Chandrababu: ప్రజలను ఆకర్షిస్తున్న చంద్రబాబు .. జగన్ ఇప్పటికైనా తెలుసుకుంటారా?

రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అనే పేరు వినగానే తెలివితేటలు, వ్యూహాత్మక ఆలోచన గుర్తుకు వస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన రాజకీయ శైలి వేరేలా ఉంటుంది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో ఎంతోమంది నేతలు ఉన్నప్పటికీ చంద్రబాబు స్టైల్ డిఫరెంట్ అని చెప్పాలి. ఆయన లాంటి నాయకుడు గతంలో లేరు, భవిష్యత్తులో రావడం కూడా కష్టమే అనిపిస్తుంది. ఓటములు, విజయాలు ఆయన ప్రయాణంలో సహజమే కానీ ఆయన రాజకీయ తెలివి మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. అందుకే ప్రేమించినా, ద్వేషించినా — పక్క పార్టీలో ప్రతిపక్షంలో ఉన్న నేతలైనా సరే ఆయన చేసే కొన్ని నిర్ణయాలు సరైనవే అని అనిపించకుండా ఉండదు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) సంక్షేమ పథకాలపై ఆధారపడి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన ప్రభుత్వ కాలంలో అనేక పథకాలు అమలు అయ్యాయి. కానీ ఆ పథకాలను ప్రజలకు గుర్తు చేసే విధానం బలహీనంగా ఉండటమే జగన్ వైఫల్యానికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తాడేపల్లి (Tadepalli) లోని కార్యాలయంలో కూర్చొని బటన్ నొక్కడం ద్వారా నిధులు పంపిణీ చేసినా, ప్రజలతో ప్రత్యక్ష సంబంధం లేకపోవడం జగన్ కు ప్రతికూలంగా మారింది.
ఇదే సమయంలో చంద్రబాబు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇచ్చే పథకాలు కొత్తవి కాకపోయినా, వాటిని ప్రజల మధ్య సరికొత్తగా పరిచయం చేస్తూ ప్రజాభిమానాన్ని పొందుతున్నారు. ఆయన ప్రతి పథకాన్ని ప్రజల ముందే వివరించి, దాని ప్రయోజనాలను గుర్తు చేస్తున్నారు. పింఛన్ పంపిణీ నుంచి అభివృద్ధి కార్యక్రమాల దాకా ఆయనే స్వయంగా హాజరై పర్యవేక్షిస్తున్నారు.
చంద్రబాబు రాజకీయాల్లో ఓ మాస్టర్ ప్లానర్. ఓటమి తర్వాత కూడా ఆయన వెనక్కి తగ్గకుండా, తన ప్రణాళికలను ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి పదవిలోకి తిరిగి వచ్చిన వెంటనే ప్రజలతో ప్రత్యక్ష సంబంధాన్ని మరింతగా పెంచారు. జిల్లాల వారీగా పర్యటిస్తూ ప్రజలను కలుస్తూ, ప్రభుత్వం చేస్తున్న పనులను వివరిస్తున్నారు.
జగన్ అయితే పథకాలు ఇచ్చి కర్తవ్యం పూర్తయిందనుకున్నా, చంద్రబాబు మాత్రం “ప్రజలకు గుర్తు చేయడం కూడా పాలనలో భాగమే” అని చూపిస్తున్నారు. ఆయనకు ప్రజల నాడీ బాగా తెలుసు..“ఇచ్చినదాన్ని మరచిపోతారు, గుర్తు చేస్తే మాత్రమే గుర్తుంచుకుంటారు” అనే నిజాన్ని ఆయన రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. దీంతో ఇప్పుడు నాయకుడు అంటే ప్రజలతో ఉండే వ్యక్తి కావాలి, కేవలం బటన్ నొక్కేవాడు కాదు అన్న టాక్ నడుస్తోంది. ప్రజలను సరిగా అర్థం చేసుకోకపోవడం వల్లే జగన్ లాంటి నాయకుడు వెనుకడుగు వేస్తుంటే, చంద్రబాబు లాంటి వ్యూహకర్త ముందడుగు వేస్తున్నారు. ఈ విషయాన్ని జగన్ ఎప్పుడు ఆచరణలో పెడతారు అన్న విషయం ఆసక్తికరంగా మారింది.