Apollo Hospitals : అపోలో హాస్పిటల్స్ ఇంటర్నేషనల్ హెల్త్ డైలాగ్ 2026 తొలి రోజు..
‘గ్లోబల్ విజన్ ఫర్ పేషంట్ సేఫ్టీ’ అనే అంశంలో నాయకత్వం వహిస్తున్న భారత్…
హైదరాబాద్, జనవరి 30, 2026: అంతర్జాతీయ ఆరోగ్య చర్చా వేదిక (IHD) 2026 ఈరోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్త వైద్యులు, నిపుణులు మరియు విధాన నిర్ణేతలు పాల్గొన్న ఈ సదస్సు గ్లోబల్ వాయిసెస్ – వన్ విజన్ అనే ఇతివృత్తంతో సాగింది. మొదటి రోజు చర్చల్లో రోగుల భద్రతను ఒక ప్రధాన పరిపాలనా ప్రాధాన్యతగా గుర్తించారు. వైద్య సేవల్లో సమానత్వం మరియు డిజిటల్ సాంకేతికతను బాధ్యతాయుతంగా ఉపయోగించడంపై దృష్టి సారించారు. భారీ స్థాయిలో వైద్య సేవలు అందిస్తూనే నాణ్యతా ప్రమాణాలను పెంచుతున్న భారతదేశ అనుభవం, ప్రస్తుతం రోగుల భద్రత మరియు నమ్మకం విషయంలో ప్రపంచ దేశాలకు దిశానిర్దేశం చేస్తోందని ఈ సందర్భంగా నిపుణులు అభిప్రాయపడ్డారు.
సదస్సును ప్రారంభిస్తూ, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. సంగీతా రెడ్డి మాట్లాడారు. ఐహెచ్డి (IHD) అనేది కేవలం కొన్ని సంస్థలకే పరిమితం కాకుండా, అందరూ తమ అనుభవాలను పంచుకునే వేదికగా ఉండాలని ఆమె గుర్తు చేశారు. “మన ఆసుపత్రుల్లో, వ్యవస్థల్లో ఎన్నో కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ప్రతిరోజూ మనం ఎంతో నేర్చుకుంటున్నాం. కానీ ఈ జ్ఞానం మనకే ఎందుకు పరిమితం కావాలి? మనం దీన్ని అందరితో ఎందుకు పంచుకోకూడదు?” అని ప్రశ్నించారు. మనం నేర్చుకున్నది ఇతరులకు ఉపయోగపడాలనేదే తమ ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు. ఈ సదస్సుపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోందని, అందుకే ఈ ఏడాది 75కు పైగా ప్రపంచ స్థాయి సంస్థల నుండి 5 వేలకుపైగా రిజిస్ట్రేషన్లు, 300 పైగా పరిశోధనా పత్రాలు, 120కి పైగా అవార్డు ఎంట్రీలు వచ్చాయని ఆమె తెలిపారు.
ప్రయోగాత్మక ఫలితాల ప్రాముఖ్యతను వివరిస్తూ, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, రోగుల భద్రతలో సమానత్వం ఎందుకు కీలకమో వివరించారు. ఆయన మాట్లాడుతూ.. “మనం కొత్త విషయాలను పంచుకోవడం లేదా వ్యవస్థలను మెరుగుపరచడం గురించి మాట్లాడేటప్పుడు, ఒక నిజాన్ని అంగీకరించాలి. రోగులందరూ ఒకేలా ఉండరు. వేర్వేరు రోగులు వేర్వేరు పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరికీ భద్రత అంటే వేర్వేరు అర్థాలు ఉంటాయి” అని ఆయన అన్నారు. “సమానత్వ కోణంలో చూసినప్పుడు ఆటోమేటిక్ గా డిజైన్ కోణం కూడా మారుతుంది. రోగుల భద్రత అనేది నిజ జీవితంలో సాధ్యపడాలంటే, మనం ముఖ్యంగా బలహీన వర్గాల వారిని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు వేయాలి. సేవలు నిరంతరంగా అందేలా, అందరికీ అందుబాటులో ఉండేలా, ప్రజల ప్రవర్తనకు అనుగుణంగా వాటిని రూపొందించాలి”అని పేర్కొన్నారు. డిజిటల్ సేవలు అందరికీ అందడం గురించి చెబుతూ, డిజిటల్ వ్యత్యాసం అనేది కేవలం సౌకర్యాల కొరత మాత్రమే కాదని, చాలా వరకు అది మన ఆలోచనా విధానంలో ఉండే వ్యత్యాసం అని ఆయన అభిప్రాయపడ్డారు.
