Islamabad: పీఓకే ఆందోళనలకు దిగొచ్చిన పాక్ సర్కార్…

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో వెల్లువెత్తిన ప్రజా నిరసన పాక్ సర్కార్ ను కదిలించింది. ఆర్మీని ఉపయోగించి, దారుణంగా అణచివేసినా.. ప్రజలు వెనక్కు తగ్గకపోవడం, మరింతగా ఉద్యమం ఎగసిపడుతుండడంతో.. చేసేదేమీ లేక పాక్ సర్కార్ దిగొచ్చింది. పీఓకేలో హింసాత్మక ఆందోళనలకు తెరవేసేందుకు జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JKJAAC)తో ఒక ఒప్పందంపై సంతకాలు చేసింది. పాకిస్థాన్ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి తారిఖ్ ఫజల్ చౌదరి ఈ మేరకు అధికారిక ప్రకటన చేసారు. రెండువైపులా ఒప్పందం కుదిరినట్టు పేర్కొన్నారు.
‘యాక్షన్ కమిటీతో ప్రభుత్వ ప్రతినిధుల బృందం సంప్రదింపులు జరిపి తుది ఒప్పందంపై సంతకాలు చేసింది. ఆందోళనకు దిగిన ప్రజలు తిరిగి తమ ఇళ్లకు వెళ్తున్నారు. అన్ని రోడ్లు తెరుచుకున్నాయి. ఇది శాంతికి చేకూరిన విజయం’ అని సామాజిక మాధ్యమం ట్విట్టర్ ‘ఎక్స్’లో చౌదరి తెలిపారు. జేకేజేఏఏసీ 38 పాయింట్లను తమ ముందు ఉంచిందని, 25 పాయింట్లపై ప్రభుత్వం అంగీకారం తెలిపిందని ఆయన వివరించారు.
ఒప్పందంలోని కీలకాంశాలు…
నిరసనకారుల మృతికి దారితీసిన హింసాత్మక, విధ్యంసక ఘటనల్లో బాధ్యులపై తీవ్రవాద వ్యతిరేక చట్టంలోని సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అక్టోబర్ 1, 2వ తేదీల్లో జరిగిన ఆందోళనల్లో ప్రాణాల్లో కోల్పోయిన వారికి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుంది. 15 రోజుల్లోగా హెల్త్ కేర్ కార్డులు అమలు చేసేందుకు నిధులను AJ&K ప్రభుత్వం విడుదల చేస్తుంది. పాకిస్థాన్ ప్రభుత్వ నిధుల నుంచి ఏజేకేలోని ప్రతి జిల్లాకు ఎంఆర్ఐ, సీటీ స్కాన్ మిషన్లు దశల వారీగా అందజేస్తుంది. విద్యుత్ వ్యవస్థనును మెరుగుపరచేందుకు రూ.1000 కోట్లు విడుదల చేస్తుంది. క్యాబినెట్ సైజును 20 మంత్రులు/అడ్వయిజర్లకు కుదిస్తుంది. ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ పన్నులను పంజాబ్ లేదా ఖైబర్ పఖ్తుంక్వాలో అమలు చేస్తున్నట్టుగా 3 నెలల్లో ఇక్కడా అమలు చేస్తుంది. హైడల్ ప్రాజెక్టులకు సంబంధించి హైకోర్టు 2019లో తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేస్తుంది. విద్యాసంస్థల్లో ప్రతిభకు అవకాశం కల్పిస్తుంది. ఎడీపీ నుంచి కశ్మీర్ కాలనీ డాడ్యాల్‌కు వాటర్ సప్లయ్ స్కీమ్, ట్రాన్స్‌మిషన్ లైన్ ఏర్పాటు చేస్తుంది. మెండర్ కాలనీ డాడ్యాల్‌లో శరణార్థులకు ప్రాపర్టీ హక్కులు కల్పిస్తుంది. అక్టోబర్ 2,3 తేదీల్లో రావల్పిండి, ఇస్లామాబాద్‌లో జరిగిన ఘటనల్లో అరెస్టయిన కశ్మీరీ నిరసనకారులను విడుదల చేస్తుంది.
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని (PoK) ప్రజలు తమ ప్రాథమిక హక్కుల కోసం జరిపిన ఆందోళనలు ఉవ్వెత్తున ఎగసిపడటం, ప్రభుత్వ దమనకాండలో 12 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఎట్టకేలకు షెహబాజ్ షరీఫ్ ఫ్రభుత్వం దిగివచ్చింది.