Kolkata: హాదీ హంతకులు భారత్ లోకి రాలేదు.. బంగ్లా విషప్రచారంపై బీఎస్ఎఫ్ క్లారిటీ..!
బంగ్లాదేశ్ విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యకు సంబంధించి ఆ దేశ మీడియాలో వస్తున్న కథనాలపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. షరీఫ్‌ను హత్య చేసిన ఇద్దరు వ్యక్తులు భారత్‌లోని మేఘాలయలోకి చొరబడ్డారన్న వార్తల్లో నిజం లేదని బీఎస్ఎఫ్, మేఘాలయ పోలీసులు స్పష్టం చేశారు. ఇదంతా తప్పుడు ప్రచారమని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ (మేఘాలయ) ఓపీ ఉపాధ్యాయ తెలిపారు. ‘‘మేఘాలయలోని హలువాఘాట్ దగ్గర అంతర్జాతీయ సరిహద్దును దాటి భారత్‌లోకి ఏ వ్యక్తీ ప్రవేశించినట్లు ఆధారాలు లేవు. అలాంటి ఘటనను బీఎస్ఎఫ్ గుర్తించలేదు. అందుకు సంబంధించి ఎలాంటి నివేదికా మాకు అందలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు వస్తున్న కథనాలు అబద్ధమని స్పష్టంచేశారు. మేఘాలయ పోలీసు అధికారి కూడా ఈ వార్తలను ఖండించారు. ఎవరూ రాష్ట్రంలోకి రాలేదని, తాము ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.
భారత్‌కే పారిపోయారు
అంతకుముందు హాదీ హత్యకేసులో ఇద్దరు ప్రధాన నిందితులు భారత్‌కు పారిపోయారంటూ బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.‘‘అనుమానితులు ఫైసల్ కరీం మసూద్, ఆలంగీర్ షేక్‌లు స్థానికుల మద్దతుతో సరిహద్దులు దాటి భారత్‌లోని మేఘాలయకు పారిపోయారు. వారిని పుర్తి అనే వ్యక్తి కలిశారు. సమీ అనే ట్యాక్సీ డ్రైవర్.. మేఘాలయలోని తురా సిటీకి తీసుకెళ్లాడు. నిందితులకు సాయం చేసిన వారు భారత పోలీసుల అదుపులో ఉన్నారు’’ అని ఢాకా అదనపు పోలీస్ కమిషనర్ నజ్రుల్ ఇస్లామ్ పేర్కొన్నట్లు ‘ది డైలీ స్టార్’ పత్రిక పేర్కొంది.
ఇంకిలాబ్ మోంచాకు చెందిన 32 ఏళ్ల హాదీపై ఈ నెల 12న ఢాకాలో కాల్పులు జరిగాయి. మెరుగైన వైద్యం కోసం ఆయన్ను సింగపూర్‌కు తరలించారు. అక్కడ ఈ నెల 18న మరణించారు. అనంతరం దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగాయి. ఆ సందర్భంగా పత్రికా కార్యాలయాలపైనా దాడులు జరిగాయి. దీన్ని బంగ్లాదేశ్ ఎడిటర్స్ కౌన్సిల్ ఖండించింది. తాత్కాలిక ప్రభుత్వంలోని కొన్ని శక్తులే ఈ హింసకు కారణమని ఆరోపించింది.






