RBI: నిజాం నగలు ఆర్బీఐ వద్దే భద్రం: కేంద్రం స్పష్టత
హైదరాబాద్ నిజాం రాజులకు చెందిన అపురూపమైన ఆభరణాలు, రత్నాలు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) వద్ద అత్యంత సురక్షితంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఆభరణాల చారిత్రక, సాంస్కృతిక విశిష్టతను దృష్టిలో ఉంచుకుని, వాటిని కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆర్బీఐ (RBI) వాల్ట్స్‌లో భద్రపరిచినట్లు వెల్లడించింది. రాజ్యసభలో సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఈ మేరకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
నిజాం కాలం నాటి 173 అత్యంత విలువైన ఆభరణాలు 1995 నుంచి ఆర్బీఐ (RBI) అధీనంలో ఉన్న విషయం ప్రభుత్వానికి తెలుసా? అని సభ్యులు ప్రశ్నించగా.. మంత్రి తెలుసునని బదులిచ్చారు. అయితే ఈ ఆభరణాలను హైదరాబాద్‌కు తరలించి, ప్రజల సందర్శనార్థం ప్రదర్శించే అంశంపై ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి స్పష్టం చేశారు. స్వాతంత్ర్యానికి పూర్వం హైదరాబాద్‌ను పాలించిన నిజాం రాజుల సంపదలో ఈ ఆభరణాలు భాగం. తర్వాత కాలంలో ఇవి భారత ప్రభుత్వ స్వాధీనంలోకి వచ్చాయి. జాకబ్ డైమండ్ వంటి అరుదైన వజ్రాలు, రత్నాలు, పచ్చల హారాలు ఈ నిధిలో ఉన్నాయి. వీటిని హైదరాబాద్‌లో శాశ్వతంగా ప్రదర్శించాలని తెలంగాణ ప్రజల నుండి ఎప్పటి నుండో డిమాండ్ ఉన్నప్పటికీ, భద్రతా కారణాల రీత్యా అవి ఇంకా ఆర్బీఐ (RBI) వద్దనే ఉన్నాయి.






