Vaishali District: శ్మశానవాటిక దారి మూసివేత.. నడిరోడ్డుపైనే అంత్యక్రియలు నిర్వహించి గ్రామస్తుల నిరసన
బీహార్: బీహార్లోని వైశాలీ జిల్లాలో దారి ఆక్రమణల కారణంగా ఒక వృద్ధురాలి అంత్యక్రియలు నడిరోడ్డుపైనే నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. గోరౌల్ రాణా పరిధిలోని సోంధో వసుదేవ్ గ్రామానికి చెందిన ఝాన్సీదేవి (91) ఇటీవల మరణించారు. ఆమె మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు తరలిస్తుండగా, మార్గమధ్యలో ఉన్న పొలాల యజమానులు దారిని అడ్డుకున్నారు.
శ్మశానానికి వెళ్లడానికి ఉన్న ఏకైక మార్గాన్ని ఆక్రమణలతో మూసివేయడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనికి నిరసనగా, స్థానిక శివాలయం ముందున్న ప్రధాన రహదారిపైనే చితిని పేర్చి, అక్కడే అంత్యక్రియలు పూర్తి చేశారు. శ్మశానవాటిక భూమి ప్రభుత్వ ఆస్తి అయినప్పటికీ, భూస్వాములు పదేపదే దారిని అడ్డుకుంటున్నారని, గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా సార్లు జరిగాయని గ్రామస్తులు వాపోయారు. ఈ విషయంపై స్పందించిన బీడీఓ పంకజ్ కుమార్ నిగమ్, ప్రభుత్వ దారిని అడ్డుకునే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.






