Davos: దావోస్ వేదికగా ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానంపై జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు
దావోస్, జనవరి 20: అభివృద్ధి అనేది ఏ ఒక్కరికో పరిమితం కాకూడదని… అందరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి… అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఈ ఉద్దేశ్యంతోనే ఏపీ ప్రభుత్వం ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ప్రపంచ ఆర్ధిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు తన పర్యటనలో భాగంగా రెండో రోజైన మంగళవారం నాడు వివిధ పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. వివిధ చర్చా వేదికల్లో పాల్గొన్నారు. దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానంపై ప్రపంచ ఆర్థిక సదస్సులో చర్చ జరిగింది.
ఈ చర్చా వేదికలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానాన్ని తెచ్చి ఏపీ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధికి చొరవ తీసుకుందని చర్చా వేదికలో పాల్గొన్న ప్రతినిధులు కితాబు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి సాధించేలా… ఆదర్శవంతంగా ఉండే విధానాన్ని తీర్చిదిద్దారని ఏపీ సీఎంను ప్రశంసించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ…”అభివృద్ధిలో అందర్నీ భాగస్వాములను చేసే ఉద్దేశ్యంతోనే ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానం తెచ్చాం. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలకు మేలు జరగాలి… ఓ తరం అభివృద్ధి చెందాలి. నా ఆలోచన ఎప్పుడూ ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోణంలోనే ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉండే టెక్నాలజీలను, పరిణామాలను అందిపుచ్చుకునేలా ఆలోచన చేయాలి. భారతదేశం ఇప్పుడు ఉత్పత్తి రంగం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. దాన్ని అందిపుచ్చుకునే దిశగా మేం ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానం తెచ్చాం.”అని సీఎం వెల్లడించారు.
గైడెన్స్ ఇస్తున్నాం… ఇన్ఫ్రా ఏర్పాటు చేస్తున్నాం…
“ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ అనే విధానం తేవడమే కాదు… దానికి అవసరమైన గైడెన్స్ ఇస్తున్నాం, మౌళిక వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా స్టార్టప్ కంపెనీలకు, ఒన్ ఫ్యామ్లీ-ఒన్ ఎంటర్ ప్రెన్యూయర్ ద్వారా పారిశ్రామికవేత్తలు కావాలనుకునే వారికి గైడెన్స్ ఇస్తాం. పరిశ్రమల అభివృద్ధికి అవసరమైన ఇన్ఫ్రాను సిద్దం చేస్తున్నాం. అలాగే వినూత్న ఆలోచనలతో ఉన్న వారిని ప్రొత్సహించేందుకు పీ-4 అనే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాం. పీ4 ద్వారా పేదరికాన్ని తగ్గించడంతోపాటు… కొత్త ఆలోచనలు ఉన్న వారికి చేయూత ఇచ్చే విధంగా కూడా వ్యవస్థను తీర్చిదిద్దాం. ఎంఎస్ఎంఈలను ప్రొత్సహించడం ద్వారా స్థానికంగా పారిశ్రామికాభివృద్ధిని ప్రమోట్ చేస్తున్నాం. గతేడాది మహిళా దినోత్సవం నాడు లక్ష మందిని మహిళా పారిశ్రామిక వేత్తలను చేస్తామని ప్రకటించాం.. పురోగతి సాధించాం. ఇదే విధంగా విడతల వారీగా మహిళలను పారిశ్రామిక వేత్తలను చేసేలా ప్రొత్సహిస్తాం.
ఉత్పత్తి ముఖ్యం… బ్రాండింగ్ అంతకంటే ముఖ్యం
“ఏపీలో 10 లక్షల మందికి ఏఐ, క్వాంటం టెక్నాలజీలో శిక్షణ ఇవ్వాలని ఐబీఎంను కోరాను. నైపుణ్యం ఉన్న మానవవనరులను కంపెనీలకు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇలా చేయగలిగితేనే రాష్ట్రాభివృద్ధితోపాటు.. ప్రజలు కూడా అభివృద్ధి సాధించగలుగుతారు. ఎన్నో రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది… చాలా పరిణామాలు చోటు చేసుకుంటాయి… అదనపు విలువ జోడించినప్పుడే అభివృద్ధి ఫలాలు అందుకోగలం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు వాల్యూ ఎడిషన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది. పారిశ్రామికవేత్తలుగా ఎదిగాక.. ఉత్పత్తులను తయారు చేయడమే కాదు.. వాటికి బ్రాండింగ్ కూడా ముఖ్యం. ఏపీ ఉత్పత్తులకు బ్రాండింగ్ వచ్చేలా మేం కృషి చేస్తున్నాం. డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించడానికి వచ్చే వారిని మేం అతిథుల్లా చూస్తాం.. గౌరవిస్తాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో అనుమతులు ఇస్తాం.”అని ముఖ్యమంత్రి చెప్పారు.