రోజంతా జరిగిన చర్చల్లో వక్తలందరూ ఒక ముఖ్యమైన విషయంపై ఏకాభిప్రాయానికి వచ్చారు: రోగుల భద్రత అనేది ప్రభుత్వాలు, ఆసుపత్రులు మరియు సాంకేతిక సంస్థలు అన్నీ కలిసికట్టుగా పనిచేసినప్పుడే సాధ్యమవుతుంది. అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, హాస్పిటల్ డివిజన్, ప్రెసిడెంట్, సీఈఓ డాక్టర్ మధు శశిధర్ మాట్లాడుతూ.. “బాధ్యతను అందరూ పంచుకోవాలి. రోగుల భద్రత అనేది ఎవరో ఒకరు చేసే పని కాదు, దీనికోసం ప్రభుత్వం, ఆసుపత్రులు మరియు టెక్నాలజీ సంస్థలు ఒకటిగా పనిచేయాలి. ఇది కేవలం ఒక విభాగానికి సంబంధించిన బాధ్యత మాత్రమే కాదు, నిజానికి ఇది సంస్థలోని నాయకత్వ బాధ్యత” అని స్పష్టం చేశారు.
అనేక చర్చల్లో ఒక ముఖ్యమైన విషయం వాదన వినిపించింది: సమస్య వచ్చాక చికిత్స చేయడం కంటే, అది రాకముందే నివారించే పద్ధతులకు మారడం చాలా అవసరం. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య వ్యవస్థలు ఎదుర్కొంటున్న ఒత్తిడి గురించి డాక్టర్ సంగీతా రెడ్డి మాట్లాడుతూ, వైద్య సేవల కోసం డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది, ఇలాంటి పెద్ద సమస్యలను పాత పద్ధతులతో పరిష్కరించలేము” అని అన్నారు. మెరుగైన నివారణ మార్గాలు, చికిత్స ఫలితాలను స్పష్టంగా లెక్కించడం మరియు డిజిటల్ పరికరాలను క్రమశిక్షణతో, బాధ్యతగా వాడటం ద్వారానే ఇది సాధ్యమవుతుందని ఈ చర్చల్లో తేలింది.
ప్రపంచవ్యాప్త నాణ్యత, భద్రతా ప్రమాణాల గురించి ఐఎస్క్యూఏ (ISQua) సీఈఓ డాక్టర్ కార్స్టన్ ఎంజెల్(Dr Carsten Engel) మాట్లాడుతూ, మనం చూపుతున్న శ్రద్ధకు మరియు క్షేత్రస్థాయిలో జరుగుతున్న మార్పులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. “రోగుల భద్రత గురించి మనం దశాబ్దాలుగా మాట్లాడుకుంటున్నా, ఇంకా అనుకున్న లక్ష్యాన్ని చేరలేదు” అని పేర్కొన్నారు. ప్రయోజనం లేని పనులను భద్రత పేరుతో పెంచుకుంటూ పోవద్దని హెచ్చరించారు. దీనివల్ల అనవసరమైన పద్ధతులు పెరిగిపోతాయే తప్ప భద్రత మెరుగుపడదని చెప్పారు. నాయకులు పరిస్థితులను, ప్రజల ప్రవర్తనను అర్థం చేసుకోవాలని కోరుతూ.. “ప్రజలు తాము చేయాల్సిన పనిని ఎందుకు చేయలేదని అడగకండి. వారు ఆ పనిని ఆ సమయంలో అలా ఎందుకు చేశారో, దానికి గల కారణాలేంటో తెలుసుకోండి” అని సూచించారు.
వైద్య ప్రమాణాలు, వాటి అమలుపై, నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ (NABH) సీఈఓ డాక్టర్ అతుల్ మోహన్ కొచ్చర్ మాట్లాడుతూ, అమలుకు మొదటి ప్రాధాన్యతనిచ్చే విధానం ఎంత అత్యవసరమో నొక్కి చెప్పారు. “రోగుల భద్రత అనేది కేవలం ఒక సాంకేతిక అంశం మాత్రమే కాదు. ఇది నైతిక, సామాజిక మరియు ఆర్థికపరమైన బాధ్యత. కేవలం విధానాలు మాత్రమే భద్రతను మెరుగుపరచలేవు. వాటిని అమలు చేసే సామర్థ్యం మాత్రమే మార్పు తీసుకువస్తుంది” అని పేర్కొన్నారు. కొలవదగిన రీతిలో లక్ష్యాలను బలపరుస్తూ, రోగుల భద్రత విషయానికి వస్తే మనం చాలా ప్రతిష్టాత్మకంగా ఉండాలి. రోగుల భద్రతకు సంబంధించి ఎటువంటి ముప్పు లేకుండా సున్నా హాని (Zero harm) అనే సంఖ్య మాత్రమే ఆమోదయోగ్యం అని వివరించారు.
