Sanchar Saathi: సంచార్ సాథీతో కోటిన్నర నంబర్లు బ్లాక్.. సైబర్ నేరాలకు చెక్!
సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘సంచార్ సాథీ’ (Sanchar Saathi) పోర్టల్, యాప్ అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఈ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సుమారు 1.52 కోట్ల మొబైల్ నంబర్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెల్లడించారు. వినియోగదారుల భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. సంచార్ సాథీ యాప్ పనితీరును వివరిస్తూ.. గతంలో విదేశాల నుండి వచ్చే నకిలీ కాల్స్ (Spam Calls) సంఖ్య 1.35 కోట్లుగా ఉండేదని, ఇప్పుడు అవి 95 శాతం మేర తగ్గాయని మంత్రి తెలిపారు. అంతే కాకుండా మోసపూరిత సిమ్ కార్డులతో లింక్ అయిన దాదాపు 27 లక్షల వాట్సాప్ ఖాతాలను కూడా నిలిపివేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు 2 కోట్ల మందికి పైగా వినియోగదారులు సంచార్ సాథీ (Sanchar Saathi) యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ (Sanchar Saathi) యాప్ ద్వారా ప్రభుత్వం ప్రజల వ్యక్తిగత వివరాలపై నిఘా పెడుతుందన్న ఆరోపణలను మంత్రి ఖండించారు. ఇందులో ఎలాంటి నిఘా (Snooping) ఉండదని, కేవలం సైబర్ మోసాలను అడ్డుకోవడానికే దీన్ని రూపొందించామని స్పష్టం చేశారు. డిజిటల్ భద్రతలో ఇది ఒక బలమైన ఆయుధంగా మారుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.






