మరోసారి ఎమ్సెట్ దరఖాస్తు గడువును పెంచిన ప్రభుత్వం

తెలంగాణలో ఎమ్సెట్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. జూన్ 24 వరకూ గడువును పెంచుతున్నామని ఎమ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ ప్రకటించారు. కరోనా నేపథ్యంలోనే కొన్ని రోజుల కిందటే గడవును పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోసారి కూడా గడువును పెంచడంతో మరింత మంది విద్యార్థులు దరఖాస్తు చేసే అవకాశం ఉంటుందన్నది అధికారుల అభిప్రాయంగా తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఇంజినీరింగ్ కోసం 2 లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, బీఎస్సీ కోసం 75 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మరోవైపు ఆగస్టు మాసంలో ఎమ్సెట్ నిర్వహించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తెలంగాణలో కరోనా తీవ్రత కాస్త తగ్గిందని, అందుకే ఎమ్సెట్ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వ అధికారులు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి జూలై మాసంలో ఎమ్సెట్ జరగాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా వేశారు.