గీత బోధనలతో ఆకట్టుకున్న శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతి దగ్గరలో ఏర్పేడులో ఉన్న వ్యాసాశ్రమంను మహర్షి సద్గురు శ్రీ మలయాళ స్వామి వారు స్థాపించారు. 1926వ సంవత్సరంలో మలయాళ స్వామి వారి చేత స్థాపించిన ఈ ఆశ్రమం ద్వారా ఆధ్యాత్మిక ప్రవచనాలను దేశంలోనూ, విదేశాల్లోనూ బోధిస్తున్నారు. ఆ గురు పరంపరలో ఇప్పుడు నాలుగవ పీఠాధిపతిగా ఉన్నటువంటి మహర్షి సద్గురు శ్రీ పరిపూర్ణానందగిరి స్వామి వారు ఇటీవల అమెరికా పర్యటన చేశారు. ప్రతి రెండు సంవత్సరాలకొకసారి అమెరికా దేశానికి విచ్చేసి, అన్ని రాష్ట్రాల్లో పర్యటించి సనాతన ధర్మము విశిష్టతను, మన పురాణ ఇతిహాసాలు, అలాగే ప్రముఖంగా భగవద్గీత ప్రాముఖ్యత మొదలగు అంశాలను తెలియపరుస్తూ ఉంటారు. తన 3 నెలల పర్యటనల్లో భాగంగా అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ధర్మ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చివరగా న్యూయార్క్ పట్టణానికి ఆగస్టు 29వ తేదీన వచ్చినప్పుడు భక్తులు ఆయనకు స్వాగతం పలికారు. టిఎల్ సిఎ మాజీ అధ్యక్షుడు ఉదయ్ కుమార్ దొమ్మరాజు, హేమలత దంపతులు ఆయన పర్యటనను కో ఆర్డినేట్ చేశారు. స్వామివారితోపాటు ఆయన వివిధ చోట్ల పర్యటించారు.
న్యూయార్క్‌లో ఆగస్టు 30వ తేదీన బాడే నారాయణస్వామి, కమలమ్మ దంపతుల చేత నిర్మితమైన తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (టిఎల్ సిఎ) భవనానికి స్వామివారు వచ్చినప్పుడు ప్రస్తుత అధ్యక్షులు సుమంత్ రామశెట్టి, అలాగే బీ.ఓ.టి. ఛైర్‌ఉమెన్ శ్రీమతి రాజీ కుంచం, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్. వారికి స్వాగత సత్కారాలు చేశారు.
ఈ సందర్భంగా స్వామివారు గీతా సారాంశము, గీతా విశిష్టత, గీతా సారాంశం గురించి చక్కగా ప్రబోధించారు. గీతలోని 18 అధ్యాయాలను తీసుకుని వాటి యొక్క విశిష్టతను, మన జీవితంలో వాటిని ఎలా అన్వయించుకోవాలి, మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడానికి భగవద్గీత వేసిన సోపానాల గురించి వివరంగా విశదీకరించారు. చివరగా వచ్చిన తెలుగు వారందరికీ స్వామి వారి అనుగ్రహం అందజేసి ప్రసాదాలు పంచారు. ఈ పర్యటనలో స్వామీజీ వెంట ఆయన ముఖ్య శిష్యులు అసంఘానంద స్వామి కూడా ఉన్నారు.
న్యూయార్క్‌లో దాదాపుగా ఐదు రోజులు ఉన్నారు. వారు విచ్చేసిన శుభ సందర్భంగా పలువురు భక్తులు స్వామివారిని తమతమ ఇళ్లకు ఆహ్వానించి గురు పూజ చేసుకొని తమ భక్తిని చాటుకున్నారు. వెళ్ళిన ప్రతి గృహంలోనూ స్వామి వారు భాగవతము, పురాణాలు, సనాతన ధర్మము గురించి, గృహస్థాశ్రమ విషయాల గురించి అనేక విషయాలను తెలియజేశారు. చివరగా న్యూయార్క్ పట్టణం నుంచి స్వామి వారు సెప్టెంబర్ మూడవ తేదీన తిరిగి భారతదేశానికి వెళ్ళారు.
ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ దొమ్మరాజు మాట్లాడుతూ, స్వామివారి రాక తమకు ఎన్నో అనుభవాలు మిగిల్చిందని, ఎన్నో విషయాలను తెలుసుకున్నామని చెప్పారు. స్వామి వారు గురుదేవులు ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని అనుగ్రహించడం మా న్యూయార్క్ నగరవాసులు చేసుకున్నటువంటి పుణ్యమని చెప్పారు.
టిఎల్ సిఎ అధ్యక్షులు సుమంత్ రామిశెట్టి, కార్యనిర్వాహక కమిటీ సభ్యులు కూడా స్వామివారి రాక తమకు ఎంతో అనుభూతిని కలిగించిందని, గీతాసారాన్ని తెలుసుకున్నామని చెప్పారు.