PT Usha: పీటీ ఉష ఇంట తీవ్ర విషాదం.. భర్త శ్రీనివాసన్ కన్నుమూత
భారత ఒలింపిక్ సంఘం (IOA) అధ్యక్షురాలు, రాజ్యసభ ఎంపీ పీటీ ఉష (PT Usha) కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె భర్త వెంగలిల్ శ్రీనివాసన్ (67) శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కేరళలోని కోజికోడ్‌లో ఉన్న స్వగృహంలో అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో ఆయన అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాసన్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే పీటీ ఉషకు ఫోన్ చేసిన ఆయన సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుతో పాటు పలువురు క్రీడా ప్రముఖులు కూడా తమ సంతాపాన్ని ప్రకటించారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
శ్రీనివాసన్ గతంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో డిప్యూటీ ఎస్పీగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన కూడా క్రీడా రంగంలో, ముఖ్యంగా కబడ్డీలో మంచి గుర్తింపు పొందారు. 1991లో పీటీ ఉషను (PT Usha) వివాహం చేసుకున్నారు. వీరికి ఉజ్వల్ విఘ్నేష్ అనే కుమారుడు ఉన్నారు. శ్రీనివాసన్ మరణంపై క్రీడా లోకం విచారం వ్యక్తం చేస్తోంది.






