Washington: చర్చలు సానుకూలం.. బ్రేక్ త్రూ లేదన్న ట్రంప్, జెలెన్ స్కీ…!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉక్రెయిన్ అధినేత జెలెన్ స్కీ.. ఆదివారం ఫ్లోరిడాలో జరిపిన సమావేశం ఎలాంటి కీలక పరిణామం లేకుండానే ముగిసింది. దాదాపు మూడు గంటలపాటు జరిగిన సమావేశం తర్వాత తాము శాంతి ప్రక్రియకు మరింత దగ్గరయ్యామని ఇద్దరు నేతలు ప్రకటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి చర్చలను ముందుకు తీసుకెళ్లాలని ఇద్దరు నాయకులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
చర్చలు అద్భుతంగా సాగాయని.. గొప్పగా జరిగాయని ట్రంప్, జెలెన్ స్కీ చెప్పారు. అయితే ఎలాంటి పురోగతి లేకుండానే సమావేశం ముగిసింది.20-అంశాల శాంతి ప్రణాళికలో 90 శాతం వరకూ అంగీకారమయ్యాయని జెలెన్స్కీ చెప్పారు. చర్చలు 95 శాతానికి దగ్గరగా జరిగాయన్నారు ట్రంప్.
ఉక్రెయిన్ భద్రతపై అమెరికా నుంచి వందశాతం హామీ లబించిందన్నారు జెలెన్ స్కీ. అవి శాశ్వత శాంతికి కీలకమని తెలిపారు. అయితే.. ఆ చర్చలు దాదాపుగా పూర్తయ్యాయన్నారు ట్రంప్.
రష్యా డిమాండ్ చేస్తున్నట్లుగా డాన్ బాస్, ఇతర భూభాగాలకు సంబంధించి ఇద్దరు నేతలమధ్య ఎలాంటి ఏకాభిప్రాయం రాలేదు.వాటిని ట్రంప్ చిక్కుముడులుగా అభివర్ణించారు. డాన్‌బాస్‌లో స్వేచ్ఛా ఆర్థిక లేదా వాణిజ్య జోన్ కోసం ప్రతిపాదనలు ఇంకా చర్చలో ఉన్నాయని .. ఇప్పటికీ ఖరారు కాలేదని అమెరికా అధ్యక్షుడు అన్నారు.ఉక్రెయిన్ రాజ్యాంగానికి అనుగుణంగా, బహుశా ప్రజాభిప్రాయ సేకరణ లేదా పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా, ఉక్రెయిన్ ప్రజలు భూభాగంపై ఏదైనా నిర్ణయం ఆమోదించాలని జెలెన్స్కీ అన్నారు.
రష్యా ఆక్రమిత జపోరిజ్జియా అణు విద్యుత్ కేంద్రం భవిష్యత్తు ఇప్పటికీ ఒక క్లిష్టమైన అంశంగానే ఉంది, ఈ విద్యుత్ కేంద్రం గురించి ఎలాంటి స్పష్టమైన ఒప్పందం కుదరలేదు.ఏ ఒప్పందానికైనా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆమోదం అవసరమని ట్రంప్ అన్నారు. జెలెన్స్కీని కలవడానికి ముందు తాను పుతిన్‌తో మాట్లాడానని మరియు మరిన్ని చర్చలను ఆశిస్తున్నానని ఆయన ధృవీకరించారు.
ఉక్రెయిన్‌లో ప్రజాభిప్రాయ సేకరణకు అనుమతించే కాల్పుల విరమణకు పుతిన్ అంగీకరించలేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇది తమకు చాలా ముఖ్యమైనదని జెలెన్ స్కీ చెబుతున్నారు. మిగిలిన అంశాలను ఖరారు చేయడానికి వచ్చే వారం ప్రారంభంలోనే అమెరికా మరియు ఉక్రెయిన్ బృందాలు మళ్లీ సమావేశం కావచ్చని జెలెన్స్కీ అన్నారు. చర్చల పురోగతిని యూరోపియన్ నేతలతో ట్రంప్, జెలెన్ స్కీ పంచుకున్నారు. చర్చలను స్వాగతించిన యూరోపియన్ నేతలు.. ఉక్రెయిన్ భద్రతకు బలమైన హామీలు అవసరమని ట్రంప్ కు సూచించారు.






