Davos: దావోస్‌లో ఇండియా లాంజ్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
దావోస్, జనవరి 20: ప్రపంచ వ్యాప్తంగా విదేశీ పెట్టుబడులకు సురక్షిత గమ్యస్థానం భారతదేశమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయని ఆయన అన్నారు. దేశం వేగంగా మార్పు చెందుతోందని స్పష్టం చేశారు. ప్రపంచ ఆర్ధిక సదస్సు వేదిక దావోస్‌లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంజ్‌ను కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులతో కలిసి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. పార్టనర్ విత్ ఇండియా పేరిట ఏర్పాటు చేసిన ఈ ఇండియా లాంజ్‌లో కొద్దిసేపు సమావేశం అయ్యారు. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. నేషన్ ఫస్ట్ అనే స్పూర్తి చాటేలా టీమ్ ఇండియాగా అంతా కలిసి పనిచేద్దామని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. దేశంలోని వేర్వేరు రాష్ట్రాల నుంచి వచ్చినా అందరం భారత దేశానికే ప్రాతినిధ్యం వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రాలుగా పోటీ పడినా దేశంగా ఒక్కటిగానే ఉన్నామని వివరించారు. పరస్పరం సహకారం అందించుకుంటున్నామని తెలిపారు. ప్రస్తుతం భారత్ బలమైన ఆర్ధిక వ్యవస్థగా వేగంగా రూపాంతరం చెందుతోందని అన్నారు. వచ్చే రెండేళ్లలో ప్రపంచంలో భారత్ 3వ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా అవతరిస్తుందని.. 2047 నాటికి అగ్రస్థానానికి చేరుకుంటుందని అన్నారు. శక్తివంతమైన నేత ప్రధాని నరేంద్ర మోదీ భారత దేశ సామర్ధ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పామని సీఎం స్పష్టం చేశారు.
సంపదతో పాటు జీవన ప్రమాణాలు కీలకం
అభివృద్ధిలో సంపద సృష్టి అత్యంత కీలకమే అయినా ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఏపీలో ప్రజలందరి జీవన ప్రమాణాలు పెంచడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ప్రపంచం ఎలా ముందుకు వెళ్తోందో నేర్చుకునేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వీలుంటుందని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అంతా గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉందన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, రామ్మోహన్ నాయుడు, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి హర్ష్ రమేశ్ కుమార్ సంఘవి, కేరళ మంత్రి పి. రాజీవ్, యూపి మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా, తెలంగాణా మంత్రి డి. శ్రీధర్ బాబు, పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.






