Hyderabad: అమెరికా సంబంధాలా వద్దు బాబోయ్.. ట్రంప్ ఎఫెక్ట్ తో మారుతున్న భారతీయ కుటుంబాల అభిప్రాయాలు…

అబ్బాయి అమెరికాలో ఉంటున్నాడు. లక్షల జీతం.. కారు, బంగ్లా.. ఇంకేముంది అప్పో. సప్పో చేసి అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తే చాలు .. పిల్ల లక్షణంగా ఉంటుంది.. ఇది ఇప్పటివరకూ భారతీయ వధువుల కుటుంబాలు ఆలోచించే విధానం. అందుకే అమెరికా (America) సంబంధాల కోసం వడపోసి మరి పిల్లనిచ్చి పెళ్లి చేసేవారు. కొన్ని బాగుంటే.. మరికొందరు మాత్రం చీటింగ్ చేసి, వారికి జీవితాంతం కష్టాన్ని , బాధనే మిగిల్చేవారు. అయితే ట్రంప్ (Trump) ఎఫెక్ట్ తో పరిస్థితి తలకిందులైంది.
ఒకప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న అబ్బాయికి సంబంధం కుదరడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠినమైన వలస విధానాలు, ముఖ్యంగా హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు భారతీయ వివాహ మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒకప్పటిలా అమెరికా సంబంధాలకు బదులు, ఇప్పుడు ఆ సంబంధాలంటేనే కుటుంబాలు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాయి.
ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలపై నియంత్రణను కఠినతరం చేయడంతో, అమెరికాలో పనిచేస్తున్న ఎందరో భారతీయుల ఉద్యోగ భద్రత, నివాస హోదా ప్రశ్నార్థకంగా మారాయి. ఈ అస్థిరతే భారతీయ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. తమ కుమార్తె భవిష్యత్తు అభద్రతలో పడుతుందనే భయంతో చాలా కుటుంబాలు అమెరికా సంబంధాల పట్ల విముఖత చూపుతున్నాయి.
ఈ మార్పు కొన్ని నెలలుగా స్పష్టంగా కనిపిస్తోందని, ట్రంప్ విధానాలతో తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిందని మ్యారేజ్ బ్యూరోలు చెబుతున్నాయి. “గత ఏడాది వరకు ఎన్నారై సంబంధాలకు విపరీతమైన డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. హెచ్-1బీ వీసాలపై గందరగోళం పెరగడంతో భయాందోళనలు ఎక్కువయ్యాయి” అని ఆమె వివరించారు. ఈ కారణంగా ఇప్పటికే నిశ్చయమైన కొన్ని వివాహాలు కూడా వాయిదా పడ్డాయని అట్లాంటాలో నివసిస్తున్న ఓ ప్రవాస భారతీయుడు పేర్కొన్నారు.
మారిన పరిస్థితులకు అనుగుణంగా మ్యాట్రిమోనీ సంస్థలు కూడా కొత్త పద్ధతులను అనుసరిస్తున్నాయి. కొన్ని ప్రముఖ మ్యాట్రిమోనీ యాప్‌లు తమ ప్లాట్‌ఫామ్‌లపై ‘యూఎస్ వీసా ఫిల్టర్’ అనే కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టాయి. సంబంధం ఖరారు చేసుకునే ముందే అబ్బాయి వీసా స్టేటస్ (హెచ్-1బీ, గ్రీన్ కార్డ్, లేదా ఇతర వీసా) స్పష్టంగా తెలుసుకునేందుకు కుటుంబాలు ఆసక్తి చూపుతున్నాయి.
అమెరికాలో అస్థిరత కారణంగా, చాలా కుటుంబాలు ఇప్పుడు కెనడా, యూకే, యూరప్, మరియు మధ్యప్రాచ్య దేశాలలో స్థిరపడిన వరుల వైపు మొగ్గు చూపుతున్నాయి. “కుటుంబాలు వివాహం చేసేటప్పుడు దీర్ఘకాలిక స్థిరత్వం, భద్రతను ప్రధానంగా చూస్తాయి. అందుకే ఇప్పుడు ప్రత్యామ్నాయ దేశాల వైపు చూస్తున్నారు” అని ‘వోస్ ఫర్ ఎటర్నిటీ’ వ్యవస్థాపకురాలు అనురాధ గుప్తా అన్నారు.