రాజకీయ సెగలు రేపుతున్న ‘బండి’ తనయుడి కేసు
తెలంగాణ రాజకీయ ముఖచిత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వ్యక్తిగత స్థాయికి దిగజారింది. నిన్నటి వరకు ప్రజా సమస్యలు, అభివృద్ధి, విమర్శల చుట్టూ సాగిన రాజకీయం.. ఇప్పుడు నేతల ఇంటి గడప దాటి వారి పిల్లల వరకు చేరింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు ఇప్పుడు కేవలం ఒక నేరపూరిత దర్యాప్తు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఒక రాజకీయ అగ్నిగుండంగా మారింది.
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ ప్రాంతాలైన గచ్చిబౌలి, శేరిలింగంపల్లిలో వెలిసిన “బండి భగీరథ్ పరారీ” పోస్టర్లు ఈ వివాదాన్ని రోడ్డున పడేశాయి. దర్యాప్తు సంస్థలు నిజాన్ని నిగ్గుతేల్చకముందే, ఇలా పోస్టర్లతో ఒక వ్యక్తిని దోషిగా ముద్రవేయడం వెనుక పక్కా రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. ప్రత్యర్థిని రాజకీయంగా ఎదుర్కోలేక, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్యానికి పెను సవాలుగా మారింది. ఈ పోస్టర్లు ఎవరు వేశారు? దీని వెనుక ఉన్న శక్తులు ఏవి? అనే ప్రశ్నల కన్నా.. ఒక యువకుడిని రాజకీయ యుద్ధంలో పావుగా వాడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఈ కేసు ప్రస్తుతం రెండు భిన్నమైన వాదనల మధ్య నలుగుతోంది. ఒక మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిందని, ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలికి న్యాయం జరగాలని బీజేపీయేతర పార్టీలన్నీ పట్టుబడుతున్నాయి. ఇది పక్కాగా ప్లాన్ చేసిన ‘హనీ ట్రాప్’ అని భగీరథ్ వర్గం ఆరోపిస్తోంది. సుమారు 5 కోట్ల రూపాయల కోసం తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆయన తరపున కౌంటర్ ఫిర్యాదు నమోదైంది. ఈ రెండు వాదనల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ట్రోలింగ్ తార స్థాయికి చేరింది. నిజమైన బాధితులు ఎవరో తేల్చలేనంతగా గందరగోళం సృష్టిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సిట్ విచారణకు భగీరథ్ హాజరుకాకపోవడం రాజకీయ చర్చకు దారితీసింది. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ తర్వాత వస్తానని ఆయన సమాచారం పంపారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. బండి సంజయ్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, బండి సంజయ్ మాత్రం ఇది తనపై జరుగుతున్న రాజకీయ కుట్రపూరిత చర్య అని, తన ఎదుగుదలను ఓర్వలేక కుమారుడిని బలి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ఈ రాజకీయ కుమ్ములాటలో బాధితురాలి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాజకీయం గెలవాలనే తపనలో బాధితురాలి గుర్తింపును, ఆమె మానసిక స్థితిని ఎవరూ పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు ఈ సమస్యకు వివాహం వంటి వింత సలహాలు ఇవ్వడం, దాన్ని టీపీసీసీ ఖండించడం వంటి పరిణామాలు ఈ అంశం ఎంతటి అయోమయానికి గురైందో చాటిచెబుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో నేతల వ్యక్తిగత జీవితాలను, వారి పిల్లలను వీధిలోకి లాగడం ఒక ప్రమాదకరమైన సంస్కృతి. నేరం నిరూపితమైతే భగీరథ్ అయినా, మరెవరైనా చట్టపరమైన శిక్ష అనుభవించాల్సిందే. అందులో రెండో మాట లేదు. కానీ, దర్యాప్తు పూర్తికాకముందే పోస్టర్లతో వేధించడం లేదా రాజకీయ కుట్రలంటూ తప్పించుకునే ప్రయత్నం చేయడం.. ఈ రెండూ వ్యవస్థల పట్ల ప్రజలకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. కోర్టులో తేలాల్సిన అంశాన్ని వీధి పోరాటంగా మార్చడం వల్ల అంతిమంగా న్యాయం కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. రాజకీయాలు సిద్ధాంతాల మీద జరగాలి కానీ, కుటుంబ సభ్యుల కన్నీళ్ల మీద కాదు.
ఇవి కూడా చదవండి






