Future City: ఫ్యూచర్ సిటీలో లక్ష కోట్ల పెట్టుబడులు : ఎరిక్ స్విడర్
భారత్ ఫ్యూచర్ సిటీ (Future City) లో రాబోయే పదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెడతానని ట్రంప్ మీడియా, టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్ (Eric Swider) అన్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఎరిక్ మాట్లాడుతూ పెట్టుబడులకు తెలంగాణ అనుకూలమైన ప్రాంతమన్నారు. పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరఫున అన్నిరకాల సహకారం అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) భరోసా ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వ ప్రకటన పెట్టుబడులను ఆకర్షించేలా ఉందన్నారు. 20 ఏళ్ల క్రితం భారత్‌ను చూస్తే కేవలం కాల్ సెంటర్ల కేంద్రంగా కనిపించేదని, ఇప్పుడు ప్రపంచ టెక్నాలజీ రంగాన్ని శాంసిచే మేధావులు భారత్ నుంచే వస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ సంస్థల్లో ప్రతిభావంతులుగా భారతీయులు రాణిస్తున్నారని, రాబోయే రోజుల్లో సాంకేతికతలో ప్రపంచానికి భారత్ నాయకత్వం వహిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. భావ వ్యక్తీకరణ ప్రతి మనిషికీ ప్రాథమిక హక్కు అని, ఆ స్వేచ్ఛ అందరికీ ఉండాలనే కారణంతోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతిపెద్ద వాటాదారుగా ఉన్న ట్రూ సోషల్ మాధ్యమాన్ని పబ్లిక్‌లోకి తీసుకొచ్చేందుకు రెండేళ్లు పోరాటం చేశారని గుర్తు చేశారు. గ్లోబల్ సమ్మిట్ వేదికపై ప్రముఖులతోపాటు తనకు ఇచ్చిన గౌరవాన్ని, ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యాన్ని మరువలేనని ఎరిక్ తెలిపారు. ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
– NS GOUD






