Bangladesh: భారతీయులే టార్గెట్.. వర్క్ పర్మిట్లు రద్దు చేయాలన్న బంగ్లాదేశ్ ఇంకిలాబ్ మోంచా..!
విద్యార్థి నాయకుడు, ఇంకిలాబ్ మోంచా నేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. హాదీ హత్య వెనక ప్రభుత్వంలోని ఓ వర్గం ఉందన్న ఆరోపణలు.. యూనస్ సర్కార్ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు.. హాదీ హత్య నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వంపై మండిపడుతోన్న ఇంకిలాబ్ మోంచా (Inqilab Mancha).. తాజాగా భారతీయులపై విషం కక్కింది. బంగ్లాలో ఉన్న భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వడం గమనార్హం.
హాదీ (Sharif Osman Bin Hadi) హత్యకు న్యాయం చేయాలని కోరుతూ ఇంకిలాబ్ మోంచా పలు డిమాండ్లు చేసింది. తమ నాయకుడి మరణానికి కారణమైన నిందితులు, వారికి సహకరించిన వారిని 24 గంటల్లో అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్‌లో నివాసం ఉంటున్న భారతీయుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని కోరింది. షేక్ హసీనాను అప్పగించేందుకు భారత్ నిరాకరిస్తే.. ఆ దేశంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో కేసు వేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు తమ ఫేస్బుక్ ఖాతాలో దీనిపై పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా సోమవారం భారీఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చింది.
భారత వ్యతిరేకి అయిన 32 ఏళ్ల ఉస్మాన్ హాదీపై డిసెంబరు 12న ఢాకాలో కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని సింగపూర్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ 18న మరణించాడు. హాదీ మృతి వార్త తెలియగానే బంగ్లాదేశ్‌లో పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయి. మీడియా సంస్థలు, అవామీ లీగ్ కార్యాలయాలపై నిరసనకారులు దాడులు చేశారు. ఈ క్రమంలోనే హాదీని చంపిన ఇద్దరు వ్యక్తులు భారత్‌లోకి ప్రవేశించినట్లు బంగ్లా మీడియాలో కథనాలు వచ్చాయి. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది.






