KTR: సీఎం సంతకం చేసిన ఫైలే మాయం.. సిట్ వేయాల్సిందే: కేటీఆర్
KTR: తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని అహంకారంతో వ్యవహరించేవారు శాశ్వతం కాదని, వారు సంపదను మూటగట్టుకుపోలేరని పరోక్షంగా చురకలు అంటించారు.
మాయమైన ఫైల్‌పై ‘సిట్’ వేయాలి:
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు తొలి కేబినెట్లోనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. బహిరంగ వేదికపై ముఖ్యమంత్రి సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడుందో ఎవరికీ తెలియడం లేదని, ఆ మాయమైన దస్త్రం కోసం ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేయాలని ఆయన ఎద్దేవా చేశారు. సీఎం సంతకం చేసిన ఫైల్‌కే దిక్కులేకపోతే, కాంగ్రెస్ మాటలను ప్రజలు ఎలా నమ్ముతారని నిలదీశారు.
ఇవి కూడా చదవండి
ఐటీ ఉద్యోగాల తగ్గుదలపై ఆందోళన:
రాష్ట్రంలో ఐటీ రంగం పరిస్థితిపై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. 2023లో 9.46 లక్షలుగా ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య, తాజా గవర్నర్ ప్రసంగం నాటికి 9.39 లక్షలకు పడిపోయిందని గణాంకాలతో వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సుమారు 7 వేల ఉద్యోగాలు తగ్గిపోయాయని, దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ పర్యటనలపై విమర్శలు:
కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రం కోసం నిధులు తెస్తారనుకుంటే, ఇక్కడి నుండి నిధులు ఇచ్చి వస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో కేంద్రం నుండి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోయినా, రాష్ట్రాన్ని ఆర్థికంగా బలంగా నిలబెట్టామని ఆయన గుర్తుచేశారు. తెలంగాణ ఎప్పుడూ కేంద్రంపై ఆధారపడే రాష్ట్రం కాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి






