తెలంగాణ రాష్ట్రానికి మరో ప్రఖ్యాత కంపెనీ.. 290 కోట్ల పెట్టుబడితో
అమెరికాకు చెందిన ప్రసిద్ధ దుస్తుల తయారీ సంస్థ జాకీ అనుబంధ పేజ్ ఇండస్ట్రీస్ తెలంగాణకు రానుంది. రూ.290 కోట్లలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, సిద్దిపేట జిల్లా ములుగులో భారీ పరిశ్రమలు నెలకొల్పనుంది. వీటి ద్వారా ఏటా కోటి దుస్తుల తయారీతో పాటు ఏడువేల మందికి ఉపాధి కల్పించనుంది. సంస్థ ఎండీ వీఎస్ గణేశ్ తమ ప్రతినిధి బృందంతో ప్రగతిభవన్‌లో పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ పెట్టుబడుల ప్రణాళికను వెల్లడిరచారు. భారత్‌లో మరింత భారీగా వ్యాపారాన్ని విస్తరించేందుకు తెలంగాణను ఎంచుకున్నామని, పెట్టుబడులకు ఎంతో అనుకూలంగా ఈ రాష్ట్రం ఉందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి ఇబ్రహీపట్నం, ములుగులో స్థలాలను ఎంపిక చేశామని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని వైట్ గోల్డ్ స్పిన్ టెక్ పార్క్ ఫ్లగ్ అండ్ ప్లే ఫెసిలిటీలో లక్షన్నర చదరపు అడుగుల విస్తీర్ణంలో పేజ్ ఇండస్ట్రీస్ తయారీ యూనిట్ ఏర్పాటు ద్వారా మూడువేల మందికి ఉపాధి కల్పిస్తామన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులో 25 ఎకరాల విస్తీర్ణంలో భారీ యూనిట్ స్థాపన ద్వారా 4000 మంది స్థానిక యువతకి ఉపాధి చూపిస్తామన్నారు. లోదుస్తులతో పాటు విశ్రాంతి సమయంలో ధరించే (లీజుర్వేర్) గార్మెంట్స్‌ను ఇక్కడ తయారు చేస్తామన్నారు. ఏడాది కాలంలో నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభిస్తామని, ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తామని గణేశ్ హామీ ఇచ్చారు. తమ పెట్టుబడి ప్రణాళికకు అడుగడుగునా తెలంగాణ ప్రభుత్వం సహకరించిందని ధన్యవాదాలు తెలిపారు.






