19 జిల్లాల్లో ప్రభుత్వ డయాగ్నోసిస్ కేంద్రాలు : సీఎం కేసీఆర్

కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నాయి. ప్రజల నుంచి తీవ్రంగా డబ్బులు దండుకున్నాయి. ఇలా డబ్బులు దండుకోవడంపై తెలంగాణ హైకోర్టు కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. కరోనా కారణంగా ప్రజలు ఇబ్బంది పడకుండా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాలలోని, ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో 19 డయాగ్నోసిస్ సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. సోమవారం నుంచి ఈ డయాగ్నోసిస్ కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యాధికారులతో శనివారం ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగానే 19 జిల్లాల్లో డయాగ్నోసిస్ సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించారు. ఆ జిల్లాలు వరుసగా… నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నిర్మల్, ఆదిలాబాద్, గద్వాల, ఆసిఫాబాద్, కరీంనగర్, జగిత్యాల, నల్గొండ, సిద్దిపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని ప్రధాన వైద్య కేంద్రాలలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం నుంచి వాటిని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్ష్యం: కేసీఆర్
తెలంగాణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు, అన్ని రకాల వైద్య సేవలను మరింతగా అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కరోనా నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సలహా పలు ఇతర ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని సూచించారు. ప్రజలకు బాగు కోసమే ప్రభుత్వం ఖర్చుకు వెనకాడటం లేదని, అందుకే డయగ్నసిస్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కేంద్రాల్లో ఆటోమెటిక్ క్లినికల్ కెమిస్ట్రీ అనలైజర్, పుల్లీ ఆటోమెటిక్ ఇమ్యునో అస్సే అనలైజర్, ఫైవ్ పార్ట్స్ సెల్ కౌంటర్ లాంటి అత్యాధునిక సాంకేతికతతో కూడిన యంత్రాలు ఉంటాయని సీఎం తెలిపారు. వీటితో పాటు ఈసీజీ, టుడీ ఈకో, అల్ట్రాసౌండ్, డిజిటల్ ఎక్స్‌రే వంటి పరీక్షా యంత్రాలను కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కో యంత్రం గంటకు 400 నుంచి 800 రిపోర్టులను అత్యంత కచ్చితత్వంతో అందచేస్తాయని వెల్లడించారు. ఈ కేంద్రాల్లో అవసరమైన సిబ్బందిని కూడా తాము అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
వైద్యం అత్యంత ఖరీదైపోయింది : సీఎం
రానూ రానూ వైద్యం అత్యంత ఖరీదుగా మారిపోయిందని, పేదలకు జబ్బు చేస్తే నయం చేయించుకోడానికి ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.సామాన్యుడికి వైద్యాన్ని మరింత అందుబాటులోకి తెచ్చి, ఆరోగ్య తెలంగాణను తీర్చిదిద్దుతున్న తమ ప్రభుత్వంతో మరో అడుగు పడిందని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందనడానికి ఇదే తార్కాణమని సీఎం కేసీఆర్ తెలిపారు.