Global Summit: ఇన్నోవేషన్ క్యాపిటల్ గా తెలంగాణ : భట్టి విక్రమార్క
దేశ ఎకానమీ చరిత్రలో లేని అత్యంత భారీ లక్ష్యాన్ని 2047 కోసం నిర్దేశించుకున్నామని, తెలంగాణను ఇన్నోవేషన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నట్లు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌లో (Global Summit) భాగంగా రెండో రోజు 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ లక్ష్యం కోసం మూలధనం, ఉత్పాదకత పెంపు అంశంపై సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ 2047 కేవలం డాక్యుమెంట్ కాదు, భవిష్యత్ కోసం తాము చేస్తున్న ప్రతిజ్ఞ అని అన్నారు. తెలంగాణ ఎకానమీ ప్రస్తుతం దాదాపు 185 బిలియన్ డాలర్ల వరకు ఉందని చెప్పారు. త్రీ ట్రిలియన్ డాలర్లు చేరుకునేందుకు 22 ఏళ్లలో 16 రెట్లు పెరగాల్సి అవసరం ఉందని పేర్కొన్నారు.
గుజరాత్ (Gujarat), కర్ణాటక ( Karnataka) సహా దేశంలోని ఏ రాష్ట్రం కూడా అంత స్థాయిలో వృద్ధి చెందలేదని, దేశ ఎకానమీ చరిత్రలో లేని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. కేవలం కష్టపడితేనే, మరిన్ని రోడ్లు, భవనాలు కడితే మాత్రమే లక్ష్యాన్ని చేరుకోలేమని, ఎకానమీ ప్రాథమిక సూత్రాలను మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. క్యాపిటల్, ఇన్నోవేషన్ కలిపి ఉత్పాదకత పెంచడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమని పేర్కొన్నారు. డీప్ టెక్, ఏఐ,క్వాంటమ్ కంప్యూటింగ్‌లు ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో తెలంగాణను ఆసియాకు ఇన్నోవేషన్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. క్యూర్, ప్యూర్, రేర్‌తో ప్రాంతాల వారీ ప్రణాళికతో విజన్ డాక్యుమెంట్ వస్తోందని చెప్పారు.
– NS GOUD






