Chandrababu: పేర్లు మారిస్తే విజనరీ అయిపోతారా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (AP Politics) ఎప్పుడూ ఇంట్రస్టింగ్ గానే ఉంటాయి. అధికారంలో ఉన్న పార్టీ ఏం చేసినా ప్రతిపక్షానికి నచ్చదు. అలాగే గత ప్రభుత్వం చేసినవి ఇప్పటి ప్రభుత్వానికి ఆమోదయోగ్యంగా ఉండవు. అందుకే తమదైన శైలిలో మార్పులు, చేర్పులు చేస్తూ తమ ముద్ర వేసేందుకు ప్రభుత్వాలు తాపత్రయపడుతుంటాయి. ఇప్పుడు ఏపీలో అలాంటి పనులే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. వైసీపీ హయాంలో ఏర్పడిన గ్రామ, వార్డు సచివాలయాల (Village Secretariate) పేర్లను మార్చాలని చంద్రబాబు (CM Chandrababu) ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే పేర్ల మార్పుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా పాలన గ్రామస్థాయికి వెళ్లింది. గ్రామ సచివాలయాల్లో అన్ని విభాగాల ఉద్యోగులు అందుబాటులో ఉంటున్నారు. గతంలో గ్రామస్థులకు ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే మండల కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. గ్రామ, వార్డు సచివాలయాలు వచ్చిన తర్వాత ఆ బాధ తప్పింది. ఇవి గ్రామ స్వరాజ్యానికి ప్రతీకలుగా నిలిచాయి. వీటి ఏర్పాటు ద్వారా దాదాపు లక్ష 80 వేల మందికి కొత్తగా ఉద్యోగాలు లభించాయి. గ్రామ, వార్డు సచివాలయాలు పరిపాలనను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో గేమ్ ఛేంజర్స్ గా మారాయి.
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారని గుర్తించింది. వాళ్లలో కీలకమైన విభాగాలకు చెందిన వారిని సచివాలయాల్లోనే ఉంచి, మిగిలిన వారిని సర్దుబాటు చేసింది. సచివాలయాలు మాత్రం అలాగే కొనసాగుతాయని స్పష్టం చేసింది. తద్వారా గ్రామ, వార్డు సచివాలయాలను కొనసాగిస్తామని చంద్రబాబు ప్రభుత్వం తెలియజేసింది. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. వీటి వల్ల ప్రజలకు వ్యయ ప్రయాసలు తగ్గుతున్నాయి.
అయితే ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల పేర్లను మార్చబోతున్నట్టు సమాచారం. గురువారం జరిగిన ఓ సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయాలను విజన్ సెంటర్స్ (Vision Centers) గా తీర్చిదిద్దాలని చంద్రబాబు, అధికారులకు సూచించారు. అయితే పేరు మార్చే ఉద్దేశం లేదని ఆ తర్వాత ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా మంత్రి పేరు మార్పుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో మార్చడం ఖాయమైందని అర్థమైంది. అయితే పేరు మార్పు వల్ల ప్రభుత్వం ఏం ఆశిస్తోందనేది అర్థం కావట్లేదు.
గ్రామ, వార్డు సచివాలయాలను విజన్ సెంటర్స్ గా తీర్చిదిద్దాలని చంద్రబాబు చెప్పారు. అంటే అక్కడ ఏం చేస్తారనేదానిపై క్లారిటీ లేదు. వాటిని తన విజన్ కు అనుగుణంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులో ఉంచగలిగితే సమస్య లేదు. అలా కాకుండా కేవలం పేరు మార్చి ఉన్న సౌకర్యాలను కూడా లేకుండా చేస్తేనే సమస్య. అందుకే పేరు మార్పుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేరు మార్చినంత మాత్రాన చంద్రబాబు విజనరీ (Visionary) అయిపోరంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తే బాగుంటుంది.






