Sree Charani: శ్రీ చరణిపై ఏపీ సర్కార్ వరాల వర్షం
ప్రపంచ కప్ (World Cup) సాధించి విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుపై దేశవ్యాప్తంగా వరాల జల్లు కురుస్తోంది. ప్రధాని మోదీ (PM Modi) మొదలు రాష్ట్రాల వరకూ ఆ జట్టు సభ్యలను ప్రశంసిస్తున్నారు. వాళ్ల ఆటతీరును కొనియాడుతున్నారు. క్రీడాకారులకు నగదు బహుమతులు, ఉద్యోగాలు ప్రకటిస్తున్నారు. తాజాగా ఏపీ క్రీడాకారిణి శ్రీ చరణిపై కూడా చంద్రబాబు ప్రభుత్వం వరాల వర్షం కురిపించింది. మిగిలిన రాష్ట్రాలు, క్రీడాకారుల కంటే మిన్నగా శ్రీ చరణికి నజరానాలు (Incentives) ప్రకటించింది.
మహిళల జట్టు ప్రపంచ కప్ గెలిచి నాలుగు రోజులైంది. నాలుగు రోజులైనా కూడా ఏపీ క్రీడాకారిణి శ్రీ చరణికి నజరానా ప్రకటించలేదంటూ కొంతమంది నాయకులు, నెటిజన్లు ఏపీ సర్కార్ పై విమర్శలు కురిపిస్తున్నారు. శ్రీ చరణి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి కాబట్టే చంద్రబాబు (CM Chandrababu) ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారైతే ఇలా మిన్నకుండి పోయేవారా అని కూడా కొందరు ప్రశ్నించారు. అయితే ఈ విమర్శలను చంద్రబాబు ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు.
ఇవాళ ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న శ్రీ చరణికి ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. గన్నవరం విమానాశ్రయంలో మంత్రులు అనిత, సవిత ఆమెకు స్వాగతం పలికారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని అన్ని ఏర్పాట్లు చూసుకున్నారు. భారీ ర్యాలీగా విజయవాడ చేరుకున్న శ్రీ చరణి ఉండవల్లిలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్వయంగా శ్రీ చరణికి, మిథాలీ రాజ్ (Mithali Raj) కు స్వాగతం పలికారు. అనంతరం వాళ్లతో చంద్రబాబు, లోకేశ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీ చరణికి గ్రూప్ 1 ఉద్యోగం, రూ.2.5 కోట్ల నగదు, కడపలో ఇంటి స్థలం ఇస్తామని సీఎం చంద్రబాబు ఆమెకు వెల్లడించారు.
సీఎంతో సమావేశం అనంతరం శ్రీ చరణి మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంకు వెళ్లారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. కప్ విజయం వెనుక సమష్టి కృషి ఉందన్నారు. ప్రధాని మోడీతో సమావేశం చాలా సంతృప్తి కలిగించిందన్నారు. తనను మంత్రి నారా లోకేశ్ ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు. టోర్నీ ముందు కూడా తాను లోకేశ్ ను కలిశానని, ఎంతో సపోర్ట్ చేశారని శ్రీ చరణి వివరించారు. మున్ముందు ఇంకా ఎంతో ఆడాల్సి ఉందని, మీ అేందరూ ఇలాగో ప్రోత్సహించాలని ఆమె ఆకాంక్షించారు.
మొత్తానికి శ్రీ చరణికి ఏపీ సర్కార్ ఏమీ ఇవ్వట్లేదంటూ ఇన్నాళ్లూ వచ్చిన విమర్శలకు ఇవాళ బ్రేక్ పడింది. మరే రాష్ట్రమూ, మరే ఇతర ప్లేయర్ కూ ఇవ్వని విధంగా భారీ ప్రోత్సాహకాలు అందించింది చంద్రబాబు ప్రభుత్వం. శ్రీ చరణి కూడా ఏపీ సర్కార్, ఏసీఏ సపోర్ట్ పై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.






