BRS: బీఆర్ఎస్‌కు కత్తిమీద సాములా మారిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక

జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక (Jubilee Hills byelection) జరగడం ఖాయమైంది. ఈ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీఆర్ఎస్ (BRS) పట్టుదలగా ఉంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మరణంతో ఈ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఉపఎన్నికలో పార్టీ తరపున గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను (Maganti Sunitha) అభ్యర్థిగా బరిలోకి దించాలని పార్టీ దాదాపు నిర్ణయించింది. నియోజకవర్గంలోని పార్టీ కేడర్ కూడా ఆమె అభ్యర్థిత్వానికి ఆమోదం తెలిపింది. అయితే, అధికార కాంగ్రెస్ (Congress) పార్టీ ఎత్తుగడలు, బీఆర్ఎస్‌పై కేసులు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. పార్టీ పరిస్థితి దిగజారిన ప్రస్తుత పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజారుద్దీన్ పై గెలుపొందారు. ఈ ఏడాది జూన్ 8న మాగంటి గోపీనాథ్ ఆకస్మికంగా చనిపోయారు. దీంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఎన్నికల కమిషన్ ఈ ఉపఎన్నికపై ఇంకా షెడ్యూల్ ప్రకటించలేదు. అక్టోబర్ లేదా నవంబర్ మాసాల్లో ఉపఎన్నిక జరుగుతుందని భావిస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. మాగంటి సునీత కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం కావాలని కేటీఆర్ సూచించారు. సునీతను భారీ మెజార్టీతో గెలిపించడమే గోపీనాథ్‌కు సరైన నివాళి అని పిలుపునిచ్చారు. గోపీనాథ్ ఆశయాలను నెరవేర్చడానికి అందరూ కలిసి పనిచేద్దామని సునీత అన్నారు. పార్టీ కార్యకర్తలు తనకు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు బీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (కేఎల్‌ఐపీ) నివేదికలో కేసీఆర్‌ను నిందితుడిగా చేర్చింది. తాజాగా ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్ క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని ఏసీబీ నివేదించింది. ఈ రెండూ బీఆర్ఎస్‌కు ఇబ్బందికరంగా మారాయి. ఇవి పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీశాయి. అయితే హైడ్రాను బీఆర్ఎస్ అస్త్రంగా మలుచుకునేందుకు సిద్ధమవుతోంది. హైడ్రా ద్వారా రేవంత్ ప్రభుత్వం బిల్డర్లను బెదిరిస్తోందని, వాళ్ల నుంచి డబ్బులు వసూలు చేస్తోందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. పేదల ఇళ్లను కూలగొడుతోందని, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే పేదల ఇళ్లు ఉండవని చెప్తున్నారు.
అయితే ఎలాగైనా జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలవాల్సిన పరిస్థితి బీఆర్ఎస్ కు ఏర్పడింది. పార్టీమారిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయని, కేడర్ సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ ఎప్పటి నుంచో చెప్తూ వస్తోంది. సుప్రంకోర్టు తీర్పుతో బీఆర్ఎస్ లో ఆ నమ్మకం కూడా కలిగింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలిస్తేనే కేడర్ లో నమ్మకం వస్తుంది. అప్పుడు పార్టీమారిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలు వచ్చినా తమదే గెలుపు అని చెప్పుకునేందుకు వీలవుతుంది. అందుకే ముందు జూబ్లీహిల్స్ బైపోల్ లో గెలవాల్సిన ఆవశ్యకత బీఆర్ఎస్ కు ఏర్పడింది.