YCP: అమరావతిపై వైసీపీ స్టాండ్ మారిందా..?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) వైఖరిపై ఎన్నో విమర్శలు వచ్చాయి. మొదట్లో అమరావతికి జైకొట్టిన ఆ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల (3 capitals) నినాదాన్ని తెరపైకి తెచ్చింది. ఇప్పుడు మళ్లీ అమరావతే రాజధానిగా ఉంటుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. దీంతో వైసీపీ స్టాండ్ మార్చుకుందని అర్థమవుతోంది. అయితే వైసీపీ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఇలా చెప్తున్న పార్టీ, రేపు అధికారంలోకి వస్తే మళ్లీ మాట మార్చదన్న గ్యారెంటీ లేదని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ ఓడిపోవడానికి అమరావతిని కాదనడం కూడా ప్రధాన కారణం అని, ఇప్పటికై ఆ పార్టీ రీయలైజ్ అయినందుకు సంతోషమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అవసరం ఏర్పడింది. దీంతో అత్యాధునిక రాజధాని నిర్మించాలనే ఉద్దేశంతో అమరావతి ప్రాంతాన్ని ఎంపిక చేసింది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం. దీనికి అప్పటి ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ కూడా మద్దతు తెలిపారు. అయితే 2019లో టీడీపీ ఓడిపోయి, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ మాట మార్చారు. అమరావతి నిర్మాణానికి పెద్దఎత్తున ఖర్చవుతుందని, అప్పుల్లో ఉన్న రాష్ట్రం అంత పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదన్నారు. అందుకే మూడు రాజధానులను మూడు ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు ప్రకటించారు. దీంతో అమరావతి రైతులు భగ్గుమన్నారు. అమరావతిని కాదని మూడు రాజధానులను తెరపైకి తీసుకురావడాన్ని జీర్ణించుకోలేకపోయారు. న్యాయస్థానాలను ఆశ్రయించి అమరావతిని కాపాడుకున్నారు.
అయితే 2024లో తామే అధికారంలోకి వస్తామని, విశాఖ నుంచి పాలిస్తామని ఎన్నికల ముందు వైసీపీ నేతలు ప్రకటించారు. జగన్ కూడా త్వరలో తాను విశాఖ షిఫ్ట్ అవుతున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం రిషికొండ ప్యాలెస్ ను ఘనంగా నిర్మించారు. ఇంతలో 2024 ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. దీంతో మూడు రాజధానుల అంశం ముగిసింది. అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అని ప్రకటించింది. ఐదేళ్లపాటు ఆగిపోయిన రాజధాని పనులను మళ్లీ పునఃప్రారంభించింది చంద్రబాబు ప్రభుత్వం. దీంతో అమరావతిపై మళ్లీ ఆశలు చిగురించాయి. ఇక ఎవరు అధికారంలోకి వచ్చినా అమరావతి ఆగదనే నమ్మకం కలిగింది. అయితే ఎక్కడో ఏదో మూల మళ్లీ వైసీపీ వస్తే అమరావతిని తొక్కేస్తుందేమోననే భయం కొందరిలో ఉండేది. దానికి తాజాగా వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెక్ పెట్టారు.
విజయవాడలో శుక్రవారం ఓ డిజిటల్ మీడియా సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి నుంచి పరిపాలిస్తుందన్నారు. జగన్ కూడా విశాఖ వెళ్లరని స్పష్టం చేశారు. అయితే అమరావతిలో కాకుండా గుంటూరు, విజయవాడ మధ్య అమరావతి కట్టి ఉంటే ఖర్చు తగ్గేదన్నారు. అంతేకాక, నగరాన్ని నిర్మించాల్సిన అవసరం లేదని, ఇప్పుడున్న అసెంబ్లీ, సెక్రటేరియేట్ సరిపోతాయని సజ్జల అన్నారు. దీంతో అమరావతిపై వైసీపీ స్టాండ్ మార్చుకుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే సజ్జల ప్రకటనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. విశాఖ, కర్నూలు ప్రాంతవాసులను వైసీపీ మోసం చేసిందని కొందరు విమర్శిస్తున్నారు. మూడు రాజధానులను తెరపైకి తెచ్చి ఆ ప్రాంత వాసులను మభ్యపెట్టిందని, ఇప్పుడు ఆ పార్టీ అసలు స్వరూపం బయటపడిందని చెప్తున్నారు. మరికొందరు మాత్రం వైసీపీ ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించినందుకు సంతోషించాలని చెప్తున్నారు. ఏదేమైనా అమరావతి విషయంలో గందరగోళానికి వైసీపీ చెక్ పెట్టింది. మరి ఇదే మాటపైన వైసీపీ మున్ముందు నిలబడుతుందా, లేకుంటే మళ్లీ మాట తప్పుతుందా అనేది వేచి చూడాలి.