Nara Lokesh: దావోస్‌లో నారా లోకేష్ హవా.. వైరల్ అవుతున్న న్యూ లుక్..
ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum) వార్షిక సదస్సు కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu)తో కలిసి స్విట్జర్లాండ్‌లోని దావోస్ (Davos)కు వెళ్లిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అక్కడ ప్రత్యేక ఆకర్షణగా మారుతున్నారు. పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన వరుసగా అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో భేటీలు నిర్వహిస్తూ, రాష్ట్రానికి అనుకూల వాతావరణాన్ని వివరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గత పర్యటనలతో పోలిస్తే ఈసారి లోకేష్ వ్యవహార శైలి, ప్రజెంటేషన్ స్పష్టంగా భిన్నంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దావోస్‌లో జరిగిన సమావేశాల్లో లోకేష్ కనిపిస్తున్న తీరే కాకుండా, ఆయన మేకోవర్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా ఫార్మల్ షర్ట్, ప్యాంట్లో కనిపించే ఆయన, ఈసారి కొన్ని సమావేశాలు, దావోస్ వీధుల్లో స్టైలిష్ టీ-షర్ట్‌తో దర్శనమిచ్చారు. బరువు తగ్గి మరింత ఫిట్‌గా, యాక్టివ్‌గా కనిపిస్తున్న ఆయన కొత్త లుక్ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. పార్టీ శ్రేణులు మాత్రమే కాదు, సాధారణ ప్రజలు కూడా ఈ మార్పుపై ఆసక్తిగా స్పందిస్తున్నారు.
టీ-షర్ట్, బ్లూ ప్యాంట్, స్టైలిష్ షూలతో కనిపించిన లోకేష్ ఫోటోలు నెట్టింట విస్తృతంగా షేర్ అవుతున్నాయి. “లోకేష్ న్యూ లుక్ అదిరింది” అంటూ అనేక మంది కామెంట్లు పెడుతున్నారు. ఈ చర్చ కేవలం దుస్తులకే పరిమితం కాకుండా, ఆయన ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై కూడా సాగుతోంది.
అంతర్జాతీయ పెట్టుబడిదారులతో మాట్లాడుతున్నప్పుడు లోకేష్ చూపిస్తున్న స్పష్టత, వేగవంతమైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం చాలా మందిని ఆకట్టుకుంటోందని సమాచారం. ముఖ్యంగా జ్యూరిక్ (Zurich)లో జరిగిన తెలుగు డయాస్పొరా సమావేశంలో ఆయన చేసిన ప్రసంగం చర్చనీయాంశంగా మారింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌కు రూ.23.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటితో 16 లక్షలకుపైగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని వివరించారు.
భారతదేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే దక్కిందని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు, గూగుల్ (Google) సంస్థ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఏపీలో పెట్టేందుకు ముందుకు వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు, పాలసీ సపోర్ట్ కారణంగానే ఇది సాధ్యమైందని లోకేష్ వివరించారు. ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ఆయన ఒక కీలక పిలుపునిచ్చారు. మీరు పనిచేస్తున్న కంపెనీలు విస్తరణ గురించి ఆలోచిస్తే, ఆ అవకాశాలను ఆంధ్రప్రదేశ్ వైపు మళ్లించండి అని కోరారు. దావోస్ వేదికపై నారా లోకేష్ చూపిస్తున్న చురుకుదనం, కొత్త ఇమేజ్ రాష్ట్రానికి పెట్టుబడుల పరంగా కొత్త ఆశలను కలిగిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.