రోగుల భద్రతను మెరుగుపరచడం మరియు జవాబుదారీతనాన్ని పెంచడంలో భాగంగా, అపోలో హాస్పిటల్స్ మరియు రోచె డయాగ్నోస్టిక్స్ ఇండియా(Roche Diagnostics India) మధ్య ఒక ఒప్పందం కుదిరింది. వైద్య నిర్ణయాలు తీసుకోవడంలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఏ విధంగా ఉపయోగించవచ్చో ఈ రెండు సంస్థలు కలిసి పరిశీలిస్తాయి. ఈ భాగస్వామ్యం ద్వారా ఏఐ ఇచ్చే సూచనలను వైద్యులకు సులభంగా అర్థమయ్యేలా మార్చి చికిత్సలో ఉపయోగిస్తారు. దీనివల్ల జబ్బుల ప్రమాదాలను ముందుగానే గుర్తించడం, చికిత్సలో తప్పులు లేకుండా చూడటం, అందరికీ ఒకే రకమైన నాణ్యమైన వైద్యం అందించడం సాధ్యమవుతుంది.
అపోలో ఆసుపత్రుల చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ రోహిణి శ్రీధర్ మాట్లాడుతూ, సంస్థతో పాటు వైద్య బృందాలు కలిసి నడిచినప్పుడే వ్యవస్థలు మెరుగుపడతాయని, సంస్కృతితో కూడిన మార్పు అవసరమని వివరించారు. వారు మాట్లాడుతూ “డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది మీతో కలిసి నడవనంత వరకు సున్నా హాని అనే లక్ష్యాన్ని సాధించడం సాధ్యం కాదు. ఏదైనా ఒక విభాగంలో పొరపాటు జరిగితే, దాని నుండి మిగిలిన అన్ని విభాగాలు వెంటనే పాఠాలు నేర్చుకోవాలి. సాంకేతికత నేర్చుకునే వేగాన్ని పెంచుతుంది. కానీ మనం తీసుకునే చర్యలు మన పని సంస్కృతిపైనే ఆధారపడి ఉంటాయి” అని స్పష్టం చేశారు.
ఆ రోజు తర్వాత, ఐహెచ్డీ 2026 కొత్తగా ప్రారంభించిన డిజిటల్ హెల్త్ స్టార్టప్ కమ్యూనిటీ కోసం ఒక ప్రత్యేక సెషన్‌ను నిర్వహించింది. ఇందులో ఎంపిక చేసిన కొన్ని స్టార్టప్‌లు ఇన్వెస్టర్లకు తమ ఐడియాలను వివరించాయి. వైద్యపరమైన, పనితీరులో ఉన్న వాస్తవ లోపాలను సరిదిద్దే పరిష్కారాలపై ఈ సెషన్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా సురక్షితమైన పని విధానాలు, నిర్ణయాలు తీసుకోవడంలో తోడ్పాటు, ముందస్తు రిస్క్ గుర్తింపు, మెరుగైన డాక్యుమెంటేషన్, రోగులతో అనుసంధానం వంటి అంశాలను చర్చించారు. కొత్త ఆవిష్కరణలను భద్రత, ఫలితాలు మరియు నమ్మకాన్ని బలపరిచే విధంగా, ఆచరణలో పెట్టగలిగే పరికరాలుగా మార్చాలనే ఐహెచ్డి ఉద్దేశాన్ని ఈ విభాగం మరింత బలోపేతం చేసింది.
ఐహెచ్డి 2026 సదస్సు జనవరి 31న హైదరాబాద్‌లో కొనసాగుతుంది. ఆ రోజు రోగుల భద్రత, డిజిటల్ మార్పులు, హెల్త్‌కేర్ ఆపరేషన్స్, క్లినికల్ లెర్నింగ్‌పై మరిన్ని చర్చలు, ప్రదర్శనలు ఉంటాయి.






