YCP: వైసీపీ డిజిటల్ బుక్ సీన్ రివర్స్ …!

టీడీపీ హయాంలో తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై జరిగిన దాడులను ఎదుర్కొనేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ (YS Jagan) తీసుకొచ్చిన డిజిటల్ బుక్.. బూమరాంగ్ అవుతోందా..? ప్రత్యర్థి పార్టీ సంగతి పక్కన పెడితే.. తమ పార్టీలోని వేధింపులను బయట పెట్టేందుకు ఓ వేదికగా మారుతోంది. మొన్నటికి మొన్న మాజీమంత్రివిడుదల రజినీపై.. నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేశారు. లేటెస్టుగా మడకశిర వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై వైసీపీ డిజిటల్ బుక్‌లోకి ఫిర్యాదు చేరింది.
ఏపీ మాజీ మంత్రి విడదల రజనీకి వైసీపీ డిజిటల్ బుక్‌లో షాక్ తగిలింది. చిలకలూరిపేటలోని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆదివారం నాడు వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ద్వారా విడదల రజినిపై ఫిర్యాదు చేశారు. ‘2022లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని నవతరం పార్టీ ఆఫీసుతో పాటు, తన ఇల్లు, కారుపై మాజీ మంత్రి విడదల రజినీ దాడి చేయించారని ఆరోపించారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకొని న్యాయం చేయాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఫిర్యాదు చేశానని’ వివరించారు.డిజిటల్ బుక్ యాప్ ద్వారా ఫిర్యాదు అనంతరం వచ్చిన టికెట్‌ను చూపించారు. తనకు కనుక జగన్ న్యాయం చేస్తే.. వైసీపీ నేతలు, కార్యకర్తలకు ఈ డిజిటల్ బుక్ యాప్ ద్వారా న్యాయం అందుతుందని నమ్మకం కలుగుతుందన్నారు రావు సుబ్రహ్మణ్యం.
మడకశిర వైసీపీ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామిపై వైసీపీ డిజిటల్ బుక్‌లోకి ఫిర్యాదు నమోదైంది. మున్సిపల్ చైర్మన్‌ను చేస్తానంటూ తమ నుంచి రూ. 25 లక్షలు తీసుకున్నట్లు కౌన్సిలర్ ప్రియాంక, తండ్రి విక్రమ్ డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే అంగన్ వాడీ హెల్పర్ ఉద్యోగం కోసం తిప్పేస్వామికి రూ. 75 వేలు ఇచ్చినట్లు దోక్కలపల్లి గ్రామానికి చెందిన రామరాజు కూడా డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేశారు.
టీడీపీ నేతలు, కార్యకర్తలపై ఫిర్యాదుల సంగతి పక్కనపెడితే.. తమ పార్టీ నేతలపైనే ఫిర్యాదులు నమోదవుతుండడం.. వైసీపీలో చర్చనీయాంశమైంది. మరి వీటిని ఆపార్టీ అధినేత జగన్ ఎలా పరిష్కరిస్తారన్న అంశం ఆసక్తికరంగా మారింది.