CBN: రాష్ట్రంలో తొలి కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ను కుప్పంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి
కుప్పంలో మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కుంగుంది బౌల్డరింగ్ పార్క్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
కుప్పం, జనవరి 30: కుప్పం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు ప్రణాళికా బద్దంగా వెళ్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. వెనుకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. కుప్పంలో తొలి రోజు పర్యటనలో భాగంగా… శుక్రవారం కుప్పం మున్సిపాల్టీ పరిధిలో నవదిశ కేంద్రంలో ఏర్పాటు చేసిన హిందాల్కో-ఆదిత్య బిర్లా గ్రూప్-కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథార్టీ భాగస్వామ్యంతో మల్టీ స్కిల్ డెవలప్ సెంటర్ ఏర్పాటు చేశారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చేలా ఈ సెంటర్ పని చేయనుంది. మల్టీ స్కిల్ డెవలప్ సెంటర్ ద్వారా 2500 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. అలాగే సుమారు 20 వేల మంది యువతకు నైపుణ్యం, సాధికారత లభించేలా మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పని చేయనుంది. సీఎం చొరవతో సంబల్ పూర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తరహాలోనే కుప్పంలో మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారు.
కుప్పంలో ఏర్పాటైన స్కిల్ డెవలప్మెంట్, ఇన్నోవేషన్ గేట్ వేగా నవదిశ కేంద్రం వ్యవహరించనుంది. ఆదిత్య బిర్లా మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వచ్చే మూడేళ్ల్లల్లో 1000 మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించనున్నారు. అలాగే 700 మందికి ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళికలను రూపొందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూర్టీ, రోబోటిక్స్, మెకట్రానిక్స్, ఫ్యాషన్ టెక్నిషీయన్, ఐటీ ల్యాబ్ తదితర కోర్సుల్లో ఆదిత్య బిర్లా మల్టీ స్కిల్ డెవలప్ సెంటర్ నైపుణ్య శిక్షణ ఇవ్వనుంది. నవదిశ కేంద్రంలోని సేవలు అందించే వారితో సీఎం మాట్లాడారు. ఏయే రంగాల్లో నైపుణ్య శిక్షణ అందిస్తున్నారని ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఐటీఐ, పాలిటెక్నిక్ వంటి కోర్సులు చేసిన వారికి ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అధునాతన నైపుణ్యాలు అందించాలని సీఎం ఆదేశించారు. వెనుకబడిన నియోజకవర్గంగా ఉన్న కుప్పాన్ని అభివృద్ధి పథంలో నడిపించేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పని చేయాలని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఫ్యాషన్ టెక్నీషియన్ కోర్సులో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినులతో సీఎం ముచ్చటించారు.

ఆఫీస్ స్పేస్ లేని వారికి బాసటగా కో-వర్కింగ్ స్పేస్
ఇక ఇదే నవదిశ కేంద్రంలో కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. హైస్పీడ్ ఇంటర్నెట్, ఏసీ, ప్యాంట్రీ, స్టోరేజ్ వసతులతో 50 మంది పని చేసుకునేలా కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ను రూపొందించారు. ఇదే కాకుండా అదనంగా 40 మంది చదువుకునేలా లైబ్రరీ ఏర్పాటు చేశారు. ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థ సహకారంతో రూ.1 కోటి వ్యయంతో డిజిటల్ లైబ్రరీ ఏర్పాటైంది. మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, కో-వర్క్ స్పేస్ సెంటర్లను ప్రారంభించిన ముఖ్యమంత్రి అక్కడ చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఓవైపు నైపుణ్యంలో శిక్షణ ఇవ్వడంతోపాటు… ఆఫీస్ స్పేస్ లేని వారికి.. వర్క్ ఫ్రం హోం చేసుకునే వారికి బాసటగా కో-వర్కింగ్ స్పేస్ సెంటర్ ప్రారంభించామని సీఎం తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ తరహా సెంటర్ కుప్పంలో ప్రారంభించినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.
కుప్పంలో పర్యాటకులను ఆకట్టుకునేలా టూరిజం అభివృద్ధి
అంతకు ముందు కుప్పం రూరల్ మండలంలో వివిధ పర్యాటక అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. కుప్పం మండలంలోని కంగుంది హెరిటెజ్ విలేజ్-బౌల్టరింగ్ పార్కును ప్రారంభించారు. రూ.35 లక్షల వ్యయంతో హెరిటేజ్ విలేజ్-బౌల్డరింగ్ పార్కును డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ఏర్పాటు చేసింది. బౌల్డరింగ్ పార్కులో ఏర్పాటు చేసిన ట్రెక్కింగ్ బౌల్డర్ ను పరిశీలించారు. అలాగే ట్రెక్కింగ్ పై యువతకు శిక్షణ ఇస్తున్న విదేశీ ట్రైనర్లతో సీఎం మాట్లాడారు. బౌల్డరింగ్ పార్కు పై భాగంలో ఏర్పాటు చేసిన భారీ జాతీయ జెండాను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హోం స్టేలు, టెంట్ అకామిడేషన్లల్లో ఉన్న వసతులను ముఖ్యమంత్రి పరిశీలించారు. కంగుంది హెరిటెజ్ విలేజీలో 32 హోం స్టేలు, 9 టెంట్ అకామిడేషన్లను అందుబాటులోకి తెచ్చారు. పర్యాటలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రం నుంచి పర్యాటకులను ఆకర్షించడమే కాకుండా… తమిళనాడు, కర్ణాటకకు సమీపంలో కుప్పం ఉండడంతో పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. అలాగే వివిధ రకాల కళాకృతులు, పురాతన గోడ చిత్రాలను సీఎం పరిశీలించారు.
డిస్కవర్ కుప్పం పేరుతో ఏర్పాటు చేసిన టూరిజం వెబ్ సైట్ ను ముఖ్యమంత్రి లాంఛ్ చేశారు. రూ. 4.85 కోట్ల ఏపీఎస్బీసీఎల్ సీఎస్సార్ నిధులతో కుప్పం పర్యాటక అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. కుప్పం పర్యాటక అభివృద్ధికి సంబంధించి ఏపీ బెవరేజెస్ కార్పోరేషన్ అధికారులు ఆ మొత్తానికి ముఖ్యమంత్రికి చెక్కును అందించారు. వీటితో పాటు నూతనంగా నిర్మించిన పున్నమి రిస్టార్ట్స్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ రిసార్ట్ట్స్ లో 18 లగ్జరీ రూంలు, యాంఫీ థియేటర్, మీటింగ్ హాల్, రెస్టారెంట్ ఉన్నాయి. అలాగే ఇదే ప్రాంగణంలో హిల్ వ్యూ కేప్ ను కూడా సీఎం ప్రారంభించారు. కొండ కింద నుంచి కుంగింది బౌల్డర్ హిల్ వరకు కాలి నడకనే సీఎం పర్యటించారు. కొండ కింద నుంచి ఇరువైపులా గోడలకు ఉన్న చిత్రాలను పరిశీలించుకుంటూ కొండ ఎగువ భాగం వరకు వెళ్లారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎంపీ డి.ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఆర్టీసీ డిప్యూటీ చైర్మన్ మునిరత్నం నాయుడు సహా జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు, కుప్పం స్థానిక నేతలు పాల్గొన్నారు.






