెలిపించింది బహుశా.. ఇలాంటి నిష్ఠూర సత్యాలు చెప్పడానికేనేమో! ఆయన మాటలు ఎంతమంది చెవికెక్కుతాయో కాలమే నిర్ణయించాలి. కానీ, రాజకీయాల్లో పడిపోతున్న విలువలను కాపాడటానికి ఒక ప్రయత్నం మాత్రం జరిగింది.






