Sindhu: జాఫర్ ఎక్స్ ప్రెస్ పై బీఆర్జీ పంజా..!

బలూచిస్తాన్ స్వాతంత్రమే లక్ష్యంగా బీఆర్జీ, బీఎల్ఏ రెచ్చిపోతున్నాయి. ఆర్మీ జవాన్లు, పాక్ పోలీసులే టార్గెట్ గా దాడులకు దిగుతున్నాయి. గతంలో ఓసారి జాఫర్ ఎక్స్ ప్రెస్ పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేయగా.. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ గార్డ్స్ దాడికి దిగింది. బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ (Jaffar Express) పై జరిగిన శక్తిమంతమైన బాంబు దాడిలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఈ పేలుడు ధాటికి రైలుకు చెందిన ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. సింధ్-బలోచిస్థాన్ సరిహద్దుకు సమీపంలోని సుల్తాన్‌కోట్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
క్వెట్టా నగరానికి వెళ్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు మార్గంలో తిరుగుబాటుదారులు ముందుగానే అమర్చిన శక్తిమంతమైన ఐఈడీ (ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్)ని పేల్చివేశారు. దీంతో రైలు బోగీలు చెల్లాచెదురై పట్టాలు తప్పాయి. ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక బృందాలు, భద్రతా దళాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు.
ఇదిలా ఉండగా, ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు బలోచ్ రెబల్ గ్రూప్ అయిన బలోచ్ రిపబ్లిక్ గార్డ్స్ (బీఆర్జీ) ప్రకటించింది. పాకిస్థాన్ సైన్యానికి చెందిన సిబ్బంది ఆ రైలులో ప్రయాణిస్తున్నందువల్లే లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్లు తమ ప్రకటనలో స్పష్టం చేసింది. “మా దాడిలో పలువురు సైనికులు మరణించారు, మరికొందరు గాయపడ్డారు. బలోచిస్తాన్ స్వాతంత్ర్యం సిద్ధించే వరకు ఇలాంటి దాడులు కొనసాగిస్తాం” అని ఆ సంస్థ హెచ్చరించింది. ఈ ఏడాది మార్చి నుంచి జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై దాడులు జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం.