Pawan Kalyan: పవన్‌పై డాక్టర్ అభ్యంతరకర వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందా..?

కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి మండలం తల్లపల్లె గ్రామంలో జరిగిన ఓ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ (RMP Doctor) పోతుమూడి గిరిధర్ కుమార్‌పై (Giridhar) జనసేన కార్యకర్తలు మూకుమ్మడి దాడి చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో జనసైనికులు ఆగ్రహంతో ఆ డాక్టర్ పై దాడి చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హెచ్చరించు. ఇలాంటి వాటిని ఉపయోగించుకుని కుల, మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. గత పదేళ్లుగా ఇలాగే కొన్ని సంఘవిద్రోహ శక్తులు పని చేస్తున్నాయని పవన్ కల్యాణ్ చెప్పడం కొత్త అనుమానాలకు తావిచ్చింది.
సెప్టెంబర్ 8న గిరిధర్ అనే ఆర్ఎంపీ డాక్టర్ ఒక యూట్యూబ్ ఛానల్‌లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో జనసేన పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. జనసేన నేత కొరియర్ శ్రీను ఆధ్వర్యంలో సుమారు 100 మంది కార్యకర్తలు తల్లపల్లెలో గిరిధర్ ఇంటిపై దాడి చేశారు. వారు ఇంటిని ధ్వంసం చేసి, గిరిధర్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టి బలవంతంగా పవన్ కల్యాణ్‌కు క్షమాపణ చెప్పించారు. ఈ దాడిలో గిరిధర్‌తో పాటు అతని పొరుగింట్లో ఉన్న సతీష్ పైన కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాక సతీష్ షాపును ధ్వంసం చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరగడం మరింత ఆశ్చర్యకరం.
ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాడి విషయం తెలుసుకున్న వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గిరిధర్‌తో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. ఇలాంటి అన్యాయాలను ప్రజలు చూస్తున్నారని, వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పేర్ని నాని DSP కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు.
అయితే ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రతిస్పందన ఆసక్తి రేపుతోంది. కొంతమంది ఆర్ఎంపీ డాక్టర్‌లాంటి వ్యక్తులను తమ స్వప్రయోజనాలకు ఉపయోగించుకుని, కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అలాంటి వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని జనసైనికులకు సూచించారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో ఇలాంటి సంఘవిద్రోహ శక్తులు చురుకుగా ఉన్నాయని గుర్తు చేశారు. దీన్ని బట్టి ఈ ఘటన వెనుక ఎవరో ఉన్నారని పవన్ మాటల ద్వారా అర్థమవుతోంది. దీనిపై అంతర్గత విచారణ జరుపుతున్నట్టు చెప్పారు. దాడి చేసినవారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పవన్ కల్యాణ్ హెచ్చరికలు ఈ ఘటనను కేవలం ఒక దాడిగా కాకుండా, పెద్ద కుట్రలో భాగంగా చూడాలని సూచిస్తున్నాయి.