ఖమ్మం నుంచి టీడీపీ పోటీ చేయబోతోందా…?

ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కనుమరుగవుతూ వచ్చింది. 2014లో కొన్ని సీట్లను గెలుచుకున్నా ఆ తర్వాత పట్టు కోల్పోతూ వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. అయితే పలు జిల్లాల్లో ఆ పార్టీకి పట్టుంది. క్షేత్రస్థాయిలో ఓ మోస్తరు కేడర్ ఉంది. గట్టి లీడర్ నిలబడితే ఆ పార్టీకి ఓట్లేసేవాళ్లున్నారు. దాన్ని సొమ్ము చేసుకునేందుకు ఈసారి టీడీపీ ప్రయత్నిస్తోందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఏపీలో బీజేపీకి 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాలను కేటాయించింది టీడీపీ. అందుకు ప్రతిగా తెలంగాణలో తమకు ఖమ్మం సీటు ఇవ్వాలని టీడీపీ కోరుతున్నట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి తమ అభ్యర్థిని రంగంలోకి దింపాలనుకుంటోంది. ఖమ్మం జిల్లాలో టీడీపీకి మంచి పట్టుండడమే ఇందుకు కారణం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి అబ్యర్థులను నిలబెట్టాలని టీడీపీ అనుకుంది. అయితే రేవంత్ రెడ్డితో అవగాహన నేపథ్యంలో చివరి నిమిషంలో టీడీపీ బరిలోంచి తప్పుకున్నట్టు సమాచారం.
అయితే ఇప్పుడు బీజేపీతో అవగాహన ఉండడంతో ఈ సీటు కోరుతోంది టీడీపీ. అయితే తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం టీడీపీకి ఇవ్వొద్దని స్పష్టం చేస్తున్నారు. మొత్తం 17 స్థానాల్లో తామే పోటీ చేయాలని కోరుకుంటున్నారు. బీజేపీ ఇప్పటివరకూ 15 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, వరంగల్ స్థానాలకు మాత్రమే ఇక్కడ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వరంగల్ నుంచి ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఆరూరి రమేశ్ కు టికెట్ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఖమ్మం నుంచి ఎవర్ని నిలబెట్టాలనేదానిపై ఇంకా క్లారీటీకి రాలేదు. ఇక్కడ టికెట్ ఆశించి ఇటీవలే బీజేపీలో చేరారు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు. అయితే ఆయన్ను అభ్యర్థిగా ఇంకా ప్రకటించలేదు.
మరోవైపు తనకు టికెట్ ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని సిట్టింగ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే నామా నాగేశ్వర రావు ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. ఒకవేళ టీడీపీకి టికెట్ ఇస్తే ఆ పార్టీ తరపున పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. లేదంటే బీజేపీనే పోటీ చేసేటట్లయితే ఆ పార్టీలో చేరి మళ్లీ బరిలోకి దిగేందుకు నామా సిద్ధమయ్యారు. అయితే ఏ పార్టీ పోటీ చేస్తుందనేది క్లారిటీ వచ్చిన తర్వాత నామా ప్రయాణం ఎటువైపు అనేది తేలనుంది. 22న ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ కమిటీ సమావేశమవుతోంది. అందులో ఈ రెండు స్థానాలపై క్లారిటీ వస్తుందని తెలుస్తోంది. టీడీపీకి కేటాయిస్తుందా.. లేకుంటే బీజేపీనే పోటీ చేస్తుందా అనేది ఆరోజు తేలనుంది.